Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
యూఎస్ ఓపెన్ చాంప్ రిబకినా

యూఎస్ ఓపెన్ చాంప్ రిబకినా

న్యూయార్క్: ప్రతిష్ఠాత్మక యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ విభాగంలో కజకిస్థాన్‌కు చెందిన రెండో సీడ్ ఎలినా రిబకినా విజేతగా నిలిచింది.

ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో రిబకినా డిఫెండింగ్ ఛాంపియన్, టాప్ సీడ్ అరినా సబలెంక (బెలారస్)ను ఓడించి ట్రోఫీని దక్కించుకుంది. కెరీర్‌లో మూడో యూఎస్ ఓపెన్ టైటిల్ సాధించాలని భావించిన సబలెంకకు షాక్ తగిలింది. ఆసక్తికరంగా జరిగిన తుది సమరంలో రిబకినా 64, 57, 62 తేడాతో సబలెంకను ఓడించింది. ఆరంభం నుంచే ఇద్దరు నువ్వానేనా అన్నట్టు తలపడ్డారు.

తొలి సెట్‌లో ఇటు సబలెంక, అటు రిబకినా ప్రతి పాయింట్ కోసం సర్వం ఒడ్డారు. దీంతో సెట్‌లో ఉత్కంఠత తప్పలేదు. కానీ కీలక సమయంలో సబలెంక ఒత్తిడికి గురైంది. ఈ క్రమంలో వరుస తప్పిదాలకు పాల్పడింది. దీన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో సఫలమైన రిబకినా మ్యాచ్‌పై పట్టు సాధించింది. చివరి వరకు ఆధిక్యాన్ని నిలబెట్టుకుని సెట్‌ను దక్కించుకుంది. రెండో సెట్‌లో కూడా పోరు నువ్వానేనా అన్నట్టుగానే సాగింది. ఇద్దరు ప్రతి పాయింట్ కోసం హోరాహోరీగా తలపడ్డారు. దీంతో సెట్ టైబ్రేకర్ వరకు వెళ్లక తప్పలేదు. ఇందులో నిలకడైన ఆటను కనబరిచిన సబలెంక సెట్‌ను దక్కించుకుంది.

ఇక ఫలితాన్ని తేల్చే మూడో, చివరి సెట్‌లో మాత్రం రిబకినా ఆకాశమే హద్దుగా చెలరేగి పోయింది. ఆరంభం నుంచే దూకుడుగా ఆడుతూ ముందుకు సాగింది. సబలెంకకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా అలవోకగా సెట్‌ను గెలిచి టైటిల్‌ను సొంతం చేసుకుంది. కాగా, రిబకినా కెరీర్‌లో ఇది మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్ కావడం విశేషం. ఈ ఏడాది ఆస్ట్రేలియా ఓపెన్‌లో కూడా రిబకినా విజేతగా నిలిచింది. అంతేగాక 2022లో వింబుల్డన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్‌ను కూడా సాధించింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mana Telangana Telugu