సాయుధ దుండగుడిని మట్టుబెట్టిన భద్రతా బలగాలు
ట్రంప్ కు హాని తలపెడతానని గతంలో పోస్టులు
ఘటన సమయంలో శ్వేతసౌధంలోనే ట్రంప్
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష భవనం శ్వేత సౌధం వద్ద ఆదివారం కాల్పుల కలకలం చోటుచేసుకుంది.
సీక్రెట్ సర్వీస్ చెక్ పాయింట్ వద్దకు దూసుకువచ్చిన సాయుధ దుండగుడు భద్రతా బలగాలపై కాల్పులకు దిగాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఎదురుకాల్పులు ప్రారంభించాయి. కాల్పుల్లో దుండగుడు తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. 15 నుంచి 30 రౌండ్ల కాల్పులు జరిగాయి. మృతుడిని నసీర్ బెస్ట్‌గా గుర్తించారు. కాల్పులు ఘటనను ఎఫ్‌బిఐ చీఫ్ కాష్ పటేల్ ధ్రువీకరించారు.
సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ఎవరికీ నష్టం జరగలేదన్నారు. దుండగుడిని ఆస్పత్రిలో చేర్చిన తర్వాత ఆ ప్రాంతంలో లాక్‌డౌన్ ఎత్తివేశారు. కాల్పులు ఘటన సమయంలో అధ్యక్షుడు ట్రంప్ వైట్‌హౌస్‌లో ఉన్నారు. ప్రెస్ భ్రీపింగ్ కోసం వచ్చిన జర్నలిస్టులను శ్వేతసౌధంలోని గదికే భద్రత బలగాలు పరిమితం చేశాయి. అధ్యక్షుడు ట్రంప్‌ను టార్గెట్ చేస్తూ ఆన్‌లైన్‌లో పలు పోస్టులు పెట్టినట్టు అధికారులు గుర్తించారు.
అధ్యక్షుడికి హాని తలపెడతానంటూ అతడు ఈ పోస్టులను పెట్టినట్టు దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. తానే అసలైన బిన్ లాడెన్ అని కొన్ని పోస్టుల్లో నిందితుడు పేర్కొన్నాడు. నిందితుడి అనుమానాస్పద వైఖరి సీక్రెట్ సర్వీసు ఏజెంట్స్ దృష్టికి వచ్చినప్పటికీ అతడు హింసకు దిగవచ్చన్న ఆధారాలు మాత్రం అప్పట్లో లభించలేదని సమాచారం. ఒక సందర్భంలో అధికారులకు చిక్కిన అతడు తాను క్రీస్తు అవతారాన్ని అని కూడా చెప్పుకున్నట్టు తెలిసింది. అతడికి మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్నట్టు తెలిసింది.

