ఆఫ్రికా తీరంలో ఉన్న డచ్ క్రూయిజ్ నౌక ఎంవి హోండియస్ లో ప్రమాదకరమైన హంటా వైరస్ వ్యాప్తి చెంది ముగ్గురు ప్రయాణికులు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్ర అనారోగ్యంతో ప్రాణభయంతో బాధపడుతున్నారు.
ఈ వైరస్ రోడెంట్స్ అనే ఎలుకల ద్వారా సోకుతుంది. తీవ్రమైన శ్వాసకోశ ఇబ్బందులను కలిగిస్తుంది. మృతుల్లో ఇద్దరు డచ్ దంపతులు, జర్మన్ పౌరుడు ఉన్నారు. ప్రస్తుతం నౌకలో దాదాపు 150 మంది ప్రయాణికులు ఉన్నారు. నౌకను కేప్‌వర్డ్ తీరంలో నిలిపివేశారు. ఈ వైరస్ నౌకలో ఒకరి నుంచి మరొకరికి వ్యాపించిందని ప్రపంచ ఆరోగ్యసంస్థ అనుమానిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ , షిప్ ఆపరేటర్ వెల్లడించిన వివరాల ప్రకారం అర్జెంటీనా నుంచి ఈ నౌక బయల్దేరింది.
అంటార్కిటికా, అట్లాంటిక్ మహా సముద్రంలో వారం రోజుల పాటు ఈ యాత్ర కొనసాగాల్సి ఉంది. అయితే అంతలోనే వైరస్ వ్యాప్తి చెందడంతో సహాయం కోసం నౌక నుంచి స్థానిక అధికారులకు అభ్యర్థన వెళ్లినా ప్రజారోగ్య దృష్టా నౌక నుంచి వారు దిగడానికి అనుమతి లభించలేదని కేప్ వెర్డే ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. మే 4 నాటికి 7 హంటా వైరస్ కేసులు వెలుగు లోకి వచ్చాయి. మృతి చెందిన జర్మన్ జాతీయుడి మృతదేహం ఇప్పటికీ ఆ నౌకలోనే ఉందని మీడియా వెల్లడించింది.

