నిరంతర ప్రక్రియ: అమెరికా నివేదిక
వాషింగ్టన్ : భారతదేశపు సైనిక పాటవం అంతా కూడా రష్యా సరఫరాలతోనే ముడివడి ఉందని అమెరికా చట్టసభల పరిశోధక విభాగం (సిఆర్‌ఎస్) నివేదిక తేల్చింది.
ఇండియా నిరంతర ప్రక్రియగా రష్యా నుంచి ఆయుధాలను కొనుగోలు చేయడాన్ని బైడెన్ అధికార యంత్రాంగం తీవ్ర విషయంగానే పరిగణిస్తోంది. రష్యా ఆయుధ సాయం నేపథ్యంలో ఇండియా పట్ల వైఖరిని ఖరారు చేసుకునేందుకు బైడెన్ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది ప్రధాన అంశం అయింది. అమెరికా ప్రతికూలతల నివారణల చట్టం (క్యాట్సా) పరిధిలో భారతదేశంపై అమెరికా చర్యలకు లేదా ఆంక్షలకు వీలుందా? అనే విషయం పరిశీలనకు వచ్చిన దశలో ఈ నివేదిక వెలుగుచూసింది.. రష్యా ఆయుధాల విక్రయాలు, రక్షణ పరిశ్రమ అనే నివేదికలో భారతదేశం రష్యా నుంచి సైనిక సాయం పొందడాన్ని నేపథ్యంగా తీసుకుని ఈ నివేదిక స్వతంత్ర పరిశోధక సంస్థ నుంచి వెలువడింది.

