టెహ్రాన్: ఇరాన్-అమెరికా దేశాల మధ్య వైమానిక డాడులు మరోసారి తీవ్రస్థాయికి చేరాయి. రెండు దేశాలు పరస్పరం వైమానిక దాడులు చేసుకుంటుండంతో మళ్లీ పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
జోర్డాన్‌లోని అమెరికా సైనిక లక్ష్యాలపై ఇరాన్ మరోసారి బాలిస్టిక్ క్షిపణుల దాడి చేసిందని ఆ దేశ ప్రభుత్వ మీడియా తెలిపింది.
మంగళవారం ఐదు ఇరాన్ ముడి చమురు రవాణా నౌకలను ధ్వంసం చేసినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. గత రెండు రోజులుగా ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ రెండుసార్లు బాలిస్టిక్ క్షిపణులతో అమెరికా నౌకాదళ యుద్ధనౌకపై దాడి చేయడానికి ప్రయత్నించిన తర్వాత ఈ చర్య చేపట్టినట్లు అమెరికా సైన్యం తెలిపింది. దీంతో ఇరాన్, అమెరికా సైనిక లక్ష్యాలు టార్గెట్ గా బాలిస్టిక్ క్షిపణులతో దాడులకు దిగింది. జోర్డాన్‌లో అమెరికా దళాలు ఉపయోగించే కీలకమైన మువఫ్ఫాక్ సాల్టీ వైమానిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడి చేసింది. ఈ స్థావరంలో ఉన్న యుద్ధ విమానాలతో సహా అమెరికా సైనిక ఆస్తులను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ తెలిపింది.
అయితే, ఇరాన్ ప్రయోగించిన 20 బాలిస్టిక్ క్షిపణులలో 18 క్షిపణులను తమ వాయు రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయని జోర్డాన్ సాయుధ దళాలు తెలిపాయి. మిగిలిన రెండు క్షిపణులు జనావాసాలు లేని ప్రాంతాల్లో పడ్డాయని జోర్డాన్ సైన్యం పేర్కొంది. ఈ దాడిలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపింది.

