ధాన్యం కొనుగోలు కేంద్రాలకు స్వయంగా లారీలను తీసుకొచ్చిన
చొప్పదండి శాసనసభ్యుడు సత్యం
మన తెలంగాణ/ఉమ్మడి కరీంనగర్ బ్యూరో: రైతులు పండించిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసుకుంటామని కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హామీ ఇచ్చారు.
ఇచ్చిన హామీని మర్చిపోకుండా కొనుగోలు కేంద్రాలపై నిత్యం పర్యవేక్షణ చేస్తూ రైతులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకుంటున్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం లారీల కొరతతో మిల్లులకు తరలించడం ఇబ్బందిగా మారింది.
రైతులు పడుతున్న ఇబ్బందులను గ్రహించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వారి ఇబ్బందులను తీర్చడానికి స్వయంగా రంగంలోకి దిగారు. ఆదివారం గంగాధర మండలం మధురానగర్ చౌరస్తాకు సమీపంలో కరీంనగర్ జగిత్యాల జాతీయ రహదారిపై వెళ్తున్న లారీలను మంగపేట చెక్‌పోస్టు వద్ద ఎమ్మెల్యే ఆపారు. కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం తరలింపునకు సహకరించాలని లారీల యజమానులతో మాట్లాడారు. అంతేకాకుండా తానే లారీలో కూర్చుని స్వయంగా కొనుగోలు కేంద్రాలకు తీసుకువెళ్లారు. లారీ లోడింగ్ తర్వాత మిల్లులకు తరలించిన వెంటనే అన్లోడ్ అయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు.

