సాంకేతికత, కీలక ఖనిజాలను ఆయుధాలుగా మార్చొద్దు
ఇది ఉమ్మడి పురోగతికి ఆటంకమని ప్రధాని మోడీ వార్నింగ్
అంటువ్యాధుల నివారణ, ప్రతిస్పందన కోసం హెచ్చరిక వ్యవస్థ ఏర్పాటు
'బ్రిక్స్ స్టార్టప్ ఇన్నోవేషన్ ఫండ్' ఏర్పాటుకు ప్రతిపాదన
'గ్లోబల్ సౌత్' నియమాలు రూపొందించేదిగా ఎదగాలని ఆకాంక్ష
సదస్సులో పాల్గొన్న బ్రిక్స్ దేశాధినేతలకు కృతజ్ఞతలు
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు సామాన్య ప్రజలపై ప్రతికూల ప్రభావం చూపుతున్న నేపథ్యంలో ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు బ్రిక్స్ దేశాలు పరస్పర సహకారం, సమ్మిళిత వృద్ధి ద్వారా ముందుకు సాగాలని, మానవాళి శ్రేయస్సు కోసం అభివృద్ధి చెందాలని ప్రధానమంత్రి మోడీ పిలుపునిచ్చారు. భారత్ ఆతిథ్యమిచ్చిన రెండ్రోజుల బ్రిక్స్ 18వ శిఖరాగ సదస్సు ముగింపు సమావేశంలో ప్రధాని ఆదివారంనాడు మాట్లాడుతూ, సాంకేతికత, కీలక ఖనిజాలను చూపి బెదిరింపులకు పాల్పడటాన్ని వ్యతిరేకించాలని అన్నారు.
ఇలాంటి చర్యలు సమష్టి వృద్ధికి అడ్డంకులు సృష్టిస్తాయని పరోక్షంగా చైనాను ఉద్దేశిస్తూ పేర్కొన్నారు. కీలక ఖనిజాల ఎగుమతులపై చైనా విదిస్తున్న ఆంక్షలు, అత్యాధునిక సాంకేతికతను పంచుకోవడంలో చూపుతున్న విముఖతపై ఆందోళనలు పెరుగుతున్న సమయంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేయడం, ఆయన మాట్లాడుతున్న సమయంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అక్కడే ఉండటం ప్రాధాన్యం సంతరించుకుంది.
ప్రపంచ దక్షిణ దేశాలు (గ్లోబల్ సౌత్) బ్రిక్స్‌పై మరింత విశ్వాసం పెంచుకుంటున్నాయని మోడీ అన్నారు. ఎందుకంటే తమ గొంతుకులు వినిపిస్తున్నాయని, తమ అనుభవాలకు విలువ ఇస్తున్నారని, తమపై పరిష్కారాలను బలవంతంగా రుద్దకుండా భాగస్వామ్యంతో పరిష్కారాలను రూపొందిస్తున్నారని పేర్కొన్నారు. 'మనమంతా భిన్నమైన వాస్తవాల్లో పాతుకుపోయి ఉన్నప్పటికీ సహకారం ద్వారా కలిసి ఎదుగుదాం. మానవాళి కోసం వికసిద్దాం. మన వైవిధ్యమే మన గుర్తింపుగా, మన సహకారమే మన స్ఫూర్తిగా, మన పురోగతి మొత్తం మానవాళికి ఉపయోగపడేలా ఉండాలి' అని అన్నారు.
విభజనకు లోనవుతున్న భౌగోళిక, రాజకీయ పరిస్థితులను ఎదుర్కొనేందుకు బ్రిక్స్ దేశాల స్థితిస్థాపకతను పెంచడం ఎంతో ముఖ్యమని ప్రధాని పేర్కొన్నారు. బ్రిక్స్ అధ్యక్ష హోదాలో భారత్ స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్ధితరత అనే నాలుగు స్తంభాలపై దృష్టి సారించిందని తెలిపారు. ఈ నాలుగు స్తంభాల ఆధారంగా బ్రిక్స్ ద్వారా సమ్మిళిత ప్రపంచ వృద్ధిని ప్రోత్సహించేందుకు భారత్ ప్రయత్నించిందన్నారు. బ్రిక్స్‌లో అభివృద్ధి చేసే పరిష్కారాల ప్రయోజనాలు ఆ కూటమికే పరిమితం కాకుండా, గ్లోబల్ సౌత్ అవసరాలకు అనుగుణంగా వాటిని అందుబాటులోకి తీసుకురావాలని భారత్ విశ్వసిస్తోందని చెప్పారు. అందరి సహకారం, మద్దతుతో మన ఉమ్మడి దృష్టిని పరస్పర ప్రయోజనకరమైన సహకారంగా మార్చగలిగామని చెప్పడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు.
