Dailyhunt
సమరోత్సాహంతో ఢిల్లీ

సమరోత్సాహంతో ఢిల్లీ

నేడు గుజరాత్‌తో పోరు

న్యూఢిల్లీ: వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బుధవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగే పోరుకు సమరోత్సాహంతో సిద్ధమైంది.

ఇందులోనూ గెలిచి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేయాలనే పట్టుదలతో కనిపిస్తోంది. ఇక ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓడిన గుజరాత్‌కు ఈ పోరు సవాల్‌గా మారింది. కనీసం ఇందులోనైనా గెలిచి బోణీ కొట్టాలని భావిస్తోంది. ఈ మ్యాచ్‌లో రషీద్ ఖాన్ జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో బలంగానే ఉన్నా గుజరాత్‌కు వరుస ఓటములు తప్పడం లేదు. ఈసారి మాత్రం పరాజయాలకు పుల్‌స్టాప్ పెట్టి తొలి విజయం అందుకోవాలని తహతహలాడుతోంది.

జోస్ బట్లర్, సాయి సుదర్శన్, తాహుల్ తెవాటియా, గ్లెన్ ఫిలిప్స్, రషీద్ ఖాన్, రబడా, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ వంటి స్టార్‌లు జట్టులో ఉన్నారు. అయితే సమష్టిగా రాణించడంలో విఫలం అవుతుండడం జట్టుకు సమస్యగా మారింది. ఈ మ్యాచ్‌లో ఆ లోపాలను సరిదిద్దుకుని ముందుకు సాగాలనే లక్షంతో గుజరాత్ పోరుకు సిద్ధమైంది. మరోవైపు ఢిల్లీ హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది. సమీర్ రిజ్వీ అద్భుత ఫామ్‌లో ఢిల్లీకి అతి పెద్ద ఊరటగా చెప్పాలి.

వరుసగా రెండు మ్యాచుల్లోనూ రిజ్వీ అసాధారణ బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్నాడు. ఈసారి కూడా అతనిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. రిజ్వీ మరోసారి చెలరేగితే ఢిల్లీకి హ్యాట్రిక్ విజయం సాధించడం కష్టమేమీ కాదు. కెఎల్ రాహుల్, పాథుమ్ నిసాంకా, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, అశుతోష్ శర్మ, నితీశ్ రాణా, కెప్టెన్ అక్షర్ పటేల్ తదితరులతో ఢిల్లీ బలంగా ఉంది. సమష్టిగా రాణిస్తే మరో విజయం ఖాయమని చెప్పాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mana Telangana Telugu