మాజీ మోడల్ ట్విషా శర్మ అనుమానాస్పద మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ జిల్లా న్యాయమూర్తి గిరిబాలా సింగ్‌ను సీబీఐ గురువారం అరెస్ట్ చేసింది.
మధ్యప్రదేశ్ హైకోర్టు ఆమెకు మంజూరైన ముందస్తు బెయిల్‌ను రద్దు చేసిన మరుసటి రోజే ఈ అరెస్టు జరిగింది. సీబీఐ అధికారులు భోపాల్‌లోని బాగ్ ముగాలియా ఎక్స్‌టెన్షన్ ప్రాంతంలో ఉన్న గిరిబాలా సింగ్ నివాసానికి చేరుకుని విచారణ అనంతరం అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే ట్విషా భర్త, న్యాయవాది సమర్థ్ సింగ్ సీబీఐ కస్టడీలో ఉన్నాడు. ట్విషా మృతికి దారితీసిన పరిస్థితులపై ఇద్దరినీ ఎదురెదురుగా ప్రశ్నించేందుకు సీబీఐ సిద్ధమవుతోంది. గిరిబాలా సింగ్‌ను కోర్టులో హాజరుపరచి కస్టడీ కోరనున్నట్లు అధికారులు తెలిపారు.
మే 15న సెషన్స్ కోర్టు గిరిబాలా సింగ్‌కు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఆ ఉత్తర్వులను మధ్యప్రదేశ్ హైకోర్టు బుధవారం రద్దు చేసింది. న్యాయమూర్తి దేవనారాయణ మిశ్రా తన 17 పేజీల తీర్పులో, కేసులో ఉన్న ఆరోపణలు, వాస్తవ పరిస్థితులను పరిశీలించిన తర్వాత ముందస్తు బెయిల్ రద్దు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. 33 ఏళ్ల ట్విషా శర్మ మే 12న తన అత్తింట్లో ఉరివేసుకున్న స్థితిలో కనిపించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసును సోమవారం సీబీఐ అధికారికంగా స్వీకరించి, రాష్ట్ర పోలీసుల ఎఫ్‌ఐఆర్‌ను తిరిగి నమోదు చేసింది. ఎఫ్‌ఐఆర్ ప్రకారం, సమర్థ్ సింగ్ తన భార్య ఇంట్లో ఉరివేసుకుందని చెబుతూ ఆమెను భోపాల్ ఎయిమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అయితే వైద్యులు ఆమెను ఆసుపత్రికి తీసుకువచ్చే సమయానికే మృతి చెందినట్లు ప్రకటించారు.
పోస్ట్‌మార్టం నివేదికలో ఉరివేసుకోవడం వల్లే మరణం సంభవించింది అని పేర్కొనడంతో పాటు, శరీరంపై పలు గాయాలు ఉన్నట్లు వెల్లడైంది. అవి బలమైన వస్తువుతో కొట్టడం వల్ల ఏర్పడి ఉండొచ్చని నివేదికలో పేర్కొన్నారు. 2025 డిసెంబర్ 9న జరిగిన వివాహ సమయంలో ఇచ్చిన వరకట్నంతో సంతృప్తి చెందకుండా అత్తింటివారు తన కుమార్తెను వేధించారని ట్విషా కుటుంబ సభ్యులు ఆరోపించారు. మానసిక వేధింపులు, గృహ హింస కారణంగానే ట్విషా ఈ దారుణ నిర్ణయం తీసుకుందని వారు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. మరోవైపు గిరిబాలా సింగ్ మాత్రం మీడియా ఇంటర్వ్యూల్లో ట్విషా ఆరోగ్య పరిస్థితి, ఆమె మానసిక స్థితిపై ప్రశ్నలు లేవనెత్తుతూ ప్రత్యారోపణలు చేస్తూ వస్తున్నారు.

