మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో వర్షాకాలం సీజన్ ముమ్మరంగా సాగాల్సిన సమయంలో ఎల్ నినో రూపంలో తీవ్రమైన కరువు పరిస్థితులు విరుచుకుపడుతున్నాయి. జూన్ మొదటి వారం నుంచి ఈ నెల 24 వరకు రాష్ట్రవ్యాప్తంగా 27 శాతం లోటు వర్షపాతం నమోదు కావడం ఎల్‌నినో ఎంత ఆం దోళనకరంగా ఉందో స్పష్టమవుతోంది.
ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ, ఐఎండి, ఇక్రిశాట్, జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం సంయుక్తంగా నివేదికను విడుదల చేశాయి. వానాకాలంలో సాధారణంగా కురవాల్సిన వర్షపాతం 306.1 మి.మీ కాగా, ఈ నెల 24 వరకు కేవలం 222.3 మి.మీ మాత్రమే నమోదైంది. ఇది రాష్ట్ర సగటులో ఏ కంగా 27 శాతం లోటు, రాష్ట్రంలోని 26 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదవగా,
హైదరాబాద్‌తో కలిపి 27 జిల్లాలు వర్షాభావ సమస్యను ఎదుర్కొంటున్నాయి. అత్యధికంగా మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాల్లో 57.1 శాతం లోటు వర్షపాతం నమోదు కాగా, తరువాత వరుసగా హనుమకొండ -56.0, వరంగల్ -51.3, యాదాద్రి భువనగిరి 48.4, జనగామ- 48.2, కరీంనగర్ 41.4 శాతం లోటు వర్షపాతం నమోదైంది. కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, వనపర్తి, హైదరాబాద్ వంటి జిల్లాల్లో వర్షాలు లేక పంట పొలాలు ఎండిపోయే దశకు చేరుకున్నాయి. కేవలం కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, ములుగు, రంగారెడ్డి, నాగర్‌కర్నూల్, నల్గొండ జిల్లాల్లో మాత్ర మే సాధారణ వర్షపాతం నమోదైందని వ్యవసాయ శాఖ నివేదిక వెల్లడించింది.
రాబోయే నెలల్లోనూ ఇదే పరిస్థితి
రాబోయే నెలల్లో సైతం వర్షాభావ పరిస్థితి మరింత క్లిష్టంగా ఉంటుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆగస్టు నెలలో ఉత్తర, మధ్య, తూర్పు తెలంగాణ జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నాయని, పశ్చిమ, దక్షిణ తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే సాధారణ వర్షాలు పడవచ్చని అంచనా వేసింది.సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా వర్షాభావం మరింత తీవ్రమవుతుందని, ఈ ఏడాది ఆఖరు త్రైమాసికంలో ఎల్ నినో తీవ్రమైన రూపాన్ని సంతరించుకుంటుందని ఐఎండి హెచ్చరించింది. మరోవైపు వర్షాలు పడకపోవడంతో భూగర్భ జలాలు పాతాళానికి పడిపోతున్నాయి. గతేడాది జూన్‌లో 9.47 మీటర్లుగా ఉన్న సగటు భూగర్భ జలమట్టం, ఈ ఏడాది జులై నాటికి 9.66 మీటర్ల లోతుకు చేరుకుంది. ఈ క్రమంలో వర్షపాతం లోటు 30 శాతం దాటితే ఆగస్టు నాటికి రాష్ట్రవ్యాప్తంగా భూగర్భ జలాలు సగటున 11.01 మీటర్ల లోతుకు పడిపోతాయని నీటిపారుదల, భూగర్భజల శాఖ అంచనా వేసింది. ఇప్పటికే వికారాబాద్ 14.39 మీ, మెదక్ 13.45 మీ, సంగారెడ్డి 13.58 మీ, నిజామాబాద్ 13.38 మీ జిల్లాల్లో నీటి మట్టాలు తీవ్రంగా క్షీణించాయి.
గోదావరి, కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల్లో తగ్గిన నిల్వలు
వర్షాభావ పరిస్థితుల ప్రభావం గోదావరి, కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ పూర్తి నిల్వ సామర్థ్యం 80.50 టిఎంసిలు కాగా, ప్రస్తుతం కేవలం 15.67 టిఎంసిల నీరు మాత్రమే ఉంది. అందులో డెడ్ స్టోరేజ్ 14.77 టిఎంసిలు కాగా, ప్రస్తుతం 0.90 టిఎంసిలు ఉండటం మాత్రమే కలవరపరిచే అంశం. వీటితో పాటు లోయర్ మానేరు డ్యామ్ 24.03 టిఎంసిలకు గాను ప్రస్తుతం 5.52 టిఎంసిలు మాత్రమే ఉన్నాయి. కృష్ణా బేసిన్‌కు సంబంధించి శ్రీశైలంలో 215.81 టిఎంసిలకు గాను 41.51 టిఎంసిలు, నాగార్జున సాగర్‌లో 312.05 టిఎంసిలకు గాను 137.34 టిఎంసిల నీరు మాత్రమే అందుబాటులో ఉందని నివేదికలో వెల్లడించింది.
రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు వెళ్లాలి
వర్షాలు ముఖం చాటేసిన తరుణంలో సంప్రదాయ నీటి ఆధారిత పంటలను కాదని, కరువు తట్టుకునే ప్రత్యామ్నాయ పంటలను మాత్రమే సాగు చేయాలని వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు ఆగస్టు 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు పంటల వివరాలను వ్యవసాయ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 138.49 లక్షల ఎకరాల విస్తీర్ణానికి విత్తనాలు ప్రతిపాదించగా, టిజిఎస్‌డిసి, జాతీయ విత్తనాభివృద్ధి సంస్థ (ఎన్‌ఎస్‌సి), ప్రైవేట్ భాగస్వామ్యంతో 76.33 లక్షల క్వింటాళ్ల విత్తనాలు వ్యవసాయ శాఖ సిద్ధంగా ఉంచింది. వరి, ప్రత్తి, కంది, మొక్కజొన్న విత్తనాలు తగినంత అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం ప్రకటించింది. ఎల్ నినో గండం నుంచి గట్టెక్కడానికి రైతాంగం సాంప్రదాయ వ్యవసాయ పద్ధతులకు స్వస్తి చెప్పి, శాస్త్రీయ ప్రత్యామ్నాయ ప్రణాళికను అమలు చేయాలని, అధికారుల సూచనలను ఎప్పటికప్పుడు రైతు వేదికల ద్వారా తెలుసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ కోరింది.

