తెలంగాణ కాంగ్రెస్‌లో క్రమశిక్షణ అంశం ఎంత జోరందుకుంటుందో అంత హాస్యం పండిస్తోంది. ఒకరిద్దరిపై చర్యలతో పార్టీని ప్రక్షాళన చేయగలమనుకుంటే అంతకన్నా హాస్యాస్పదం మరొకటుండదు.
కాంగ్రెస్ ప్రక్షాళనకు కఠినమైన నిర్ణయాలు అవసరమైన చోట ఒకటి, రెండు ఏకపక్షపు చర్యలతో పార్టీని పవిత్రం చేస్తామనుకోవడం భ్రమ! పైగా, చిన్నారెడ్డి వంటి పార్టీపట్ల నిబద్ధత కలిగిన వ్యక్తిపైనే 'క్రమశిక్షణ' అంటూ అసంబద్ధ చర్య తీసుకుంటే, ఇప్పటికే లోలోపల రగులుతున్న 'అసలు కాంగ్రెస్' 'నకిలీ కాంగ్రెస్' వివాదం తెరపైకి వచ్చి, అన్ని స్థాయిల్లోకి విస్తరించే ప్రమాదముంది. అధికారంలో ఉన్నపుడు కాంగ్రెస్ నాయకుల్లోనే భిన్నాభిప్రాయాలు, వైరుధ్యాలు, వైరాలుంటాయంటే, ఇప్పుడు 'మూడు పాయల జడ' ముడివడటం లేదు. ఓ వైపు తెలుగుదేశం నుంచి వచ్చి పెత్తనం చేస్తున్నవారు, మరోవైపు బిఆర్‌ఎస్‌లో ఎంఎల్‌ఎలుగా గెలిచి కాంగ్రెస్‌లోకి వచ్చి 'అటుఇటు కాకుండా'నే అన్నీ అనుభవిస్తున్నవారు... ఎప్పట్నుంచో పార్టీని పట్టుకొని ఉన్న మూల' కాంగ్రెస్' వాదులకు చికాకు కలిగిస్తున్నారు. రెండేళ్లలో ఎన్నికలకు సన్నద్ధం కావాల్సిన పాలకపక్షంగా కాంగ్రెస్, ఈ లోపున ఇంటిని 'చక్కదిద్దుకోవడం' పెను సవాలే!
కాంగ్రెస్ పార్టీలో 'ఐక్యత' ఎప్పుడూ చిక్కు సమస్యే! ఐక్యత ఒకోసారి 'దేవతా వస్త్రాల'లాగా ఉండొచ్చు, మరోమారు 'కరిమింగిన వెలగపండు'లాగా లేకుండా పోవచ్చు. కేవలం ఐక్యతను బట్టే పార్టీ గెలుస్తుందనుకుంటే భ్రమే! కాకపోతే, పార్టీ గెలుపోటముల్ని అది కొంతమేర ప్రభావితం చేయగలుగుతుందనడంలో సందేహం లేదు. తెలంగాణలో, అంతకుముందు అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ గెలిచిన ప్రతిసారీ 'ఐక్యత' బాగా పనిచేసింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాతి నాలుగున్నర దశాబ్దాల కాలం లో ఇదే జరిగింది. 1989, 2004, 2023 లోనే కాక పాలక కాంగ్రెస్ తిరిగి అధికారం నిలబెట్టుకున్న 2009 లోనూ పార్టీలో ఐక్యతే బలమైన కారణం. ఆయా సందర్భాల్లో మర్రి చెన్నారెడ్డి, డా. వైఎస్ రాజశేఖరరెడ్డి, రేవంత్ రెడ్డి... ఇలా నాయకులెవరైనా పార్టీని ఒక్కతాటిపై నడిపినపుడు సానుకూల ఫలితాలొచ్చాయి. కాంగ్రెస్ ఓడిన ప్రతిసారీ, 'అనైక్యత' ఓ బలమైన ప్రభావకంగా నిలిచింది. అందుకు, 1985 ఉదాహరణ కాకపోయినా 1983, 1994, 1999, 2014, 2018 ఎన్నికల చరిత్రే సాక్ష్యం! 2028లో మళ్లీ గెలిచి, 2034 వరకు తానే ముఖ్యమంత్రిగా ఉంటాను అంటున్న ప్రస్తుత సిఎం రేవంత్ రెడ్డి పార్టీలో ఐక్యతపై దృష్టిపెట్టాలి. కాంగ్రెస్ అధిష్ఠానం శ్రద్ధ తీసుకోవాలి. పార్టీలో విభిన్న ధోరణి, విభజించి పాలించే వైఖరి ఉన్నంతకాలం దినదినం దిగజారడం తప్ప పార్టీ ఐక్యత నేతిబీరలో నేయి చందమే!
