జర్మనీలో మ్యూనిచ్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్ షూటింగ్‌లో భారత్‌కు మరో స్వర్ణం లభించింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత స్టార్ షూటర్ సురుచి ఇందర్ సింగ్ పసిడి పతకం గెలుచుకుంది.
కిందటి ఏడాది కూడా సురుచి ప్రపంచకప్‌లో పసిడి పతకం సాధించిన సంగతి తెలిసిందే. ఈసారి అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ తన ఖాతాలో రెండో స్వర్ణాన్ని జత చేసుకుంది. అద్భుత ఆటతో అలరించిన సురుచి 242.1 స్కోరుతో పసిడి దక్కించుకుంది. భారత యువ సంచలనం, తెలంగాణ ఆణిముత్యం ఇషా సింగ్ 241.2 స్కోరుతో రజతం గెలుచుకుంది. ఇషా అద్భుత ఆటను కనబరిచినా తృటిలో పసిడి సాధించే ఛాన్స్‌ను కోల్పోయింది. ఇదే ప్రపంచకప్‌లో ఇషా 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో సరికొత్త వరల్డ్ రికార్డుతో పసిడి సాధించింది. ఇప్పుడు రజతం సాధించి రెండో పతకాన్ని సొంతం చేసుకుంది.

