Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఉచితాలు అనుచితమా?

ఉచితాలు అనుచితమా?

చితాలు సమాజానికి శాపమా... అనే ప్రశ్న ఈ రోజు భారతదేశ ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన చర్చగా మారింది. ప్రజాస్వామ్యం అంటే ప్రజల సంక్షేమం కోసం పాలన చేయడం.

కానీ ఆ సంక్షేమం అంటే ఏమిటి? అది తక్షణ ఉపశమనా లేక దీర్ఘకాల అభివృద్ధా? ఈ రెండు మధ్య ఉన్న సున్నితమైన తేడాను గుర్తించకపోతే, ప్రజాస్వామ్యం స్వయం గా దారితప్పే ప్రమాదం ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్న పరిస్థితి కూడా అదే. దేశంలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఉచితాలు అనే పదం రాజకీయాల్లో ప్రధాన ఆయుధంగా మారింది. ప్రతి పార్టీ కూడా ప్రజలను ఆకర్షించడానికి కొత్త కొత్త పథకాల పేరుతో ఉచితాలు ప్రకటిస్తోంది. ఉచిత విద్యుత్, ఉచిత డబ్బు పంపిణీ, ఉచిత గ్యాస్, ఉచిత ప్రయాణం వంటి అనేక పథకాలు ప్రజలకు తక్షణ ఉపశమనాన్ని ఇస్తున్నట్టే కనిపిస్తున్నాయి. కానీ ఈ ఉచితాల వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏమిటి? నిజంగా ఇవి ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తున్నాయా? లేక ఓట్లు సాధించడానికి ఒక రాజకీయ వ్యూహమా? అనే ప్రశ్నలు తప్పనిసరిగా ఉత్పన్నమవుతున్నాయి. ఉచితాలు ఇవ్వడం అంటే తప్పు అని ఒకే పదంతో చెప్పలేం. ఎందుకంటే కొన్ని సందర్భాలలో ప్రభుత్వ జోక్యం అవసరం అవుతుంది. పేదరికం, ఆకలి, ఆరోగ్య సమస్యలు, విద్య లోపం వంటి అంశాలలో ప్రభుత్వం సహాయం చేయడం సమాజానికి అవసరం. ఉదాహరణకు, పేద విద్యార్థులకు ఉచిత విద్య, పేదలకు ఉచిత వైద్యం వంటి పథకాలు సమాజాన్ని ముందుకు తీసుకెళ్లే పునాది లాంటివి.

ఇవి ఒక దేశ అభివృద్ధికి అవసరమైన మౌలిక హక్కులు. కానీ అదే సమయంలో ప్రతి అంశాన్ని ఉచితంగా మార్చడం, ప్రతి అవసరాన్ని ప్రభుత్వంపై ఆధారపడి తీర్చుకోవడం ఒక ప్రమాదకర దిశగా తీసుకెళ్తుంది. ఉచితాల రాజకీయాలు తాత్కాలికంగా ప్రజలకు ఆనందాన్ని ఇస్తాయి. ఎన్నికల సమయంలో ఇది మరింత ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఎందుకంటే ఒక వ్యక్తి తన రోజువారీ సమస్యలతో బాధపడుతున్నప్పుడు, అతనికి తక్షణ ఉపశమనాన్ని ఇచ్చే ఏ పథకమైనా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. కానీ దీర్ఘకాలంలో ఈ పథకాల ప్రభావం ఎలా ఉంటుందో చాలా మంది ఆలోచించరు. ఒక సమాజం నిరంతరం ఉచితాలపై ఆధారపడితే, క్రమంగా కష్టపడి సంపాదించే భావన తగ్గిపోతుంది. స్వయం సమర్థత క్షీణిస్తుంది. వ్యక్తి తన సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించకుండా, ప్రభుత్వంపై ఆధారపడే పరిస్థితి ఏర్పడుతుంది.