పార్టీలో ఒకరిద్దరిపై క్రమశిక్షణా చర్యకు ఉపక్రమించే ముందు, అటువంటి చర్యలకే పాల్పడ్డ ఇతర నాయకులపట్ల పార్టీ లోగడ ఎలా వ్యవహరించింది? ఏం క్రమశిక్షణ చర్యలు తీసుకున్నది? తీసుకున్నదా -లేదా? అన్నది కీలకం. ఒక పరిస్థితిని సమీక్షించే ముందు, అందుకు దారితీస్తున్న ప్రభావకాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. కిందటి అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ పార్టీలో గెలిచి, కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన పదిమంది ఎంఎల్‌ఎల విషయంలో పార్టీలోనే స్పష్టత లేదు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తో సహా కొందరు వారికి ప్రాధాన్యత ఇవ్వాలంటుంటే పార్టీ ఇంచార్జీగా ఉన్న ఎఐసిసి ప్రతినిధి మీనాక్షి నటరాజన్‌తో సహా పలువురు వారికంత ప్రాధాన్యత అక్కర్లేదని, ఆయా నియోజకవర్గాల్లో మూల కాంగ్రెస్ వాదుల్ని పోగొట్టుకోవద్దనే బలమైన అభిప్రాయంతో ఉన్నారు. పార్టీ మార్పిళ్ల (నిరోధక) చట్టం కింద వారిని అనర్హులుగా ప్రకటించాలన్న బిఆర్‌ఎస్ ఫిర్యాదును పరిష్కరిస్తూ 'వారు పార్టీ మారినట్టు ఆధారాల్లేవ'ని శాసనసభాపతి తీర్పు చెప్పారు. 'మేము పార్టీ మారలేదు, బిఆర్‌ఎస్ లోనే ఉన్నామ'ని వారు స్పీకర్ ముందు వాంగ్మూలం ఇవ్వటమే అందుకు కారణం. కొన్ని విషయాల్లో ఇంకా బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలుగా, మరికొన్ని విషయాల్లో వారు కాంగ్రెస్ 'నాయకులు'గా వ్యవహరించడం స్పర్థకు తావిస్తోంది. స్థానిక సంస్థల్లో, నామినేటెడ్ పదవుల్లో తమ వారికే చోటు కల్పిస్తూ మూల కాంగ్రెస్ వారిని ఇబ్బంది పెడుతున్న సందర్భాలున్నాయి.
పార్టీని వీడిపోయిన సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డిది జగిత్యాలలో ఈ వివాదమే! ఆయా నియోజకవర్గాల్లో ఉన్న ఇటువంటి వివాదాల్ని పార్టీ నాయకత్వం సామరస్యపూర్వకంగా సర్దుబాటు చేయాలి. గెలుపే లక్ష్యంగా, ఎన్నికల ముందు పార్టీలోకి వచ్చిన ఇతర పార్టీల వారిని అభ్యర్థులు చేసి ఎంఎల్‌ఎ లుగా గెలిపించుకున్న చోట కూడా ఇటువంటి స్పర్ధలున్నాయి. వాటని పార్టీ అధిష్ఠానమే పరిష్కరించాలి. వనపర్తిలో సిట్టింగ్ ఎంఎల్‌ఎ మేఘారెడ్డి, సీనియర్ నాయకుడైన రాష్ట్ర ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డి మధ్య వివాదం ఇటువంటిదే! ఇంకా పలుచోట్లా ఘర్షణలున్నాయి. మజ్లిస్ (ఎం.ఐ.ఎం) తో కాంగ్రెస్ నడచుకోవాల్సిన విధానంలోనూ భిన్నాభిప్రాయాలే! వారున్న నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు బలమైన ఆశావహులు లేరు కనుక ఇబ్బంది లేదు. కానీ, అఖిల భారత స్థాయిలో పార్టీ వైఖరికి ఈ విషయంలో ఒక స్పష్టత అవసరం.
