Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పోలీసులను అడ్డు పెట్టుకుని బిజెపి నేతలను వేధిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

పోలీసులను అడ్డు పెట్టుకుని బిజెపి నేతలను వేధిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకుని తమ పార్టీ నేతలను అరెస్టులతో వేధిస్తున్నారని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి భగ్గుమన్నారు.

మంగళవారం పార్టీ నేతలను అక్రమంగా అరెస్టులు చేయడం అప్రజాస్వామికమని ఆయన ఢిల్లీలో విడుదల చేసిన ఒక ప్రకటనలో విమర్శించారు. పార్టీ నాయకులైన బాధితులను పరామర్శించేందుకు వెళ్తామంటే గృహ నిర్బంధం చేస్తారా? అని ఆయన విమర్శించారు. ఇలా పోలీసులను అడ్డం పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో ప్రశ్నించే గొంతుకలను అణిచి వేయాలని చూస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలే తగిన సమాధానం చెబుతారని ఆయన హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం సాగిస్తున్న అప్రజాస్వామిక, నియంతృత్వ పాలనను తీవ్రంగా ఖండిస్తున్నానని ఆయన తెలిపారు.

ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుంది కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ ప్రభుత్వ అసమర్థతను ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నాయకులను నిర్బంధిస్తోందని ఆయన ఆరోపించారు.నల్లగొండలో బాధితులను పరామర్శించేందుకు బయలుదేరిన తమ పార్టీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావును, ఎమ్మెల్యేలు, ఇతర సీనియర్ నాయకులను హౌజ్ అరెస్ట్ చేయడం దుర్మార్గం అని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన ఎన్నికల హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని, ఇచ్చిన హామీలపై ప్రజలు నిలదీస్తుంటే సమాధానం చెప్పలేకపోతోందని, ప్రజల తరఫున బిజెపి ప్రశ్నిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వానికి భయం పట్టుకుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన ప్రభుత్వం ప్రశ్నించే వారినే అరెస్ట్ చేస్తోందని,

ప్రజల సమస్యలు పరిష్కరించాల్సిన ప్రభుత్వం ప్రతిపక్ష గొంతులను అణిచివేయడానికి పోలీసులను ఉపయోగిస్తోందని, ఇది పూర్తిగా కక్ష సాధింపు రాజకీయమేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు.నల్లగొండ బిజెపి జిల్లా అధ్యక్షుడి నివాసంపై దాడి జరిగినప్పుడు, పార్టీ రాష్ట్ర కార్యాలయంపై దాడికి పాల్పడిన యూత్ కాంగ్రెస్ నాయకులపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం ఎందుకు వెనుకడుగు వేస్తోంది? అని ఆయన ప్రశ్నించారు. దాడులు చేసిన వారిని వదిలిపెట్టి, బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన తమ పార్టీ నాయకులనే అరెస్ట్ చేయడం ఎక్కడి న్యాయం? అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలు చైతన్యవంతులు, ఎవరు దాడి చేశారు, ఎవరు బాధితులు, ఎవరు అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు అన్నది ప్రజలు గమనిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mana Telangana Telugu