మన తెలంగాణ/సిటీబ్యూరో: ఓవైపు వాహనాల పొగ...మరో వైపు దుమ్ము,ధూళీ...ఇంకోవైపు పరిశ్రమల కాలుష్యం వెరసి నగరవాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తోన్నాయి. హైదరాబాద్ మహా నగరంలో గాలి నాణ్యత భారీగా తగ్గిపోయి నగరవాసుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
వాయు కాలుష్యం క్రమేణా పెరుగుతూ ఆందోళనకరంగా మారుతోంది. గాలి కాలుష్యంతో ప్రమాదఘంటికలు మోగుతోన్నా అధికారయంత్రాంగాలు పట్టనట్టు వ్యవహరిస్తోండటం సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యా,ఉపాధి,ఉద్యోగం, వ్యాపారం తదితర కారణాలతో నగరానికి వచ్చేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుండగా, వివిధ శాఖల యంత్రాంగాల నిర్లక్షం...ప్రభుత్వాల ఉదాసీనతల వల్ల అదేస్థాయిలో గాలి కాలుష్యమూ పెరుగుతోంది. ఇది నగరవాసుల ఆరోగ్యం,జీవన ప్రమాణాలపై పెను ప్రభావం చూపుతోంది. గాలి నాణ్యత భారీగా పడిపోవడంతో శ్వాస సంబంధ వ్యాధులతో పాటు వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో మంచాన పడుతున్నారు.
పీల్చే గాలి కాలుష్యం కావడమే ఇందుకు ప్రధాన కారణమని తెలిసినా సంబంధిత శాఖలు మొద్దునిద్ర వహిస్తుండటం విశేషం. సాధారణంగా గాలి నాణ్యత స్థాయి(150కి పైగా)లు మోడరేట్‌స్థాయి నుంచి ప్రమాదస్థాయికి చేరుకుని ఆందోళన కలిగిస్తోంది. క్యూర్ పరిధిలో సుమారు 1.40 కోట్ల వాహనాలు ఉండగా, చిన్నాపెద్దవి కలిసి 20వేలకు పైగా కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలు ఉన్నాయి. దీనికి తోడు భారీగా నిర్మాణాలు జరుగుతుండటంతో నగరవాసులపై విషం చిమ్ముతున్నాయి. నగరంలోని అనేక ప్రాంతాలలో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుండటం, సిగ్నల్స్ వద్ద వాహనాలను ఆఫ్ చేయకపోవడంతో విషవాయువులు వెదజల్లి కాలుష్యం భారీగా పెరుగుతోంది. వర్షం కురిస్తే వరదనీరు రహదారులపై ప్రవహించడం..అనంతరం దుమ్ముధూళీ రహదారులపైనే ఉండటం...రహదారులను సరిగా శుభ్రం చేయకపోవడంతో వాహనాల రాకపోకలతో దుమ్మురేణువులు లేచి పరిస్థితి మరింత తీవ్రం అవుతోంది.
కాటేదాన్,జీడిమెట్ల,నాచారం,సనత్‌నగర్,బాలానగర్ తదితర పారిశ్రామిక వాడల్లో పరిస్థితి మరింత దుర్బరం. నిర్మాణాల వ్యర్థాలు ఎక్కడపడితే అక్కడ వేయడం, నిబంధనలు పాటించకుండా వాహనాలతో వ్యర్థాలను తరలించడం తదితర నిర్మాణ కార్యకలాపాలతో గాలి పూర్తిగా కాలుష్యంగా మారి ప్రజల అనారోగ్యానికి కారణమవుతున్నాయి. వాస్తవానికి గాలి నాణ్యతస్థాయిలో 50లోపు ఉండాల్సివున్నా...భారీగా పెరిగి 150కి చేరుకున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 200పైగా చేరుకుని ప్రమాదఘంటికలు మోగిస్తున్నాయి. తద్వారా నగరవాసుల్లో అనేక మంది శ్వాససంబంధ వ్యాధులతో మంచానపడాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. రోజురోజుకు పెరుగుతోన్న వాయు కాలుష్యంతో మాస్క్‌లు ధరించల్సిన పరిస్థితి నెలకొంటుందని ప్రజలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
నగరంలో గడువుదాటినా...విషవాయువులు వెదజల్లే వాహనాలపై చర్యలు చేపట్టాలని....నగరం నడిబొడ్డున ఉండి కాలుష్యానికి ప్రధాన కారణమవుతోన్న పరిశ్రమలను తరలించాలని...నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్న ప్రాంతాల్లో నిబంధనలు పాటించేలా కఠినచర్యలు చేపట్టాలని నగరవాసులు కోరుతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి చర్యలు చేపట్టకపోతే కాలుష్యం మరింత పెరిగి హైదరాబాద్ నగరం మరో ఢిల్లీ కావడం ఖాయమని హెచ్చరిస్తున్నారు. లేదంటే నగరాన్ని వీడి పల్లె బాట పట్టాల్సిందేనని ఆందోళనచెందుతున్నారు.

