ఆ పాపకి వయసు ఏడు సంవత్సరాలే. కానీ, ఒక కాలు మాత్రమే పని చేస్తుంది. దీంతో తన తోటి వయసు చిన్నారులతో ఆడుకోవాలని ఉన్నా.. ఆడలేని పరిస్థితి. కానీ, స్కూల్‌కి వెళ్లడంలో మాత్రం వెనకడుగు వేయలేదు.
ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన రాగిణి ఒంటికాలితో రోజూ 400 మీటర్లు గెంతుతూ స్కూల్‌కి వెళ్తుంది. ఈ విధంగా వెళ్లడం కష్టంగా అనిపిస్తోందని.. తనకు ఓ చక్రాల బండి ఇస్తే బడికెళ్లి చదువుకుంటానని అధికారులను వేడుకుంది. చిన్నారి మాట్లాడిన ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కొన్నేళ్ల క్రితం జరిగిన ఓ ప్రమాదంలో చిన్నారి రాగిణి కాలికి తీవ్ర గాయాలు అయ్యాయని.. అనేక ప్రభుత్వాసుపత్రులకు తీసుకెళ్లి చికిత్స చేయించామని రాగిణి తల్లి బబితా దేవి పేర్కొన్నారు. మెరుగైన చికిత్స కొసం పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు ఆవుతుందని చెప్పడంతో ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఇంటికి తీసుకు వచ్చేసినట్లు తెలిపారు. దాంతో చిన్నారి ఓ కాలు కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాగిణి పరిస్థితిపై స్కూల్ ప్రిన్సిపల్ అజిత్ పాల్ మాట్లాడుతూ.. పాఠశాలకు రావడానికి చిన్నారి చాలా ఇబ్బంది పడుతోందన్నారు. ప్రభుత్వ పథకం కింద ఆమె రిజిస్ట్రేషన్ పూర్తయినప్పటికీ, ప్రవేశం ఆలస్యంగా జరగడం వల్ల ఆ పథకం ప్రయోజనాలను పొందలేకపోయిందని తెలిపారు. చిన్నారి కథ సోషల్‌మీడియాలో వైరల్ కావడంతో ఆప్ రాజ్యసభ ఎంపి సంజయ్ సింగ్ సాయం చేయడానికి ముందుకు వచ్చారు. రాగిణికి ట్రైసైకిల్‌ను, ఆమె కుటుంబానికి రూ.26,500 ఆర్థిక సాయాన్ని అందించారు.

