ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలా మంది గుండెపోటు బారిన పడుతున్నారు. దాంతో మన గుండె ఎంత పదిలంగా ఉందో తెలుసుకోవడానికి రకరకాల మెడికల్ టెస్టులు చేయించుకుంటున్నారు.
అలాంటి వాటిలో ఈ మధ్య కాలంలో బాగా వినబడుతున్న పేరు ‘హెచ్ఎస్సీఆర్పీ’ (hs-CRP) పరీక్ష. ఈ టెస్ట్ ద్వారా గుండెపోటు వచ్చే ముప్పును ముందే అంచనా వేయవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఇంతకీ ఈ టెస్ట్ కథేంటో ఓసారి చూద్దాం..
అసలు హెచ్ఎస్సీఆర్పీ అంటే ఏమిటి?: మన శరీరంలో ఎక్కడైనా ఇన్ఫెక్షన్ సోకినా లేదా వాపు (Inflammation) వచ్చినా కాలేయం (Liver) ఒక ప్రత్యేకమైన ప్రొటీన్‌ను విడుదల చేస్తుంది. దాన్నే ‘సి-రియాక్టివ్ ప్రొటీన్’ అంటారు. శరీరంలో ఈ వాపు ఎంత తక్కువ స్థాయిలో ఉన్నా కూడా దాన్ని అత్యంత సున్నితంగా కనిపెట్టే బ్లడ్ టెస్టే ఈ ‘హెచ్ఎస్సీఆర్పీ’.
గుండెపోటు ముప్పును ఎలా చూపిస్తుంది?: రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయి వాపు వచ్చినప్పుడు కూడా ఈ హెచ్ఎస్సీఆర్పీ లెవెల్స్ పెరుగుతాయి. అందుకే అప్పటికే ఒకసారి గుండెపోటు వచ్చిన వారికి లేదా గుండె జబ్బులు వచ్చే రిస్క్ ఎక్కువగా ఉన్నవారికి ఈ టెస్ట్ రిపోర్టులో వాల్యూస్ ఎక్కువగా వస్తే.. వారికి మరోసారి హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం పొంచి ఉందని డాక్టర్లు అలర్ట్ చేస్తారు.
Can This Test Predict Heart Attack Risk in Advance?40 ఏళ్ల లోపు వారు భయపడక్కర్లేదు: ఈ టెస్ట్ రిపోర్టులో రీడింగ్ ఎక్కువగా రాగానే అందరూ కంగారుపడిపోతుంటారు. కానీ ఇది అందరికీ ఒకేలా వర్తించదు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేని 40 ఏళ్ల లోపు యువతకు ఈ రీడింగ్ పెరిగినా పెద్దగా భయపడాల్సిన పనిలేదు. ఎందుకంటే శరీరంలో చిన్న చిన్న ఇన్ఫెక్షన్లు, జ్వరం లేదా సాధారణ నొప్పుల వల్ల కూడా ఈ లెవెల్స్ తాత్కాలికంగా పెరగొచ్చు.
హెచ్ఎస్సీఆర్పీ అనేది గుండె ఆరోగ్యాన్ని అంచనా వేయడానికి ఒక మంచి ఇండికేటర్ మాత్రమే. అంతేకానీ రిపోర్ట్ కొంచెం అటుఇటు రాగానే గుండెపోటు వచ్చేస్తుందని టెన్షన్ పడకూడదు. సరైన జీవనశైలి, మంచి ఆహారపు అలవాట్లతో గుండెను ఎప్పుడూ పదిలంగా ఉంచుకోవచ్చు.
గమనిక: ఈ టెస్ట్ చేయించుకున్న తర్వాత రిపోర్టులో తేడాలు ఉంటే సొంత నిర్ణయాలు తీసుకోకుండా, తప్పనిసరిగా కార్డియాలజిస్ట్ (గుండె వైద్య నిపుణులు)ను కలిసి సలహా తీసుకోవడం ఉత్తమం.