సంక్షోభం ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాదు
మహమ్మారులు, వాతావరణ విపత్తులు, సరఫరా గొలుసుల అంతరాయాలు పరస్పరం అనుసంధానమైన నేటి ప్రపంచంలో ఏ సంక్షోభమూ ఒక్క ప్రాంతానికే పరిమితం కాదని మోడీ అన్నారు. ఆ కారణంగానే బ్రిక్స్‌లో స్థితిస్థాపకతను బలోపేతం చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. సవాళ్లను ముందుగానే గుర్తించడం, వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండటం, సత్వర చర్యలు తీసుకోవడం కూడా అంతే ముఖ్యమని చెప్పారు. అంటువ్యాధుల నివారణ, వాటి ప్రతిస్పందన కోసం బ్రిక్స్ ముందస్తు హెచ్చరిక వ్యవస్థ ఏర్పాటుకు అంగీకరించామని ఆయన తెలిపారు.
బ్రిక్స్ స్టార్టప్ ఇన్నోవేషన్ ఫండ్
అన్ని దేశాలు కలిసి 'బ్రిక్స్ స్టార్టప్ ఇన్నోవేషన్ ఫండ్'ను ఏర్పాటు చేయాలని మోడీ ప్రతిపాదించారు. ప్రత్యేక స్టార్టప్ నిధులు ఉండటం వల్ల బ్రిక్స్ దేశాల్లోని పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, ఆవిష్కర్తల మధ్య మరింత సహకారం పెరిగే అవకాశం ఉందన్నారు. ఆవిష్కరణలో రంగంలో బ్రిక్స్ ఇంక్యుబేటర్ నెట్‌వర్క్ ద్వారా సభ్యదేశాల స్టార్టప్‌లు, ఇంక్యూబేటర్లు పరస్పరం అనుసంధానమవుతాయని చెప్పారు.
బ్రిక్స్ డిజిటల్ అగ్రికల్చర్ నెట్‌వర్క్
బ్రిక్స్ డిజిటల్ అగ్రికల్చర్ నెట్‌వర్క్ రైతులకు కొత్త అవకాశాలు సృష్టిస్తుందని మోడీ తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా కృత్రిమ మేథ (ఏఐ), భౌగిళిక సమాచార సాంకేతికత, డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను రైతుల అవసరాలకు అనుసంధానించనున్నట్టు చెప్పారు. 'బ్రిక్స్ సహకారం కేవలం ప్రభుత్వాలకే పరిమితం కాకూడదని మా ప్రయత్నం. మన పారిశ్రామికవేత్తలు, రైతులు, పరిశోధకులు, మహిళలు, యువత, సామాన్య పౌరులను క్రియాశీలక భాగస్వాములుగా చేయడానికి ప్రయత్నించాం' అని ప్రధాని తెలిపారు.
'బ్రిక్స్ కనెక్ట్' ద్వరా నైపుణ్యాలు, ఉపాధి అవకాశాలు, మహిళల ఉద్యోగ భాగస్వామ్యం, సామాజిక భద్రత, సామర్థ్య నిర్మాణాన్ని ప్రోత్సహించామని చెప్పారు. చిన్న సంస్థలను నాలెడ్జ్, ఫైనాన్స్, కొత్త మార్కెట్లతో అనుసంధానించేందుకు 'బ్రిక్స్ ఎంఎస్‌ఎంఈ సహకార పోర్టల్'ను ప్రారంభించినట్టు తెలిపారు. నగరాల మధ్య అత్యుత్తమ విధానాలను పరస్పరం పంచుకునేందుకు 'బ్రిక్స్ ఆర్బన్ మొబిలిటీ హబ్'ను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. మానవ అభివృద్ధి-పర్యావరణం మధ్య సమతుల్యత సాధించాల్సిన అవసరాన్ని భారత్ బ్రిక్స్ సదస్సులో స్పష్టం చేసిందన్నారు.
ఇది సుస్థిరితకు పునాది మాత్రమే కాకుండా భవిష్యత్ తరాల మధ్య మన బాధ్యత కూడా అని అన్నారు. ఈ దిశగా పలు రంగాల్లో పురోగతి సాధించామని చెప్పారు. స్మార్ట్ గ్రిడ్లు, ఇంధన నిల్వల కోసం 'బ్రిక్స్ డిజిటల్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్'ను ఏర్పాట చేశామని అన్నారు. ఇది స్వచ్ఛ ఇంధన వ్యవస్థలను మరింత విశ్వసనీయంగా, సమర్ధవంతంగా, అందరికీ అందుబాటులో ఉండేలా చేయడానికి సహాయపడుతుందని తెలిపారు. రెండ్రోజుల శిఖరాగ్ర సదస్సు విజయవంతానికి సహకరించిన బ్రిక్స్ దేశాల నేతలకు ఈ సందర్భంగా మోడీ కృతజ్ఞతలు తెలిపారు.

