మన తెలంగాణ/అశ్వాపురం: సీతారామ ఎత్తిపోతల పథకం కోసం భూములు ఇచ్చి సహకరించిన పినపాక నియోజకవర్గ రైతులకే ముందుగా సాగునీటి ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు.
అశ్వాపురం మండలం బీజీ కొత్తూరు సమీపంలో కొనసాగుతున్న మారెళ్లపాడు ఎత్తిపోతల పథకం పనులను సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించిన మంత్రి, పనుల జాప్యంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ జూలై నెలాఖరుకల్లా అన్ని పనులు పూర్తిచేయాలని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 'ఆగస్టు 15న నేను మళ్లీ ఇక్కడికి వచ్చి ప్రాజెక్టును ప్రారంభిస్తాను. ఆగస్టు నాటికి మారెళ్లపాడు నుంచి నా ఇంటి పేరుతో ఉన్న తుమ్మల చెరువుకు నీళ్లు చేరాలి' అని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కాలువల నిర్మాణం, పంపింగ్ వ్యవస్థ, విద్యుత్ సదుపాయాల పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సూచించారు. జూన్‌లోనే పూర్తికావాల్సిన పనులు ఇంకా కొనసాగుతుండటంపై మంత్రి ప్రశ్నిస్తూ, నిర్దేశిత గడువులను తప్పనిసరిగా పాటించాలని హెచ్చరించారు. సీతారామ ప్రాజెక్టు నిర్మాణానికి ఇప్పటివరకు సుమారు రూ.10 వేల కోట్లు ఖర్చు చేసినట్లు, పూర్తిస్థాయిలో రైతులకు ప్రయోజనం చేకూర్చేందుకు మరో రూ. 9 వేల కోట్ల నిధులు అవసరమవుతాయని తెలిపారు.
ముఖ్యమంత్రి చొరవతో డిస్ట్రిబ్యూటరీ కాలువల నిర్మాణానికి ఇప్పటికే రూ.4 వేల కోట్లు మంజూరైనట్లు వెల్లడించారు. భూ సేకరణ, డిస్ట్రిబ్యూటరీ కాలువల నిర్మాణ పనులు వేగవంతమైతే వచ్చే ఏడాది నాటికి పినపాక, అశ్వారావుపేట, కొత్తగూడెం, సత్తుపల్లి, మధిర నియోజకవర్గాల రైతులకు సాగునీరు అందించే అవకాశం ఉందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే ప్రధాన కాలువను పూర్తిస్థాయిలో శుభ్రపరచి, మట్టి తొలగింపు, గట్ల మరమ్మతులు చేపట్టి వర్షాకాలానికి ముందే నీటి ప్రవాహానికి అనుకూలంగా సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. మారెళ్లపాడు ఎత్తిపోతల పథకం పూర్తయితే వేల ఎకరాలకు సాగునీరు అందడంతో పాటు భూగర్భ జలాలు పెరిగి రైతాంగానికి దీర్ఘకాలిక ప్రయోజనం చేకూరుతుందని అధికారులు వివరించారు. ఎన్నో ఏండ్లుగా సాగునీటి కోసం ఎదురుచూస్తున్న రైతుల ఆశలు త్వరలోనే నెరవేరనున్నాయని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాయం వెంకటేశ్వర్లు, జిల్లా కలెక్టర్ అంకిత్, సబ్‌కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు, సీతారామ ప్రాజెక్టు ఇంజినీర్లు, బీజీ కొత్తూరు సర్పంచ్ మర్రి సంధ్య, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.

