Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వయసును జయించిన బామ్మ....  వరల్డ్ రికార్డు

వయసును జయించిన బామ్మ.... వరల్డ్ రికార్డు

61 ఏళ్ల వయసులో ప్రపంచ రికార్డు.. బామ్మ పట్టుదలకు ప్రపంచమే ఫిదా!

ఒట్టావా: వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమే అని నిరూపించారు కెనడాకు చెందిన 61 ఏళ్ల డోనాజీన్ వైల్డ్.

వయసు పెరిగినా పట్టుదల తగ్గకపోతే ఏదైనా సాధించవచ్చని చాటి చెబుతూ.. ఏకంగా 5 గంటల పాటు ప్లాంక్ చేసి మహిళల ప్రపంచ రికార్డును బద్దలు కొట్టారు. ఆల్బెర్టాకు చెందిన డోనాజీన్ వైల్డ్‌ ఐదుగురు పిల్లలకు తల్లి, 12 మంది మనవళ్లకు బామ్మ. గతంలో హైస్కూల్ వైస్ ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. 12 ఏళ్ల క్రితం మణికట్టు విరగడంతో పరుగులు, వెయిట్ లిఫ్టింగ్‌కు దూరమైన ఆమె.. ప్లాంక్‌ను తన ఫిట్‌నెస్ ప్రయాణంలో భాగం చేసుకున్నారు.

కోవిడ్ సమయంలో ప్లాంక్ సమయాన్ని 2 గంటలకు పెంచిన డోనాజీన్.. 2023 నుంచి మరింత కఠినంగా సాధన ప్రారంభించారు. రోజుకు గంటల తరబడి ప్లాంక్‌తో పాటు రన్నింగ్, పుషప్స్ చేస్తూ తన శరీరాన్ని రికార్డు కోసం సిద్ధం చేసుకున్నారు. 2024 మార్చిలో 4 గంటల 30 నిమిషాల 11 సెకన్లతో అప్పటి రికార్డును బద్దలు కొట్టిన ఆమె.. తాజాగా 5 గంటల ప్లాంక్‌తో మరో ప్రపంచ రికార్డు సృష్టించారు. అంతకుముందు రికార్డు 4 గంటల 20 నిమిషాలు కాగా.. దాన్ని కూడా కెనడాకే చెందిన డానా గ్లోవాకా నెలకొల్పారు. మరింత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ప్లాంక్ చేస్తూనే సినిమాలు చూడటంతో పాటు మాస్టర్స్ డిగ్రీ చదువుతారట! "మొదటి రెండు గంటలు బాగానే సాగాయి.. చివరి గంటలో ఫోకస్ చేయడమే కష్టమైంది" అని డోనాజీన్ చెప్పడం ఆమె పట్టుదలకు నిదర్శనం. వయసు అడ్డంకి కాదు.. సంకల్పం ఉంటే అసాధ్యమేదీ కాదు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mana Telangana Telugu