మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరి జీవితంలోని విఘ్నాలను తొలగించి అందరికీ ఆనందం, ఐశ్వర్యం, ఆరోగ్యం ప్రసాదించాలని ముఖ్యమంత్రి విఘ్నేశ్వరుడుని ప్రార్థించారు.
వాడ వాడల వెలిసే గణేష్ మండపాలలో భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించుకోవాలని కోరారు. ఈ గణపతి నవరాత్రుల సందర్భంగా హైదరాబాద్ సహా అన్ని జిల్లా కేంద్రాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని, భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే మండపాల వద్ద తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీస్ అధికారులను సిఎం ఆదేశించారు. ఈ సంవత్సరం కూడా వినాయకుని మండపాలకు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ సౌకర్యం కల్పిస్తున్నదని చెప్పారు.
వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన కెసిఆర్
వినాయక చవితి పర్వదినం సందర్భంగా తెలంగాణ ప్రజలకు మాజీ ముఖ్యమంత్రి, బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నాలు తొలగించి,విజయాలను అందించే దైవంగా, వినాయకుణ్ణి హిందూ సమాజం కొలుచుకుంటుందని అన్నారు. దైవ పూజలను,ధార్మిక క్రతువులు విఘ్నేశ్వరుని పూజతో ప్రారంభించడం ద్వారా హిందూ సంప్రదాయాల్లో గణనాయకునికి తొలి ప్రాధాన్యతనిస్తామని తెలిపారు. వాడ వాడలా మండపాలు ఏర్పాటు చేసుకుని తొమ్మిది రోజుల పాటు గణేశ్ నవరాత్రులు జరుపుకుంటూ, పిల్లలు పెద్దలు అత్యంత భక్తి శ్రద్ధలతో వినాయకునికి పూజలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని,వ్యవసాయం తిరిగి గాడినపడి, పాడి పంటలతో తెలంగాణ రైతు కుటుంబాలు సుఖ సంతోషాలతో వర్ధిల్లేలా దీవించాలని కోరుతూ ఏకదంతున్ని కెసిఆర్ ప్రార్థించారు.

