పెషావర్: పాకిస్థాన్‌లో ఘోర పడవ ప్రమాదం జరిగింది. పాక్ లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో పర్యాటకులతో వెళ్తున్న ఓ టూరిస్టు పడవ సరస్సులో బోల్తా పడటంతో ఆరుగురు మరణించగా, మరో ముగ్గురు గల్లంతయ్యారని పోలీసులు తెలిపారు.
ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అప్పర్ స్వాత్ జిల్లాలోని కలామ్ లోయలో ఉన్న సైఫుల్లా సరస్సు వద్ద బుధవారం ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదం సమంయలో పడవలో ఒక కుటుంబానికి చెందిన మొత్తం తొమ్మిది మంది ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే స్వాత్ ప్రాంతానికి చెందిన 'రెస్క్యూ 1122' బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని.. గాలింపు, సహాయక చర్యలను ప్రారంభించాయి. సరస్సు నుండి మృతదేహాలను వెలికితీసినట్లు అధికారులు తెలిపారు. అయితే గల్లంతైన వారి ఆచూకీ కోసం ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. బాధితులందరూ పాకిస్థాన్ తూర్పు పంజాబ్ ప్రావిన్స్‌కు చెందినవారిగా గుర్తించారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
ఖైబర్ పఖ్తుంఖ్వా ముఖ్యమంత్రి సోహైల్ అఫ్రిది ఈ ఘటనపై స్పందించి.. సంబంధిత అధికారుల నుండి సమగ్ర నివేదికను కోరారు. నిర్లక్ష్యం లేదా దుష్ప్రవర్తన కారణంగా ఈ విషాదం జరిగిందని తేలితే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన యంత్రాంగాన్ని ఆదేశించారు.

