అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం నుంచి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. తుపాను తీవ్ర తుపానుగా బలపడే అవకాశం ఉన్న నేపథ్యంలో రానున్న ఐదు రోజుల పాటు అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న హోర్డింగులను వెంటనే తొలగించాలని సూచించారు. తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, క్షేత్రస్థాయి అధికారులు అప్రమత్తంగా ఉంటూ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని హోంమంత్రి ఆదేశించారు. తీరప్రాంత ప్రజలకు ముప్పు పొంచి ఉంటే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేలా ముందస్తు ఏర్పాట్లు చేయాలని సూచించారు. జిల్లా కంట్రోల్ రూమ్‌ల ద్వారా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని, సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచాలని స్పష్టం చేశారు.
వర్షాలు, తుపాను నేపథ్యంలో ప్రజలు, రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని హోంమంత్రి సూచించారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దని, వాటిని ఇతరులకు వ్యాప్తి చేయవద్దని హెచ్చరించారు. విపత్తుల నిర్వహణ సంస్థ, ఆర్టీజీఎస్ జారీ చేసే అధికారిక హెచ్చరికలను మాత్రమే అనుసరించాలని హోంమంత్రి వంగలపూడి అనిత ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

