Dailyhunt
'పేరు'కుపోయిన వివక్ష

'పేరు'కుపోయిన వివక్ష

భారతీయ సామాజిక ముఖచిత్రంపై కొన్ని పేర్లు, ఇంటి పేర్లు అక్షరాలా పచ్చబొడిచిన అవమానాలు. ఒక వ్యక్తి పుట్టకతోనే 'దొంగ' అని, 'ముష్టి'వాడని, 'పశువు' అని లేదా 'అంటరానివాడని' ముద్రవేయడం ఆధునిక నాగరికతకే సిగ్గుచేటు.

శతాబ్దాల నాటి కుల అహంకారం, వర్ణ వివక్ష పెంచి పోషించిన ఈ 'భాషా హింస'ను ఇంకా మోయడం అంటే మన ప్రజాస్వామ్య వైఫల్యమే. భారతీయ సమాజంలో మనం ఎన్నో సామాజిక సంస్కరణల గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ, ఇప్పటికీ కొన్ని వేల కుటుంబాలు తాము ధరిస్తున్న 'ఇంటిపేర్ల' కారణంగా అనుక్షణం మానసిక వేదనను, అవమానాన్ని అనుభవిస్తున్నాయి. కుక్కల, పందుల, లంజపెళ్లి, ముష్టి, వెలి వంటి అసభ్యకరమైన, వివక్ష పూరితమైన ఇంటిపేర్లు కేవలం పేర్లు మాత్రమే కాదు..

అవి ఒకనాటి అణచివేతకు మిగిలిన ఆనవాళ్లు. 'పేరు' అనేది కేవలం ఒక సంబోధన కాదు, అది ఒక మనిషి ఆత్మగౌరవ నినాదం. కానీ మన సమాజంలో కొన్ని ఇంటి పేర్లు ఆ వ్యక్తిని నిరంతరం కించపరిచేలా రూపొందించబడ్డాయి. జంతువుల పేర్లతో (కుక్కల, పందుల, గొర్ల, మందుల) మనిషిని పశువుగా చూడాలనే హీనమైన ఆలోచన నుంచి ఇవి పుట్టాయి. వృత్తిపరమైన అవమానం (ముష్టి, చాకలి, మంగలి)తో వృత్తినే కించపరిచేలా ఇంటిపేర్లుగా మార్చడం వెనుక ఉన్న ఉద్దేశం ఆ వ్యక్తిని సమాజంలో నిరంతరం తక్కువ స్థాయిలోనే ఉంచడం. ఇంటి పేర్లు కొన్ని అసభ్యకరమైన పదజాలం (లంజపెళ్లి, గుద్దల, బరిబద్దల)తో వుండి అవమానకరంగా వుంటున్నాయి. ఇవి కేవలం పేర్లు కావు, ఆ కుటుంబాల స్త్రీ పురుషుల గౌరవాన్ని నిలువునా దహించే నిప్పుకణికలు. చారిత్రక కోణంలో చూస్తే, ఈ ఇంటిపేర్లు యాదృచ్ఛికంగా వచ్చినవి కావు. ఒక వర్గాన్ని మానసికంగా దెబ్బతీయడానికి, వారిలో ఆత్మన్యూనతా భావాన్ని (Inferiority Complex) నరనరాల్లో నింపడానికి అప్పట్లో పెత్తందారీ శక్తులు చేసిన కుట్ర ఇది.

