Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రజల తీర్పునకు ప్రతిఫలం వెలిగొండ ప్రాజెక్టు:సిఎం చంద్రబాబు

ప్రజల తీర్పునకు ప్రతిఫలం వెలిగొండ ప్రాజెక్టు:సిఎం చంద్రబాబు

ప్రజలు ఇచ్చిన తీర్పుతో వెలిగొండ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడం అదృష్టంగా భావిస్తున్నానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. సోమవారం మార్కాపురం జిల్లా దోర్నాల మండలంలో వెలిగొండ తొలిదశ ప్రాజెక్టును సీఎం చంద్రబాబు ప్రారంభించి జాతికి అంకితం చేశారు.

దోర్నాల మండలం గంటవానిపల్లె వద్ద నల్లమల కొండల్లోని రెండు సొరంగాల నుంచి ప్రవహించిన కృష్ణా జలాలకు ముఖ్యమంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించి.. జలహారతితో స్వాగతించారు. సీఎం చంద్రబాబు నీళ్లలోకి దిగి పసుపు, కుంకుమ, చీర సమర్పించి ..సాష్టాంగ ప్రణామం చేశారు. అనంతరం ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, 1996లో ఈ ప్రాజెక్టుకు భూమి పూజ చేశానని, 30 ఏళ్ల తరువాత ప్రాజెక్టు మొదటి దశ ప్రారంభించి, జాతికి అంకితం చేస్తున్నానని తెలిపారు. మార్కాపురం గడ్డకు.. కరువుతో పోరాడిన రైతన్నలకు, ఫ్లోరైడ్ బాధలను భరించిన కుటుంబాలకు.. నీటి కోసం ఎదురు చూసి చూసి అలసిన తరాలకు... కృష్ణా జలాలతో కొత్త ఊపిరినిస్తున్నామని వివరించారు.

ఈ ప్రాజెక్ట్‌కు భూములు, ఇళ్లు, ఊళ్లు త్యాగం చేసిన 11 గ్రామాల ప్రజలకు పాదాభివందనం చేస్తున్నానని అన్నారు. రైతుల త్యాగం లక్షలాది మంది జీవితాల్లో వెలుగులు నింపుతోందని చెప్పారు. 2028లో కృష్ణా పుష్కరాలను మార్కాపురంలోనూ వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు. వెలిగొండ తొలి దశ ద్వారా 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు, నాలుగు లక్షల మందికి తాగునీరు అందనుందని ఆయన తెలిపారు. 2027 మార్చి నాటికి పోలవరం ప్రాజెక్టు కూడా పూర్తిచేసి..జాతికి అంకితం చేస్తానని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. కృష్ణజలాలకు స్వాగతం పలుకుతూ గిరిజన మహిళలు చేసిన లంబాడీ నృత్యం అలరించింది. ఈ కార్యక్రమంలో మంత్రులు నిమ్మల రామానాయుడు, ఆనం రామనారాయణ రెడ్డి, కందుల దుర్గేష్, అనగాని సత్యప్రసాద్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, ఎంపీలు, స్థానిక ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mana Telangana Telugu