Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఉద్యమకారుల రుణం తీర్చుకోవడం ప్రభుత్వ బాధ్యత

ఉద్యమకారుల రుణం తీర్చుకోవడం ప్రభుత్వ బాధ్యత

న తెలంగాణ/హైదరాబాద్: స్వరాష్ట్ర సాధన కోసం ప్రాణాలను, భవిష్యత్తును పణంగా పెట్టిన ఉద్యమకారుల రుణం తీర్చుకోవడం, వారి కుటుంబాలకు సేవ చేయడం తమ ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పునరుద్ఘాటించారు.

ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ చైర్మన్ డాక్టర్ కె. కేశవరావు (కేకే) నేతృత్వంలో కమిటీ ప్రతినిధి బృందం శనివారం జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇటీవల అమరవీరుల స్మారక చిహ్నం (అమరదీపం) వేదికగా 13 వేల మందికి పైగా ఉద్యమకారులు, వివిధ జేఏసీలు, ప్రజాసంఘాలు, కవులు, కళాకారులు, మహిళా ఉద్యమకారులతో నిర్వహించిన విస్తృత స్థాయి సంప్రదింపుల వివరాలను, ఉద్యమకారుల వర్గీకరణ ముసాయిదా, వారు సమర్పించిన ప్రధాన విజ్ఞప్తుల నివేదికను కమిటీ ముఖ్యమంత్రికి సమర్పించి సమగ్రంగా వివరించింది.

ఈ సమావేశంలో ఎమ్మెల్సీ ప్రొఫెసర్ ఎమ్. కోదండరామ్, కమిటీ ఎగ్జిక్యూటివ్ సభ్యులు మోతె శోభన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఎస్. రాములు నాయక్ పాల్గొన్నారు. సమావేశంలో కమిటీ ప్రతినిధులు పలు అంశాలను వివరించిన అనంతరం ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి పలు సూచనలు చేశారు. ఎలాంటి జాప్యం లేకుండా కసరత్తు పూర్తి చేయాలని చెప్పారు. ఉద్యమకారుల గుర్తింపు, సంక్షేమ కసరత్తును ఎక్కడా ఆలస్యం చేయకుండా, అత్యంత వేగవంతంగా పూర్తి చేయాలని కమిటీకి సూచించారు. ఉద్యమకారుల సేవకు ప్రభుత్వం సిద్ధం -ఉందని సిఎం వెల్లడించారు. ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియకు సంబంధించిన అధికారిక వెబ్‌సైట్ పోర్టల్ రూపకల్పన, డిజిటల్ దరఖాస్తుల స్వీకరణ, జిల్లాల వారీ సమన్వయం, అవసరమైన పరిపాలనాపరమైన వనరుల కల్పనలో కమిటీకి పూర్తి స్థాయిలో అధికారిక సహకారాన్ని అందించాలని హాజరైన ఉన్నతాధికారులను ముఖ్య మంత్రి ఆదేశించారు.

సిఎంకు కమిటీ కృతజ్ఞతలు

ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ జీవో 679 ద్వారా కమిటీని ఏర్పాటు చేయడమే కాకుండా ఉద్యమకారుల ప్రధాన డిమాండ్లు అయిన 250 గజాల నివాస స్థలాలు, ఆసరా పెన్షన్, హెల్త్ కార్డులు, ఆర్టీసీ ఉచిత ప్రయాణం, ఉద్యోగులకు గౌరవ గుర్తింపు తదితర అంశాలపై ఎంతో సానుకూలంగా స్పందించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చైర్మన్ కేకే, కోదండరామ్, శోభన్ రెడ్డి, రాములు నాయక్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వి.శేషాద్రి, ముఖ్యమంత్రి కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి, వి.పి. గౌతమ్, ఎస్. శ్రీధర్, ముఖ్యమంత్రి ఓఎస్డీలు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mana Telangana Telugu