నకిలీ కరెన్సీతో వ్యాపారిని మోసం చేసిన ఇద్దరు విదేశీయులను మియాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.10లక్షల నగదు, రసాయనాలు స్వాధీనం చేసుకున్నారు.
మియాపూర్ ఇన్‌స్పెక్టర్ జయరాం, డిఐ విజయ్ నాయక్ శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.ఆఫ్రికాలోని కెమరూన్ దేశానికి చెందిన తురే ఎల్ హాడ్జి మహమనే(49) నగరంలోని ఖజానగర్, అత్తాపూర్‌లో ఉంటూ ఆన్‌లైన్ వ్యాపారం చేస్తున్నాడు. నిందితుడు గుజరాత్‌లో 2022లో మోసం చేయడంతో చీటింగ్ కేసు, హైదరాబాద్‌లో కేసు ఉంది. ఆఫ్రికాకు చెందిన ట్చౌయాన్యు అడోల్ఫ్ ఆన్‌లైన్ వ్యాపారం చేస్తు ఢిల్లీలోని వసంత్‌కుంజ్‌లో ఉంటున్నాడు. ఈ నెల 20వ తేదీన కృష్ణ కాంత్ వడ్లాని అనే వ్యాపారితో నిందితులు ఆన్‌లైన్‌లో పరిచయం చేసుకున్నారు. ప్రత్యేక కెమికల్ ద్వారా డబ్బును రెట్టింపు (డబుల్) చేయవచ్చని బాధితుడిని నిందితులు నమ్మించారు.
నల్లటి కాగితాలు, రసాయనాలను ఉపయోగించి డబ్బును రెట్టింపు చేసే నకిలీ డెమో చూపించి బాధితుడిని నమ్మించారు. వారి మాటలు నమ్మిన బాధితుడు రూ. 20లక్షల నగదు వారికి ఇచ్చాడు, నిందితులు ఆ నగదును ఒక పెట్టెలో పెట్టి, తాము మళ్లీ 'స్పెషల్ కెమికల్' తీసుకువచ్చే వరకు పెట్టెను తెరవవద్దని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. వెళ్లిన వారు చాలా సేపైన తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చిన బాధితుడు పెట్టె తెరచి చూడగా, అందులో నగదుకు బదులుగా తెల్లటి కాగితాలు, కలర్ జిరాక్స్ కాగితాలు కనిపించాయి. తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.కేసు నమోదు చేసుకున్న మియాపూర్ పోలీసులు, సాంకేతిక ఆధారాలు సేకరించి నిందితులను గుర్తించారు. నిందితులను అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