ప్రత్యేకంగా యువతపై ఈ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. యువత అనేది ఒక దేశానికి బలం. వారి కృషి, ఆలోచనలు, సృజనాత్మకత దేశాన్ని ముందుకు నడిపిస్తాయి. కానీ అదే యువత ఉచితాలవల్ల అలసత్వానికి లోనైతే, దేశ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది. చదువుకున్న యువకులు కూడా తమకు తగిన అవకాశాలు దొరకక చిన్న చిన్న ఉద్యోగాలలోనే నిలిచిపోతున్నారు. ఇది కేవలం వారి వైఫల్యం కాదు. ఇది ఒక వ్యవస్థలోని లోపం. విద్యావ్యవస్థ సరైన నైపుణ్యాలను అందించకపోవడం, పరిశ్రమల అభివృద్ధి లేకపోవడం, ప్రభుత్వ విధానాల్లో స్పష్టత లేకపోవడం, ఈ కారకాలన్నీ కలిసి ఈ పరిస్థితిని సృష్టిస్తున్నాయి. ఇక్కడ మరో ముఖ్యమైన అంశం ఆర్థిక పరిపాలన. ఒక ప్రభుత్వం ఉచితాలు ప్రకటించడానికి ముందు, ఆర్థిక వనరులు ఎలా సమకూర్చుకుంటుందో ఆలోచించాలి. ఆదాయం లేకుండా ఖర్చులు పెంచితే, అప్పులు తప్పవు. అప్పులు పెరిగితే, భవిష్యత్ తరాలపై భారమవుతుంది. ఈ రోజు తీసుకునే నిర్ణయాలు రేపటి తరాలకు ప్రభావం చూపుతాయి. కానీ ఎన్నికల రాజకీయాల్లో ఈ దీర్ఘకాల ఆలోచన చాలా సందర్భాల్లో కనిపించదు. తక్షణ ప్రయోజనాల కోసం భవిష్యత్తును తాకట్టు పెట్టే పరిస్థితి ఏర్పడుతోంది.

రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిని గమనిస్తే చాలా చోట్ల అప్పులు పెరుగుతున్నాయి. ఒక ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, గత ప్రభుత్వంపై నిందలు వేయడం ఒక సాధారణ ధోరణిగా మారింది. వాళ్లు అప్పులు చేసి వెళ్లారు అనే వాదన వినిపిస్తుంది. కానీ అదే సమయంలో కొత్తగా కూడా అప్పులు తీసుకుంటూ ఉచిత పథకాలను కొనసాగించడం ఒక విరుద్ధమైన పరిస్థితి. ప్రజలు కూడా ఈ విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. ఒక ప్రభుత్వాన్ని కేవలం హామీల ఆధారంగా కాకుండా, ఆ హామీలను అమలు చేసే సామర్థ్యాన్ని బట్టి అంచనా వేయాలి. ప్రజాస్వామ్యంలో ఓటు ఒక శక్తి. ఆ శక్తిని ఎలా ఉపయోగించాలో ప్రజలపై ఆధారపడి ఉంటుంది. ఒక ఓటు ద్వారా మనం ఒక ప్రభుత్వాన్ని ఎంచుకుంటాం. ఆ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు మన జీవితాలను ప్రభావితం చేస్తాయి. కాబట్టి ఓటు వేసేటప్పుడు తక్షణ ప్రయోజనాలను కాకుండా, దీర్ఘకాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకోవాలి. ఉచితాలు ఇచ్చే పార్టీని కాకుండా, అవకాశాలు సృష్టించే పార్టీని ఎంచుకోవాలి.

ఇక్కడ విద్య, ఆరోగ్యం గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఇవి ఉచితంగా అందించాల్సిన అత్యవసర రంగాలు. ఎందుకంటే ఒక వ్యక్తి చదువుకున్నప్పుడు, అతను తన జీవితాన్ని మార్చుకునే సామర్థ్యాన్ని పొందుతాడు. ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నప్పుడు, అతను సమాజానికి ఉపయోగపడగలడు. కాబట్టి ఈ రెండు రంగాలలో పెట్టుబడి పెట్టడం ఖర్చు కాదు, అది ఒక పెట్టుబడి. ఇది దేశ భవిష్యత్తును నిర్మించే పునాది. అదే సమయంలో మిగతా రంగాలలో ఉచితాల కంటే అవకాశాలు ఇవ్వడం ముఖ్యమైనది. ఉద్యోగాలు సృష్టించడం, పరిశ్రమలను ప్రోత్సహించడం, నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వడం, వ్యవసాయానికి మద్దతు ఇవ్వడం వంటి అంశాలు సమాజాన్ని స్థిరంగా ముందుకు తీసుకెళ్తాయి. ఒక రైతుకు ఉచిత డబ్బు ఇవ్వడం కంటే, అతనికి సరైన ధర, నీరు, మార్కెట్ ఇవ్వడం ఎక్కువ ప్రయోజనకరం. ఒక యువకుడికి ఉచిత సబ్సిడీ ఇవ్వడం కంటే, అతనికి ఉద్యోగం లేదా వ్యాపారం చేసే అవకాశాన్ని కల్పించడం ఉత్తమం.

