Dailyhunt
సంజుది మళ్లీ పాత కథే

సంజుది మళ్లీ పాత కథే

న తెలంగాణ/క్రీడా విభాగం: టి20 ప్రపంచకప్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగి పోవడంతో భారత స్టార్ ఆటగాడు సంజు శాంసన్‌పై అంచనాలు భారీగా పెరిగాయి. ప్రస్తుత ఐపిఎల్ సీజన్‌లో అతను చెన్నై సూపర్ కింగ్స్ తరఫున బరిలోకి దిగాడు.

రాజస్థాన్‌ను వదిలి సిఎస్‌కె మారిన సంజుపై అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. తమ అభిమాన ఆటగాడు శాంసన్ ఐపిఎల్‌లో మెరుపులు మెరిపించడం ఖాయమని భావించారు. కానీ శాంసన్ మాత్రం తన మార్క్ బ్యాటింగ్‌తో మళ్లీ తెలిపోయాడు. చెన్నై తరఫున ఆడిన మూడు మ్యాచుల్లోనూ విఫలమయ్యాడు. వరుసగా 6,7,9 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.

ఒక్క మ్యాచ్‌లో కూడా డబుల్ డిజిట్ స్కోరును అందుకోలేక పోయాడు. దీంతో శాంసన్‌పై మళ్లీ విమర్శలు మొదలయ్యాయి. అతని బ్యాటింగ్ తీరును విశ్లేషకులు తప్పుపడుతున్నారు. భారీ నమ్మకంతో తనను జట్టులోకి తీసుకున్న సిఎస్‌కె యజమాన్యానికి సంజు న్యాయం చేయలేక పోతున్నాడని విమర్శిస్తున్నారు. ప్రపంచ క్రికెట్‌లోనే మరే ఆటగాడికి కూడా సంజు లభించినన్ని అవకాశాలు లభించలేదని గుర్తు చేస్తున్నారు. అతను మాత్రం అందివచ్చిన అవకాశాన్ని తనకు అనుకూలంగా మార్చుకోలేక పోతున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐపిఎల్‌లో రాణించడం ద్వారా రానున్న రోజుల్లో టీమిండియాలో స్థానాన్ని శాశ్వతం చేసుకుంటాడని భావిస్తే అతను మాత్రం పేలవమైన బ్యాటింగ్‌తో నిరాశే మిగిల్చాడు. మిగిలిన మ్యాచుల్లోనైనా రాణిస్తాడా లేదా అనేది సందేహమే. ఒక వేళ మరో రెండు మ్యాచుల్లో విఫలమైతే మాత్రం తుది జట్టులో చోటు దక్కించుకోవడం కూడా కష్టమేనని విశ్లేషకులు జోస్యం చెబుతున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mana Telangana Telugu