Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రపంచ ఆర్థిక సంస్థల్లో సంస్కరణలు అవసరం

ప్రపంచ ఆర్థిక సంస్థల్లో సంస్కరణలు అవసరం

న్యూఢిల్లీ : ప్రపంచ ఆర్థిక సంస్థల్లో వర్ధమాన దేశాలకు మరింత ప్రాతినిధ్యం కల్పించాలని బ్రిక్స్ దేశాల ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకుల గవర్నర్లు డిమాండ్ చేశారు.

వాణిజ్య విభజన, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఆర్థిక స్థిరత్వాన్ని పెంచుకునేందుకు పరస్పర సహకారాన్ని మరింత విస్తరించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. శనివారం నాడిక్కడ బ్రిక్స్ దేశాలు ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. చెల్లింపులు, అభివృద్ధి, ఆర్థిక సాయం, మౌలిక వసతులు, పన్నులు, కస్టమ్స్, ఆర్థిక స్థిరత్వం తదితర రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు.

రెండో ప్రపంచ యుద్ధం అనంతరం ఏర్పడిన బ్రెట్టాన్ వుడ్స్ కవలలుగా పేర్కొంటున్న అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్), ప్రపంచ బ్యాంకుల్లో సంస్కరణలు అత్యవసరమని బ్రిక్స్ పేర్కొంది. ఇవి మరింత ప్రాతినిధ్యం, పారదర్శకంగా, జవాబుదారీతనంతో, సమర్థంగా పనిచేసేలా పాలనా వ్యవస్థను మార్చాలని కోరింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో చోటుచేసుకున్న మార్పులకు అనుగుణంగా ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకుల పాలనా నిర్మాణాన్ని సవరించాలని తెలిపింది. వర్ధమాన, అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక ప్రాధాన్యానికి అనుగుణంగా వాటి ఓటింగ్ హక్కులు, ప్రాతినిధ్యం ఉండాలని డిమాండ్ చేసింది.

బ్యాంకుకు మరింత బలం..

బ్రిక్స్ దేశాలు ఏర్పాటు చేసిన న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఎన్‌డీబీ)కు మరింత కీలక పాత్ర ఇవ్వాలని ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకు గవర్నర్లు అభిప్రాయపడ్డారు. మౌలిక వసతులు, అభివృద్ధి ప్రాజెక్టులకు నిధులు సమకూర్చడంలో బ్యాంకు పాత్రను విస్తరించాలని సూచించారు. స్థానిక కరెన్సీల్లో రుణాలను పెంచడం, నిధుల వనరులను విస్తరించడం, ప్రాజెక్టుల రూపకల్పనకు మరింత మద్దతు ఇవ్వడం, సమ్మిళిత-, సుస్థిర అభివృద్ధికి దోహదపడే ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.

సంక్షోభ సమయాల్లో ఆర్థిక భద్రత

బ్రిక్స్ కాంటింజెంట్ రిజర్వ్ అరేంజ్‌మెంట్ (సీఆర్‌ఏ)ను మరింత సమర్థంగా మార్చేందుకు చర్యలు చేపట్టారు. చెల్లింపుల సమతుల్యత సమస్యలను ఎదుర్కొనే సభ్య దేశాలకు అత్యవసర ద్రవ్య లభ్యత అందించే ఈ వ్యవస్థను సంక్షోభ సమయాల్లో వేగంగా స్పందించేలా సవరించనున్నారు. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న వాణిజ్య పరిరక్షణవాదం, ఏకపక్ష సుంకాలు, ద్రవ్యోల్బణం, అధిక ప్రభుత్వ రుణాలు, ఆర్థిక అస్థిరత, విధాన అనిశ్చితిపై బ్రిక్స్ ఆందోళన వ్యక్తం చేసింది. ఏకపక్ష సుంకాలు, సుంకేతర వాణిజ్య ఆంక్షలు ప్రపంచ వాణిజ్యాన్ని వక్రీకరిస్తున్నాయని, ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని పేర్కొంది. ఇన్సూరెన్స్, పెన్షన్లు, చెల్లింపుల మౌలిక వసతులు, సైబర్ భద్రత, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలపైనా సమావేశంలో చర్చించారు. భారత్ ప్రతిపాదించిన బ్రిక్స్ రిస్క్ ల్యాబ్‌ను గుజరాత్‌లోని గిఫ్ట్ సిటీలో స్వచ్ఛంద భాగస్వామ్యంతో ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించారు. ఉమ్మడి రిస్క్ మోడళ్ల రూపకల్పన, రీఇన్సూరెన్స్ సామర్థ్యాల పెంపునకు ఇది దోహదపడుతుందని భావిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mana Telangana Telugu