Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
విద్యావ్యవస్థలో జవాబుదారేది?

విద్యావ్యవస్థలో జవాబుదారేది?

విద్యార్థుల భవితతో చెలగాటం సరికాదు

ప్రధాని సహా అందరూ బాధ్యతగా ఉండాల్సిందే

పర్యావరణ వేత్త సోనమ్ వాంగ్‌చుక్ విసుర్లు

భారతీయులను మేల్కొల్పడమే లక్ష్యమని వెల్లడి

ధర్నా చౌక్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ నిరసన ప్రదర్శన

కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర రాజీనామా చేయాలని డిమాండ్

నిరసనకు పెద్ద ఎత్తున తరలివచ్చిన యువత

రాజధానిలో సిజెపి తొలి ఉద్యమం విజయవంతం

మన తెలంగాణ/ విద్యానగర్: విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే సంస్థల్లో ఉన్న వ్యవస్థాగత లోపాలను తక్షణం సరిదిద్దడంతో పాటు పారదర్శకత, జవాబుదారీతనం ఉండేలా చూడాల్సిన బాధ్యత అందరిపైన ఉందని పర్యావరణవేత్త, విద్యాసంస్కర్త సోనమ్ వాంగ్‌చుక్ పేర్కొన్నారు. విద్యావ్యవస్థ ప్రక్షాళన, పటిష్టం విషయంలో ప్రధానితో పాటు ప్రతి ఒక్కరూ జవాబుదారీతనంగా ఉండాలన్నారు. అంతేకాకుండా ప్రజల గొంతులను అణచివేయకుండా, వారి గొంతుకలు స్వేచ్ఛగా వినిపించేలా చూడాలన్నారు.

నీట్ పరీక్ష లీకేజీ, అవకతవకల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద శాంతియుత నిరసన ప్రదర్శన నిర్వహించారు. హైదరాబాద్ నగరంలో సీజేపీ తొలిసారిగా నిర్వహించిన ఈ ఆందోళనకు పెద్ద ఎత్తున యువత, విద్యార్థి, ప్రజాసంఘాల ప్రతినిధులు, మేధావులు హాజరయ్యారు. విభిన్న రకాల ప్లకార్డులు ప్రదర్శిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలని, విద్యావ్యవస్థను ప్రక్షాళన చేయాలని నినదించారు. సీజేపీ ఆందోళనకు ముఖ్య అతిథిగా హాజరైన పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ మాట్లాడుతూ.. కాక్రోచ్ జనతా పార్టీ సాధారణ రాజకీయ వేదిక కాదని, పాలకుల తప్పులను ఎత్తిచూపుతూ ప్రతీ భారతీయుడినీ మేల్కొల్పడమే లక్షమని చెప్పారు.

విద్యార్థుల భవితను తీర్చిదిద్దే సంస్థల్లో వ్యవస్థాగత సమస్యలను సరిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదన్నారు. అంతేకాకుండా నీట్ వంటి కీలక పరీక్షల నిర్వహణలో పారదర్శకత అవసరమని, అదే సమయంలో ప్రధానమంత్రి సహా ప్రతి ఒక్కరిలోనూ జవాబుదారీతనం ఉండాలన్నారు. విద్యావ్యవస్థను ప్రక్షాళన చేసి పటిష్ఠం చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలపై ప్రశ్నించే ప్రజల గొంతులను అణచివేయకుండా చూడాలన్నారు. దేశంలోని పౌరులు నిర్భయంగా తమ అభిప్రాయాలను బహిరంగంగా చెప్పే పరిస్థితి ఉండేలా పాలకులు చొరవ చూపాలని కోరారు. నీట్ పేపర్ లీకేజీ వివాదం తర్వాత ఆత్మహత్య చేసుకున్న ఆకాంక్ష చతుర్వేది ఉదంతాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. ఆకాంక్ష చదువు కోసం ఆమె తండ్రి రూ.3 లక్షలు అప్పుగా తీసుకున్నారని, తాను డాక్టర్ అయ్యాక అప్పులతో పాటు కుటుంబ సమస్యలన్నింటినీ తీరుస్తానని ఆమె తన తండ్రికి భరోసా ఇచ్చిందని, కానీ పేపర్ లీక్ వార్తలతో ఆవేదన చెంది, భవితపై భయంతో ఆత్మహత్య చేసుకుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి మరే కుటుంబానికి రాకూడదనుకుంటే అందరూ తప్పులను ప్రశ్నించాలన్నారు.

కాగా పర్యావరణ సమస్యలపై గళం విప్పుతున్న హైదరాబాద్ ప్రజలను చూసి గర్వపడుతున్నానని సోనమ్ వాంగ్‌చుక్ వ్యాఖ్యానించారు. సీజేపీ అధికార ప్రతినిధి విజేత దహియా మాట్లాడుతూ అభివృద్ధి అనేది ప్రజలను ఇళ్ల నుంచి ఖాళీ చేయించడం, లేదంటే మరో చోటకు పంపించడం ద్వారా జరగకూడదని చెప్పారు. ప్రతి వ్యక్తి గౌరవంగా జీవించే హక్కును రాజ్యాంగం కల్పిస్తుందని గుర్తు చేశారు. మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడుతూ... విద్యారంగంలో పటిష్టమైన పునాదులు అవసరమని చెప్పారు. నీట్ పేపర్ లీక్ వివాదానికి నైతిక బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

ప్రశ్నిస్తే అర్బన్ నక్సలైట్, దేశద్రోహి, పాకిస్థాన్ వాది అంటూ ముద్రలు వేస్తున్నారని ఆరోపించిన ఆయన పాలకులు వాస్తవిక దృక్పథంతో సమస్యలను అర్థం చేసుకోవాలన్నారు. తెలంగాణ విద్యా కమిషన్ మాజీ చైర్మన్ ఆకునూరి మురళి మాట్లాడుతూ.. విద్యార్థులను సైతం మోసం చేసేలా దుర్మార్గపు పరిపాలన సాగుతుందని మండిపడ్డారు. సక్రమంగా పరీక్షలను నిర్వహించలేని సన్నాసులు ఈ దేశాన్ని పాలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసన ప్రదర్శనలో భాగంగా పౌరులు నిర్భయంగా తమ అభిప్రాయాలను చెప్పాలన్న సోనమ్ వాంగ్‌చుక్ పిలుపు మేరకు విద్యార్థి సంఘాల ప్రతినిధులు, పలువురు యువతీ యువకులు దేశంలో కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితులను విశ్లేషిస్తూ మాట్లాడారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mana Telangana Telugu