దేశ వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీల్లో.. అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హత సాధించాలన్నా, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (JRF) అందుకోవాలన్నా 'యూజీసీ నెట్'అత్యంత కీలకమైన పరీక్ష.
అయితే.. జూన్ 2026 సెషన్ పరీక్షకు సంబంధించి ఇంకా అప్లై చేసుకోని అభ్యర్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) గుడ్ న్యూస్ చెప్పింది. వివిధ కారణాల వల్ల ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోయిన అభ్యర్థుల సౌకర్యార్థం ఆన్‌లైన్ అప్లికేషన్ గడువును పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది.
మారిన తేదీల వివరాలు:
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం..యూజీసీ నెట్ జూన్ పరీక్షకు ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి మే 23 వరకు సమయం ