ఛండీగఢ్: పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో పట్టపగలు దారుణ హత్య జరిగింది. స్కూటర్ అడ్డు తొలగించమన్న చిన్న వివాదంలో 28 ఏళ్ల యువకుడు అమిత్ సబర్వాల్‌ను దుండగులు కాల్చి చంపారు.
మృతుడి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం...... నిందితులు యాక్టివాపై వచ్చి అమిత్‌ను తన బైక్‌ను పక్కకు తీయమని అడిగారు. అమిత్ పక్కకు తీయడానికి ప్రయత్నించగా, ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఆగ్రహించిన నిందితుడు తుపాకీ తీసి కాల్పులు జరిపాడు. సుమారు 5 నుంచి 6 రౌండ్లు కాల్పులు జరపగా, ఒక బుల్లెట్ అమిత్ తలలోకి దూసుకెళ్లింది. అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు. అనంతరం నిందితులు పరారయ్యారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడి తండ్రి సునీల్ కుమార్ సబర్వాల్ ఫిర్యాదు మేరకు ముగ్గురు నిందితులు అభి షా, సన్నీ షా, దితి షాలపై హత్య కేసు నమోదు చేశారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు, చుట్టుపక్కల సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని అమిత్ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

