420 హామీలిచ్చి ముఖం చాటేస్తున్నారు.. 1,000 రోజులైనా అమలు ఏది?
ఖైరతాబాద్ మైనారిటీ సీనియర్ నేత జిబ్రాన్ షరీఫ్ బీఆర్‌ఎస్‌లో చేరిక
మనతెలంగాణ/హైదరాబాద్: ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ప్రజల మధ్య విభజనలు సృష్టిస్తుంటే, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను దోచుకుంటోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించారని, రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలు, కుంభకోణాలపై స్పందించకుండా మౌనం వహిస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణ రాహుల్ గాంధీకి ఏటీఎంగా మారిందని, రేవంత్ రెడ్డి ఆయనకు ఏటీఎం కార్డులా వ్యవహరిస్తున్నారని కేటీఆర్ విమర్శించారు.
తెలంగాణ భవన్‌లో ఆదివారం ఖైరతాబాద్ నియోజకవర్గానికి చెందిన మైనారిటీ సీనియర్ నాయకుడు జిబ్రాన్ షరీఫ్ బీఆర్‌ఎస్‌లో చేరారు. కేటీఆర్ ఆయనకు పార్టీ కండువా కప్పి బీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, ఎన్నికల హామీల అమలులో జాప్యం, రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై స్పందించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని, 13 డిక్లరేషన్లను నెరవేరుస్తామని, మొత్తం 420 హామీలను అమలు చేస్తామని ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ ప్రజలకు మాట ఇచ్చారని గుర్తుచేశారు. అయితే 1,000 రోజులు గడుస్తున్నా ఆ హామీల అమలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ 'ఛాత్రోంకీ గూంజ్' వంటి కార్యక్రమాల గురించి మాట్లాడుతున్న రాహుల్ గాంధీకి తెలంగాణలో అడుగుపెట్టే ధైర్యం ఎందుకు లేదని ప్రశ్నించారు. మైనారిటీ సంక్షేమానికి రూ.4,000 కోట్ల బడ్జెట్ కేటాయిస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు.
కేసీఆర్ పాలనలో హైదరాబాద్‌కు భరోసా
తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు హైదరాబాద్‌లో కరెంటు కోతలు, నీటి కొరతతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడేవారని కేటీఆర్ గుర్తుచేశారు. ప్రతి ఇంట్లో ఇన్వర్టర్లు, ప్రతి అపార్ట్‌మెంట్‌లో జనరేటర్లు తప్పనిసరిగా ఉండే పరిస్థితులు ఉండేవని అన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం విద్యుత్, తాగునీరు సహా మౌలిక సదుపాయాల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేసిందని పేర్కొన్నారు. మతం పేరుతో రాజకీయాలు చేయకుండా, అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని 10 ఏళ్లపాటు శాంతి, సౌభ్రాతృత్వానికి ప్రాధాన్యతనిస్తూ పాలన సాగించామని తెలిపారు. హైదరాబాద్ నగరం గంగా-యమునా తెహజీబ్‌కు ప్రతీకగా నిలిచేలా మత సామరస్యాన్ని కాపాడటంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం కీలక పాత్ర పోషించిందని కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ ప్రజలు తమ ప్రభుత్వ పనితీరును గుర్తించి బీఆర్‌ఎస్‌కు మద్దతుగా నిలిచారని పేర్కొన్నారు.
కాంగ్రెస్ నుంచి బీఆర్‌ఎస్‌లో చేరిన భార్గవ్ దేశ్‌పాండే
ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు భార్గవ్ దేశ్‌పాండే ఆదివారం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. కేటీఆర్ ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

