ప్రత్యేక అధికారాలు ఉపయోగించిన సుప్రీంకోర్టు
నీట్ పేపర్ లీక్ మృతుల కుటుంబాలకు మూడు మాసాల్లో పరిహారం
నిరసనల్లో పాల్గొన్న తీవ్ర నేరాలు ఎదుర్కొంటున్న వారిపై కొత్త కేసుల నమోదుకు కోర్టు ఆదేశం
ఈ నెల 5నాటి నిరసన ర్యాలీ విరమించుకున్న సిజెపి
న్యూఢిలీ : కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) కార్యకర్తలు, నిరసనకారులు, అభిమానులకు భారీ ఊరట కలిగిస్తూ మంగళవారంనాడు సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. సిజెపి ఆధ్వర్యంలో జూలై 20 నుంచి 25 వరకు దేశవ్యాప్తంగా జరిగిన ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులపై నమోదైన అన్ని ఎఫ్‌ఐఆర్‌లను సుప్రీం కొట్టివేసింది. అదే సమయంలో ప్రశ్నపత్రం లీకేజీ నేపథ్యంలో ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థుల కుటుంబాలకు మూడు నెలల్లోగా పరిహారం అందించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
సుప్రీం తీర్పు నేపథ్యంలో సెప్టెంబర్ 5న దేశ రాజధానిలో నిర్వహించ తలపెట్టిన నిరసన ర్యాలీని విరమిస్తున్నట్లు సిజెపి ప్రకటించింది. యువ ఆందోళనకారుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద తమకు సంక్రమించిన అధికారాలను ఉపయోగించి 'సంపూర్ణ న్యాయం' చేయాలని నిర్ణయించినట్లు ధర్మాసనం పేర్కొంది. కేంద్ర ప్రభుత్వంతో పాటు మహారాష్ట్ర, అసోం, బీహార్, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలు ఆందోళనలకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌లను కొట్టివేయాలని కోరినట్లు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ధర్మాసనానికి తెలిపారు.
ఈ విజ్ఞప్తిని అంగీకరించిన సుప్రీంకోర్టు తాజా ఆదేశాలు జారీ చేసింది. అయితే జంతర్‌మంతర్ వద్ద జరిగిన నిరసనలో పాల్గొన్నట్లు గుర్తించిన 2,873 మంది తీవ్ర నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుపై కొత్తగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయాలని ఢిల్లీ పోలీసులకు ఆదేశించింది. వీరికి తీవ్రమైన నేర చరిత్ర ఉన్నట్లు నేషనల్ క్రైమ్ రికారడ్స్ బ్యూరో డేటాబేస్ ఆధారంగా ప్రాథమికంగా గుర్తించినట్లు పోలీసుల తరఫున దాఖలైన పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే కొత్తగా నమోదు చేసే కేసులు కేవలం వ్యక్తులకు శారీరక హాని కలిగించడం, ఆస్తుల ధ్వంసం వంటి రెండు రకాల ఆరోపణలకే పరిమితం కావాలని ధర్మాసనం స్పష్టం చేసింది. జూలై 20 నుంచి 25 మధ్య ఇదే ఆందోళనకు సంబంధించి ఇతర రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాల్లో నమోదై, ఈ కేసు విచారణకు ముందుకు రాని ఎఫ్‌ఐఆర్‌లు ఏవైనా ఉంటే వాటినీ కొనసాగించరాదని, అవన్నీ మూసివేసినట్లుగానే పరిగణించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ఇక నీట్ మృతుల కుటుంబాలకు దేశవ్యాప్తంగా అమలు చేసే విధంగా పరిహారం చెల్లింపుపై ప్రత్యేక విధానాన్ని రూపొందించాలని కేంద్రాన్ని ఆదేశించింది. రూపొందించిన విధానాన్ని సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు, అమలు సంస్థలకు పంపించాలని సూచించింది. ఈ విధానం మూడు నెలల్లోగా రూపొందించి పరిహారం చెల్లించాలని ధర్మాసనం పేర్కొంది.