ప్రస్తుత రాజకీయ పరిస్థితులను పరిశీలిస్తే, హామీలు ఇవ్వడం చాలా సులభం. కానీ వాటిని అమలు చేయడం చాలా కష్టం. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు కాకపోవడం ప్రజల్లో నిరాశను కలిగిస్తుంది. ఇది ప్రజాస్వామ్యంపై నమ్మకాన్ని కూడా దెబ్బతీస్తుంది. ఒక నాయకుడు చెప్పిన మాట నిలబెట్టుకోకపోతే, ప్రజలు రాజకీయ వ్యవస్థపై విశ్వాసం కోల్పోతారు. ఇక ప్రజల పాత్ర గురించి మాట్లాడితే, మార్పు ఎక్కడి నుండి వస్తుంది అనే ప్రశ్నకు సమాధానం స్పష్టంగా ఉంది, ప్రజల నుంచే. ఒక సమాజం చైతన్యవంతంగా మారితే, రాజకీయాలు కూడా మారతాయి. ప్రజలు తమ హక్కులను మాత్రమే కాకుండా, తమ బాధ్యతలను కూడా గుర్తించాలి. ఉచితాల కోసం కాకుండా, అభివృద్ధి కోసం ఓటు వేయాలి. అప్పుడు మాత్రమే నిజమైన మార్పు సాధ్యమవుతుంది.

సామాజిక సంస్థలు, విద్యావేత్తలు, మేధావులు కూడా ఈ మార్పులో కీలక పాత్ర పోషించాలి. ప్రజల్లో అవగాహన పెంచాలి. ఉచితాలవల్ల కలిగే దుష్ప్రభావాలను వివరించాలి. దీర్ఘకాల అభివృద్ధి ప్రాముఖ్యతను తెలియజేయాలి. మీడియా కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. సంచలనం కంటే సత్యాన్ని చూపాలి. మొత్తంగా చూస్తే, ఉచితాల రాజకీయాలు పూర్తిగా శాపమని చెప్పలేం. కానీ అవి నియంత్రణ లేకుండా కొనసాగితే, సమాజానికి నష్టం కలిగించే అవకాశం ఉంది. అవసరమైన చోట ఉచితాలు ఉండాలి, కానీ అవి ఒక వ్యూహంగా మారకూడదు. ప్రజల సంక్షేమం అనే పేరుతో ఓట్లు కొనే ప్రయత్నం ఆగాలి. ఈ రోజు మనం ఒక కీలక దశలో ఉన్నాం. ఒక దిశలో కొనసాగితే, మనం ఆధారపడి జీవించే సమాజంగా మారిపోతాం. మరో దిశలో ముందు కు సాగితే, మనం స్వయం సమర్థతతో అభివృద్ధి చెందే సమాజంగా మారగలం. ఈ ఎంపిక మన చేతుల్లోనే ఉంది. ప్రశ్న మళ్లీ అదే.. మార్పు ఎవరు తెస్తారు? జవాబు కూడా అదే, మనమే. ప్రజలు మేలుకుంటే, రాజకీయాలు మారతాయి. నాయకులు కూడా మారాల్సి వస్తుంది. హామీలు ఇవ్వడమే కాదు, వాటిని నిలబెట్టుకోవాల్సి వస్తుంది. ఆ రోజు తప్పకుండా వస్తుంది. కానీ అది స్వయంగా రాదు. మన ఆలోచనల్లో మార్పు వచ్చినప్పుడే, మన ఓటులో మార్పు వచ్చినప్పుడే, మన సమాజంలో మార్పు వస్తుంది. అందుకే ఇప్పుడు అవసరం, చైతన్యం, బాధ్యత, దీర్ఘకాల దృష్టి. ఉచితాల మాయ నుండి బయటపడి, అభివృద్ధి మార్గంలో నడవాల్సిన సమయం ఇదే.

మన్నారం నాగరాజు

95508 44433

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mana Telangana Telugu