Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వారణాసి ఎయిర్ షో అద్భుతం: ప్రధాని మోడీ

వారణాసి ఎయిర్ షో అద్భుతం: ప్రధాని మోడీ

గంగపై 'వింగ్స్ ఓవర్ గంగా' వైమానిక ప్రదర్శన

ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన కాశీ ఫార్మేషన్

భారత వైమానిక దళం 94వ వార్షికోత్సవంలో పాల్గొన్న ప్రధాని

వారణాసి: భారత వైమానిక దళం నిర్వహించిన వైమానిక ప్రదర్శనను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం వీక్షించారు. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నమో ఘాట్ వద్ద నిర్వహించిన 'వింగ్స్ ఓవర్ గంగా' ప్రదర్శనలో వైమానిక దళానికి చెందిన ప్రముఖ ప్రదర్శనా బృందాలు గంగానదిపై విన్యాసాలు చేశాయి.

భారత వైమానిక దళం 94వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన మూడు రోజుల ప్రదర్శన చివరి రోజున మోడీతో పాటు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. మోడీ తెల్లటి వైమానిక దళం టోపీ, నల్లటి సన్‌గ్లాసెస్ ధరించి ప్రదర్శనను వీక్షించారు. యుద్ధవిమానాల శబ్దాలతో పవిత్ర నగరం వారణాసి ఆకాశం మార్మోగింది. ప్రదర్శన గంటకు పైగా కొనసాగింది.

సుఖోయ్-30 ఎంకేఐ, స్వదేశీ తేజస్, ఎల్‌సీహెచ్ ప్రచండ్ సహా యుద్ధవిమానాలు, హెలికాప్టర్లు ప్రదర్శనలో పాల్గొన్నాయి. 'కాశీ ఫార్మేషన్' ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇందులో మూడు కిరణ్ విమానాలు 'వి' ఆకారంలో ఎగురుతూ త్రివర్ణ పతాక రంగులను ఆకాశంలో ఆవిష్కరించాయి. 'ఓంకార్ ఫార్మేషన్'లో ఎంఐ-17 హెలికాప్టర్లు జాతీయ పతాకాన్ని తీసుకుని ఆకాశంలో ఎగిరాయి. రఫేల్, సుఖోయ్, మిరాజ్ 2000, తేజస్, మిగ్-29, జాగ్వార్ యుద్ధవిమానాలతో పాటు రవాణా విమానాలు, హెలికాప్టర్లు భారత వైమానిక దళం కార్యాచరణ సామర్థ్యాన్ని ప్రదర్శించాయి.

సూర్యకిరణ్ ఏరోబాటిక్, సారంగ్ హెలికాప్టర్ ప్రదర్శనా బృందం చేసిన వైమానిక విన్యాసాలు ప్రేక్షకులను అలరించాయి. పవిత్ర గంగ, ఉత్సాహభరిత ఘాట్‌లు ప్రశాంతమైన నేపథ్యాన్ని అందించగా.. వాటిపై నుంచి దూసుకెళ్లిన సైనిక విమానాల భారీ శబ్దం వాతావరణంలో ఉత్సాహాన్ని నింపింది. వైమానిక దళ సిబ్బంది నైపుణ్యం, సాహసాన్ని ప్రేక్షకులు ఆసక్తిగా వీక్షించారు. కొంతమంది త్రివర్ణ పతాకాలను ఊపగా.. ప్రదర్శనా ప్రాంగణమంతా 'భారత్ మాతా కీ జై', 'వందే మాతరం' నినాదాలతో మార్మోగింది.

మోడీకి సాదర స్వాగతం

మోడీ హాజరుతో స్థానికుల్లో ఉత్సాహం నెలకొంది. ప్రధానమంత్రిని ఆహ్వానించేందుకు పోలీస్ లైన్స్ నుంచి నమో ఘాట్ వరకు మార్గం వెంట పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడారు. బీజేపీ కార్యకర్తలు, స్థానికులు గులాబీ రేకులతో, సంప్రదాయ సంగీత ప్రదర్శనలు, సాంసృ్కతిక కార్యక్రమాలతో మోడీకి స్వాగతం పలికారు. మోడీ తన వాహనం ఫుట్‌బోర్డుపై నిలబడి ప్రజలకు అభివాదం చేయగా, వారు 'హర్ హర్ మహాదేవ్', 'జై శ్రీరామ్' నినాదాలు చేశారు. ప్రధానమంత్రి సమక్షంలో వైమానిక ప్రదర్శనను వీక్షించడం గర్వంగా ఉందని పలువురు ప్రేక్షకులు తెలిపారు.

మోడీ ఆదివారం ఉదయం వారణాసిలోని లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో మిర్జామురాద్‌కు వెళ్లి అరవింద్ లిమిటెడ్‌కు చెందిన కొత్త దుస్తుల తయారీ యూనిట్‌ను ప్రారంభించారు. పర్యటనలో భాగంగా సుమారు 300 మంది మహిళలతో మాట్లాడారు.

అనంతరం పోలీస్ లైన్స్‌కు విమానంలో చేరుకుని, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో నమో ఘాట్‌కు వెళ్లారు. వైమానిక ప్రదర్శనను వీక్షించిన అనంతరం అందుకు సంబంధించిన వీడియోను ఎక్స్ వేదికగా ప్రధాని పంచుకున్నారు. వారణాసి ఎయిర్ షో... అద్భుతం అని రాసుకొచ్చారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mana Telangana Telugu