మంత్రి కొండా సురేఖ కూతురి వ్యాఖ్యలపైన, ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి వ్యాఖ్యలపైన వచ్చిన ఫిర్యాదుల్ని విచారించిన రాష్ట్ర కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ, పార్టీ అధిష్ఠానానికి వారిపై చర్యలు సిఫారసు చేసింది. ఇప్పుడా సిఫారసులు ఎఐసిసి నాయకత్వ పరిశీలనలో ఉన్నాయి. 'నా కూతురి వ్యాఖ్యలకు నాపై చర్యలేంటి?' అని మంత్రి సురేఖ వివరణ ఇచ్చారు. నోటీస్‌లో పేర్కొన్నట్టు పార్టీకి గానీ, ఎంఎల్‌ఎకు గానీ వ్యతిరేకంగా తానేమీ అనుచిత వ్యాఖ్యలు చేయలేదని చిన్నారెడ్డి వివరణ ఇచ్చారు.
తన సొంత ఊళ్లోనే రాజకీయ ప్రత్యర్థులతో కమిటీ వేసిన ఎంఎల్‌ఎ చర్యల్ని తప్పుబట్టానని, సీనియర్ నాయకుడు జీవన్‌రెడ్డిని పొగబెట్టి పార్టీ బయటకు పంపినట్టు తనను పంపజాలరని, తాను కాంగ్రెస్‌ను వీడి వెళ్లే ప్రసక్తే లేదనే వాదన చిన్నారెడ్డి వినిపిస్తున్నారు. వనపర్తి ఎంఎల్‌ఎ అనుచరులు చిన్నారెడ్డికి వ్యతిరేకంగా, చిన్నారెడ్డి అనుచరులు ఆయనకు మద్దతుగా, ఎంఎల్‌ఎ చర్యల్ని తప్పుబడుతూ గాంధీభవన్‌లో పెద్ద సంఖ్యలో ప్రదర్శనలు చేసి, నాయకత్వానికి వినతులిచ్చారు. క్రమశిక్షణ ప్రక్రియలో ఎంఎల్‌ఎ స్థాయిలో కాకుండా అంతకు మించిన స్థాయి నాయకుల కుట్ర ఏదో దాగి ఉందని చిన్నారెడ్డి అనుచరులు ఆరోపిస్తున్నారు.
ఎన్నికల్లో పార్టీ, తన గెలుపోటములతో నిమిత్తం లేకుండా నాలుగు దశాబ్దాలకు పైబడి కాంగ్రెస్ లో క్రమశిక్షణ, నిబద్ధతతో పనిచేస్తున్న చిన్నారెడ్డిపై ఇంతటి అన్యాయం తగదనేది వారి వాదన. 'ఒక బిసి నేతపైనే కాదు, అగ్రవర్ణ రెడ్డిపైనా చర్య తీసుకున్నామ'నే 'సమతూకపు' చర్య సమంజసం కానక్కర్లేదా? అన్నది ప్రశ్న. ఎప్పుడూ లేనిది, క్రమశిక్షణా కమిటీ సిఫారసులను ఈసారి మీడియాకు లీక్ చేశారు. 'సురేఖను మంత్రివర్గం నుంచి, చిన్నారెడ్డిని ప్రణాళికా సంఘం నుంచి తప్పించ'మని సిఫారసు చేశారనేది దాని సారం. అవి పార్టీ పదవులు కావు. ప్రభుత్వం ఇచ్చినవి. వాటిని పార్టీ తొలగించగలదా? పార్టీ క్రమశిక్షణా సంఘం ప్రభుత్వానికి చర్యలు సిఫారసులు చేయగలదా? అనే సాంకేతికాంశం పార్టీ వర్గాల్లో చర్చకు వస్తోంది.
