10.68 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి నిధులు
రెండురోజుల్లో రూ. 4,072 కోట్ల సాయం
ఇప్పటివరకు 54.96 లక్షల మందికి రైతు భరోసా
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీ మేరకు రైతుభరోసా పథకం కింద రెండో విడతలో మూడు ఎకరాల వరకు సాగుభూమి కలిగిన రైతుల ఖాతాల్లో బుధవారం రూ.1,590.02 కోట్లను నేరుగా జమ చేసినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఓ ప్రకటనలో వెల్లడించారు.
ఈ విడతలో 10.68 లక్షల మంది రైతులు, 26.50 లక్షల ఎకరాల సాగుభూమికి సంబంధించిన రైతుభరోసా సాయాన్ని పొందారని మంత్రి తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విడతల వారీగా రైతుభరోసా నిధులను విడుదల చేస్తున్నామని చెప్పారు. మంగళవారం మెదటి దశలో రెండు ఎకరాల వరకు భూమి కలిగిన 44.27 లక్షల మంది రైతులకు, రూ.2482.02 కోట్ల నిధులు విడుదల చేయగా, రెండవ రోజు రెండు నుంచి మూడు ఎకరాల వరకు భూమి కలిగిన రైతులందరికీ రైతు భరోసా నిధులు జమ చేసినట్లు చెప్పారు.
భరోసా నిధుల విడుదల జిల్లాల వారీగా ఇలా
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన రైతు భరోసాలో నల్గొండ జిల్లా అత్యధికంగా 4,06,875 మంది రైతులకు రూ.314.91 కోట్లు అందుకుని రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉండగా, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో అత్యల్పంగా 20,971 మంది రైతులకు రూ.11.20 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. అనంతరం సంగారెడ్డి జిల్లాకు 2,91,800 మంది రైతులకు రూ.198.88 కోట్లు, ఖమ్మం జిల్లాకు 2,71,027 మంది రైతులకు రూ.198.15 కోట్లు, సిద్దిపేట జిల్లాకు 2,66,722 మంది రైతులకు రూ.186.89 కోట్లు, నాగర్‌కర్నూల్ జిల్లాకు 2,29,721 మంది రైతులకు రూ.186.31 కోట్లు విడుదలయ్యాయి. కామారెడ్డి జిల్లాలో 2,59,093 మంది రైతులకు రూ.173.81 కోట్లు, సూర్యాపేట జిల్లాలో 2,28,156 మంది రైతులకు రూ.172.23 కోట్లు, వికారాబాద్ జిల్లాలో 2,19,389 మంది రైతులకు రూ.170.19 కోట్లు, నిజామాబాద్ జిల్లాలో 2,19,892 మంది రైతులకు రూ.164.23 కోట్లు జమయ్యాయి.
రంగారెడ్డి జిల్లాలో 2,35,943 మంది రైతులకు రూ.157.16 కోట్లు, మెదక్ జిల్లాలో 2,36,481 మంది రైతులకు రూ.138.14 కోట్లు, మహబూబాబాద్ జిల్లాలో 1,69,646 మంది రైతులకు రూ.132.07 కోట్లు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 1,79,917 మంది రైతులకు రూ.129.62 కోట్లు, మహబూబ్‌నగర్ జిల్లాలో 1,81,907 మంది రైతులకు రూ.126.51 కోట్లు అందాయి. జగిత్యాల జిల్లాలో 1,87,445 మంది రైతులకు రూ. 123.86 కోట్లు, నిర్మల్ లో1,38,256 మంది రైతులకు రూ.115.97 కోట్లు, జనగాం జిల్లాల్లో 1,42,617 మంది రైతులకు రూ. 109.66 కోట్లు, నారాయణపేట 1,33,325 మంది రైతులకు రూ. 109.11 కోట్లు, కరీంనగర్‌లో 1,57,948 మంది రైతులకు రూ. 108.61 కోట్లు రైతుల ఖాతాల్లో పడ్డాయి.
జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో 1,24,433 మంది రైతులకు రూ. 106.87 కోట్లు, భద్రాద్రి కొత్తగూడెంలో 1,15,431 మంది రైతులకు రూ. 103.59 కోట్లు, వనపర్తిలో1,45,543 మంది రైతులకు102.59 కోట్లు, వరంగల్‌లో 1,34,427 మంది రైతులకు రూ. 96.03, ఆదిలాబాద్‌లో 87,419 మంది రైతులకు రూ. 95.64 కోట్లు, మంచిర్యాలలో 1,20,025 మంది రైతులకు రూ. 90 కోట్లు పడ్డాయి. పెద్దపల్లిలో 1,27,906 మంది రైతులకు రూ. 88.49 కోట్లు, హన్మకొండలో 1,22,245 మంది రైతులకు రూ. 86.15 కోట్లు, రాజన్న సిరిసిల్లలో 1,01,666 మంది రైతులకు రూ. 75.76 కోట్లు, కొమురంభీం ఆసిఫాబాద్‌లో 81,448 మంది రైతులకు రూ. 75.72 కోట్లు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 93,768 మంది రైతులకు రూ.73.68 కోట్లు, ములుగు జిల్లాలో 64,030 మంది రైతులకు రూ.49.87 కోట్లు, జమ అయ్యాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 1,01,666 మంది రైతులకు రూ.75.76 కోట్లు జమయ్యాయి.

