Dailyhunt
రాష్ట్రంలో శాంతిభద్రతలు అడుగంటి పోయాయి: కెటిఆర్

రాష్ట్రంలో శాంతిభద్రతలు అడుగంటి పోయాయి: కెటిఆర్

హైదరాబాద్: శాంతి భద్రతల పరిస్థితి ఎంత దౌర్జన్యంగా ఉందో ఈ ఘటనతో అర్ధమవుతుందని ఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. కరీంనగర్ చరిత్రలో ఇలాంటి ఘటన ఎప్పుడూ జరగలేదని ఇది దుర్మార్గమైన ఘటన అని అన్నారు.

కరీంనగర్ కాల్పుల ఘటన బాధితులను పరామర్శించారు. తదుపరి కెటిఆర్ మీడియాతో మాట్లాడుతూ.. ఘటన జరిగి 30 గంటలు దాటిందని, పిఎంజె జ్యువెలరీ యాజమాన్యంతో మాట్లాడామని తెలియజేశారు. కేవలం కరీంనగర్ లోనే కాదని.. కొద్ది రోజుల క్రితం చందానగర్ లోనూ జ్యువెలరీ షాపులో దోపిడీ జరిగిందని అన్నారు. కరీంనగర్ ను సేఫ్ సిటీగా చేసేందుకు ప్రయత్నించామని, నేరం చేయాలంటే భయపడే విధంగా పాలన చేశామని కెటిఆర్ పేర్కొన్నారు. మాజీ సిఎం కెసిఆర్ హయాంలో శాంతి భద్రతలకు మొదటి ప్రాధాన్యత ఇచ్చామని, గతంలో ప్రతి చౌరస్తా లో ఇంటర్ సెప్టర్ వాహనం ఉండేదని అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు ఇలా ఉంటే..ఐదు తుపాకులతో దుండగులు తిరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? అని ప్రశ్నించారు.

రాష్ట్రంలో శాంతిభద్రతలు అడుగంటిపోయాయని, కెసిఆర్ హయాంలో ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్ తో పోటీపడ్డామని చెప్పారు. సిఎం రేవంత్ రెడ్డి పాలనలో శాంతిభద్రతల విషయంలో బిహార్ తో పోటీ పడుతున్నామని, పట్టపగలు ఇలాంటి ఘోరం జరిగితే ఒక్క అరెస్టు చేయలేదని, రాజకీయ కక్ష సాధింపులు తప్పితే.. శాంతిభద్రతల పర్యవేక్షణ లేదని విమర్శించారు. శాంతిభద్రతలు కాపాడటం కాంగ్రెస్ కు చేతనైతదా? లేదా? అని ప్రశ్నించారు. తమ ఇంటి సిసికెమెరాలు హ్యాక్ చేయడం కాదని.. ప్రజల ప్రాణాలు కాపాడేలా పనిచేయండి అని ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ప్రాధాన్యాలు మారాయి కాబట్టే రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి వచ్చిందని, ఇలాంటి ఘటన జరిగితే రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎవరైనా వచ్చారా? అని నిలదీశారు. కరీంనగర్ పోలీసులు బిఆర్ఎస్ కార్యకర్తలను వేధించడం తప్పితే..చేసిందేమీ లేదని, రేవంత్ రెడ్డికి ప్రైవేట్ ఆర్మీగా పనిచేస్తున్న అధికారులను వదిలిపెట్టమని హెచ్చరించారు. ఇప్పటికైనా హోంమంత్రి మొద్దు నిద్ర వీడాలని..శాంతిభద్రతలను కాపాడాలని కెటిఆర్ కోరారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mana Telangana Telugu