Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సంగీతకారుడి హత్య కేసు.. 8 మంది అరెస్ట్

సంగీతకారుడి హత్య కేసు.. 8 మంది అరెస్ట్

న్యూఢిల్లీ: సౌండ్ తగ్గించాలని కోరిన మణిపురి ప్రముఖ సంగీతకారుడు చోంగ్తమ్ విక్రమ్ సింగ్ (55)ను కొట్టి చంపిన కేసులో 8మందిని పోలీసులు అరెస్టు చేశారు.

నిందితుల్లో ఓ బాలుడు కూడా ఉన్నాడు. రెండు వారాల్లో అభియోగపత్రం దాఖలు చేస్తామని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. దక్షిణ ఢిల్లీలోని కిలోకరి గ్రామంలో ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఇంటి సమీపంలోని హోటల్ వద్ద కొందరు గట్టిగా మాట్లాడుతుండటంతో విక్రమ్ సింగ్ శబ్దం తగ్గించాలని కోరారు. వారిలో హోటల్ కార్మికులు, సిబ్బంది ఉన్నట్లు పోలీసులు తెలిపారు. దీంతో మాటామాటా పెరిగి దాడికి దారితీసింది.

నిందితులు ఆయనను భవనం మెట్ల వరకు వెంబడించి దాడి చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. సీసీటీవీ కెమెరాల దృశ్యాలు దర్యాప్తులో కీలక ఆధారాలుగా మారాయి. దాడి అనంతరం నిందితులు మెట్ల నుంచి కిందకు వస్తున్న దృశ్యాలు నమోదయ్యాయి. కుటుంబ సభ్యులు విక్రమ్‌ను ఆసుపత్రికి తరలిస్తున్న దృశ్యాలు కూడా సీసీటీవీలో కనిపించాయి. వాటి ఆధారంగా నిందితులను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.

తీవ్రంగా గాయపడిన విక్రమ్‌ను కుమారుడు ఆసుపత్రికి తరలించగా, సోమవారం చికిత్స పొందుతూ మృతి చెందారు. తీవ్ర గాయాలతో రక్తస్రావంతో పాటు షాక్‌కు గురై మరణించినట్లు వైద్యులు తెలిపారు. విక్రమ్ సింగ్ మణిపురి రాక్ సంగీతంలో ప్రముఖ గిటారిస్ట్. 1980లలో ఫినిక్స్ సంగీత బృందంలో ప్రధాన గిటారిస్ట్‌గా పనిచేశారు. తరువాత ఢిల్లీలో సంగీత ఉపాధ్యాయుడిగా కొనసాగారు. ఆయన తల్లి చోంగ్తమ్ కమలా ప్రముఖ మణిపురి గాయని.

మా కుటుంబానికి న్యాయం చేయండి : విక్రమ్ సింగ్ భార్య

చోంగ్తామ్ విక్రమ్ సింగ్ కుటుంబం తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసింది. ఆయన మృతిపై నిష్పక్షపాత దర్యాప్తు జరిపి బాధ్యులను శిక్షించాలని కోరింది. తమకు ప్రతీకారం అవసరం లేదని, న్యాయం మాత్రమే కావాలని స్పష్టం చేసింది. మంగళవారం మణిపూర్ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సింగ్ భార్య మాట్లాడుతూ.. 54 ఏళ్ల తన భర్తను అకస్మాత్తుగా కోల్పోయిన విషాదం నుంచి కుటుంబం ఇంకా తేరుకోలేకపోతోందని తెలిపారు. నా భర్తను కోల్పోయిన వాస్తవాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నాన్నారు. ఆయన ఆకస్మిక మరణంతో ఏర్పడిన లోటును మాటల్లో వర్ణించలేం అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mana Telangana Telugu