చదువుకున్న మేధావులు, బుద్ధిజీవులు గుర్తించాల్సింది ఏంటంటే, భాష ద్వారా జరుగుతున్న ఈ హింస, శారీరక హింస కంటే భయంకరమైనది. ఒక విద్యార్థి తరగతి గదిలో తన ఇంటిపేరు చెప్పడానికి తడబడుతున్నాడంటే, అది ఆ పిల్లాడి బలహీనత కాదు, ఈ వ్యవస్థ రుద్దిన వైకల్యం. మన రాజ్యాంగం ప్రకారం ప్రతి పౌరుడికీ 'గౌరవంగా జీవించే హక్కు' (Article 21) ఉంది. కేవలం తాకకపోవడం మాత్రమే అంటరానితనం కాదు, ఒక వ్యక్తిని కులం పేరుతోనో, హీనమైన ఇంటిపేరుతోనో పిలవడం కూడా అంటరానితనమే. అయినప్పటికీ చట్టంగాని, అధికారులు గాని నామమాత్రంగానైనా ఆ వైపుగా ఆలోచన చేయకపోవడం అవమానకరమైన పేర్లను, ఇంటి పేర్లను కొనసాగాలని కోరుకోవడమే కాక మరొకటి కాదు. ప్రభుత్వాలు కేవలం చట్టాలు చేస్తే సరిపోదు, ప్రజల ఆలోచనా విధానంలో మార్పు రావాలి. ఎవరైనా తమ అగౌరవ ఇంటిపేరును మార్చుకోవాలనుకుంటే, ఎలాంటి రుసుము లేకుండా, వారం రోజుల్లోనే సర్టిఫికెట్లు ఇచ్చేలా డిజిటల్ వ్యవస్థను తీసుకురావాలి. కుల చిహ్నాలు లేని, ప్రకృతికి సంబంధించిన లేదా ఆదర్శనీయమైన పదాలను పేర్లుగా, ఇంటిపేర్లుగా ఎంచుకునే హక్కును పౌరులకు కల్పించాలి. ప్రజల్లో సామాజిక చైతన్యం కోసం 'నీ పేరులో గౌరవం ఉండాలి' అనే నినాదంతో పౌరసమాజం పెద్ద ఎత్తున ఉద్యమించాలి.

చదువుకున్న సమాజంలో కూడా ఇటువంటి పేర్ల వల్ల విద్యార్థులు, ఉద్యోగులు హేళనకు గురవుతూ తమ ఆత్మగౌరవాన్ని కోల్పోతున్నారు. ఈ సున్నితమైన అంశంపై సామాజిక చైతన్యాన్ని రగిలించే ఉద్దేశంతో, ప్రభుత్వాలు, మేధావులు ఈ సమస్యపై స్పందించి ఒక సమగ్ర కార్యాచరణను రూపొందించి అమలు పరచాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకోవాలి. తక్షణమే 'ఆత్మగౌరవ నామకరణ చట్టాన్ని' తీసుకు రావాలి. అగౌరవకరంగా ఉన్న పేర్లను, ఇంటిపేర్లను మార్చుకోవడం కోసం ప్రత్యేక 'నామకరణ సంస్కరణల బోర్డు' ను ఏర్పాటు చేయాలి. అగౌరవకరమైన, అసభ్యకరమైన, కుల వివక్షతో కూడిన ఇంటిపేర్లు ఉన్నవారికి ఎటువంటి కోర్టు ఫీజులు, గెజిట్ జాప్యం లేకుండా కేవలం ఒక డిక్లరేషన్ ద్వారా తమకు నచ్చిన గౌరవప్రదమైన పేరును ఎంచుకునే హక్కును కల్పించాలి.

ఆధార్ నుండి విద్యా ధ్రువపత్రాల వరకు అన్నింటిలోనూ ఉచితంగా మార్పులు చేసే వెసులుబాటు ఉండాలి. ఇంటి పేరు అనేది పూర్వీకుల నుంచి వచ్చిన వారసత్వమే కావచ్చు, కానీ అది అవమాన భారమైతే ఆ వారసత్వాన్ని వదిలేయడమే ధర్మం. గౌరవం లేని చోట సంప్రదాయానికి విలువ లేదు. మన పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి డబ్బో, భూమో కాదు.. సమాజంలో తలెత్తుకుని తిరిగేలా చేసే ఒక 'గౌరవ ప్రదమైన పేరు'. ఈ అక్షర యుద్ధం ఆ ఇంటి పేర్ల వెనుక ఉన్న వివక్ష గోడలు కూలే వరకు సాగాలి. మేధావులు, విద్యార్థులు, ప్రజాస్వామిక వాదులారా.. మేల్కొనండి! మన అస్తిత్వం మన చేతుల్లోనే ఉండాలి. అగౌరవ పేర్ల సంకెళ్లను తెంచుకుందాం.. రేపటి తరం తన పేరును గర్వంగా ఉచ్ఛరించేలా నేడే ఈ అక్షర యుద్ధాన్ని ప్రారంభిద్దాం! మనిషిని మనిషిగా గౌరవించే, కుల చిహ్నాలు లేని ఒక నూతన ఆత్మగౌరవ సమాజాన్ని నిర్మించుకుందాం.

విశ్వజంపాల

77939 68907

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mana Telangana Telugu