అమెరికాలో భారత సంతతికి చెందిన ఓ యువ పైలట్ పెళ్లైన కొద్ది గంటల్లోనే హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన చోటుచేసుకుంది. కేరళ మూలాలు కలిగిన 26 ఏళ్ల డేవ్ ఫిజీ తన నవవధువుతో హనీమూన్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
మీడియా కథనాల ప్రకారం, అమెరికాలోని జార్జియా రాష్ట్రంలోని డాసన్‌విల్ ప్రాంతంలో వివాహ వేడుక ముగిసిన అనంతరం డేవ్ ఫిజీ, ఆయన భార్య జెస్స్నీ హెలికాప్టర్‌లో ప్రయాణం ప్రారంభించారు. వారు ప్రయాణిస్తున్న రాబిన్సన్ ఆర్66 హెలికాప్టర్ వివాహ వేదిక సమీపంలోనే కుప్పకూలింది. ఈ ప్రమాదంలో డేవ్ ఫిజీ అక్కడికక్కడే మృతి చెందగా, హెలికాప్టర్ నడుపుతున్న పైలట్ కూడా ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఆ పైలట్ వివరాలను అధికారులు ఇంకా వెల్లడించలేదు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన జెస్స్నీ ప్రాణాలతో బయటపడింది. వృత్తిరీత్యా నర్సుగా పనిచేస్తున్న ఆమె ప్రస్తుతం అట్లాంటా నగరంలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకుంటున్నట్లు సమాచారం.
డేవ్ తండ్రి జార్జ్ ఫిజీ స్థానిక మీడియాతో మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. "నా కుమారుడు చాలా సంతోషంగా ఉన్నాడు" అని ఆయన తెలిపారు. డేవ్, జెస్స్నీ దాదాపు పదేళ్ల క్రితం న్యూ టెస్టమెంట్ చర్చిలో పరిచయం అయ్యారని ఆయన చెప్పారు. ఆ పరిచయం ప్రేమగా మారి చివరకు వివాహ బంధానికి దారితీసిందని వివరించారు.శుక్రవారం డాసన్‌విల్‌లోని ది రివేర్ అనే వేదికలో వీరి వివాహం ఘనంగా జరిగింది. దాదాపు 400 మంది అతిథులు ఈ వేడుకకు హాజరైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే ఆనందోత్సాహాల మధ్య జరిగిన ఈ వివాహం కొద్ది గంటల్లోనే విషాదంగా మారడం కుటుంబ సభ్యులను, స్నేహితులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. డేవ్ ఫిజీ అమెరికాలోని ప్రముఖ విమానయాన సంస్థ డెల్టా ఎయిర్ లైన్స్‌లో ఫస్ట్ ఆఫీసర్‌గా (సహ పైలట్‌గా) విధులు నిర్వహిస్తున్నాడు. ఈ ప్రమాదానికి గల కారణాలపై అమెరికా అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

