వికారాబాద్: విద్యార్థి తల్లితో గురుకుల స్కూల్ ప్రిన్సిపాల్ అసభ్యంగా ప్రవర్తించిన సంఘటన వికారాబాద్ జిల్లా యాలాల మండల పరిధిలో జరిగింది. ఓ గ్రామానికి చెందిన బాలుడు యాలాల మండల పరిధిలోని పులే గురుకులంలో తొమ్మిదో తరగది చదువుతున్నాడు.
కుమారుడిని చూసేందుకు తల్లి పలుమార్లు స్కూలు రావడంతో ఆమెతో ప్రిన్సిపాల్ మెగావత్ నరేష్ పరిచయం పెంచుకున్నాడు. ఫోన్లో ఆమెతో అసభ్యంగా మాట్లాడాడు. మంగళవారం కుమారుడిని స్కూల్‌లో కలిసి బయటకు వెళ్తుండగా ప్రిన్సిపాల్ ఆమెతో మాట్లాడాడు. ఆమె నడుచుకుంటూ వెళ్తుండగా ప్రిన్సిపాల్ ఆమెను కారు ఎక్కాల్సిందిగా కోరాడు. అగ్గనూరు గ్రామ శివారులోకి వెళ్లిన తరువాత ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడంతో తన కుటుంబ సభ్యులకు మహిళ సమాచారం ఇచ్చింది. కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకొని ప్రిన్సిపాల్‌పై దాడి చేశారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