క్రమశిక్షణా సంఘానికి నేతృత్వం వహిస్తున్న మల్లు రవి ఎంపి నియోజకవర్గం నాగర్‌కర్నూల్ పరిధిలోకే వనపర్తి అసెంబ్లీ స్థానం వస్తుంది కనుక, 'ప్రయోజన సంశయ వైరుధ్యం' (కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్) ఆస్కారం ఉన్నందున ఈ వివాద విచారణ బృందానికి ఆయన నేతృత్వం వహించి ఉండాల్సింది కాదనే అభిప్రాయం పార్టీలో బలంగా ఉంది. చిన్నారెడ్డిపై 'పెద్ద చర్య' ఏం తీసుకున్నా అది నిర్హేతుకంగా ఉంటుందని, అదే జరిగితే 'అసలు కాంగ్రెస' వర్సెస్ 'నకిలీ కాంగ్రెస్' ఘర్షణ పార్టీలోపై నుంచి గ్రామ స్థాయివరకు విస్తరించే ప్రమాదాన్ని పార్టీ వర్గాలు శంకిస్తున్నాయి.
ఐక్యతా కృషికి తోడు పార్టీలో, ప్రభుత్వంలో ఏకకాలంలో పలు చర్యలతో మాత్రమే తెలంగాణలో కాంగ్రెస్ ప్రక్షాళన సాధ్యం. ఇందుకు సిఎం చొరవ, పిసిసి సన్నద్ధత కీలకం. ముఖ్యమంత్రే ఓ సందర్భంలో అన్నట్టు 'ఆబ్సెంటీ ల్యాండ్‌లార్డ్'లా కాకుండా పిసిసి నేత మహేష్‌కుమార్ మరింత క్రియాశీలం కావాలని పార్టీ శ్రేణుల అంచనా. అప్పటివరకు కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయాల్లో ఎదిగిన వాడైనప్పటికీ పిసిసి పగ్గాలు చేపట్టిన వెంటనే పార్టీలో సీనియర్ నాయకులందరినీ వారిళ్లకు వెళ్లి కలిసి, ఐక్యతకు పాదులు వేసిన రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఇప్పుడదే చొరవ చూపాల్సిన అవసరముంది. స్పర్ధలున్న చోట, వివాదాలకు ఆస్కారమున్న చోట సంప్రదింపులతో వెంటనే సర్దుబాటు చర్యలు చేపట్టాలి.
ప్రభుత్వ ఇమేజ్ పెంచడంతోపాటు పార్టీ- ప్రభుత్వం మధ్య సమన్వయం సాధించాలి. రోజు రోజుకు పెరుగుతున్న అవినీతి ముద్రను చెరిపేసుకుంటే తప్ప పార్టీ ప్రచారం చేసుకోలేదు. గత ప్రభుత్వ హయాం లో కీలక హోదాలు అనుభవించి, అవినీతికి పేరుబడ్డ అధికారులను ముఖ్య స్థానాలనుంచి తక్షణం తప్పించి, అప్రాధాన్య స్థానాల్లోకి పంపాలి. పాజిటివ్ ఇమేజ్ లేని అధికారులకు ఉద్యోగ విరమణ వెంటనే 'సలహాదారులు'గా సర్కారు కొలువులతో ఉపాధి కల్పించే పని నిలిపివేయాలి. పాలక పక్షంగా కాంగ్రెస్‌ను ఎన్నికలకు సన్నద్ధం చేసే క్రమంలో కొన్ని నిర్దిష్ట చర్యలు తీసుకోవాలనే భావన పార్టీలో బలంగా వ్యక్తమవుతోంది. మంత్రివర్గ మార్పు సమయంలో ముఖ్యమంత్రి తన వద్ద ఉన్న కీలక శాఖలను ఇతర మంత్రులకు ఇచ్చి, ఆయన పూర్తి సమయం వెచ్చించి 'పాలన- పార్టీ ప్రక్షాళన' పై దృష్టి కేంద్రీకరించాలనే భావన వస్తోంది. కొత్త ఉత్సాహం, సరికొత్త ఇమేజ్ కోసం అందరు మంత్రులకు ఇప్పుడున్న శాఖల్ని మార్చాలనీ పార్టీ వర్గాల్లో పుంది.
- దిలీప్ రెడ్డి ( సమకాలీనం)
(రచయిత పొలిటికల్ అనలిస్ట్, డైరెక్టర్ 'పీపుల్స్ పల్స్' రీసెర్చ్ సంస్థ)

