తెలంగాణ రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ విద్యామండలి (TSBIE) 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి కీలక ప్రకటన విడుదల చేసింది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇటీవల ప్రకటించిన అడ్మిషన్ల షెడ్యూల్‌ను బోర్డు తాత్కాలికంగా రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
మే 4వ తేదీన విడుదల చేసిన సర్క్యులర్‌ను తక్షణమే రద్దు చేస్తున్నట్లు బోర్డు కార్యదర్శి ప్రకటించారు. రాష్ట్ర విద్యాశాఖ, ఇంటర్ బోర్డు ఈ ఏడాది విద్యా వ్యవస్థలో కొన్ని కీలకమైన సంస్కరణలు ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. విద్యార్థులకు మరింత మెరుగైన విద్యా విధానాన్ని అందించడంతో పాటు, అడ్మిషన్ల ప్రక్రియను మరింత పారదర్శకంగా మార్చేందుకు ఈ సంస్కరణలు దోహదపడతాయని అధికారులు భావిస్తున్నారు.
ఈ మార్పుల కారణంగానే పాత షెడ్యూల్‌ను నిలిపివేసి, కొత్త మార్గదర్శకాలను రూపొందిస్తున్నట్లు సమాచారం. అన్ని రకాల ప్రభుత్వ, ప్రైవేట్ ఎయిడెడ్, అన్-ఎయిడెడ్, గురుకుల, మోడల్ జూనియర్ కళాశాలలు ఈ ఆదేశాలను ఖచ్చితంగా పాటించాలని బోర్డు స్పష్టం చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఎటువంటి అడ్మిషన్లు నిర్వహించకూడదు.
ఇప్పటికే విడుదల చేసిన షెడ్యూలు ప్రకారం ఈ ఏడాది ప్రవేశాల ప్రక్రియను ఈ నెల 8వ తేదీ నుంచే ప్రారంభించాలని ఇంటర్ బోర్డ్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. పదవ తరగతి ఫలితాలు ఇప్పటికే విడుదలైన నేపథ్యంలో, విద్యార్థులు తమకు నచ్చిన గ్రూపుల్లో చేరేందుకు వీలుగా మే 31వ తేదీ వరకు మొదటి విడత దరఖాస్తులను స్వీకరించాలని షెడ్యులు ఇచ్చింది.
విద్యా క్యాలెండర్ ప్రకారం.. జూన్ 1వ తేదీ నుంచే ఇంటర్ ఫస్ట్ ఇయర్ క్లాసులు ప్రారంభం కానున్నాయి. ప్రవేశాల సమయంలో అదనపు ఫీజులు వసూలు చేయవద్దని, ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని ప్రిన్సిపాళ్లకు హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలను పెంచేలా చర్యలు తీసుకోవాలని బోర్డు కార్యదర్శి సూచించారు. అడ్మిషన్ల ప్రక్రియకు సంబంధించి సందేహాలు ఉంటే విద్యార్థులు లేదా తల్లిదండ్రులు సంబంధిత జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులను సంప్రదించవచ్చు

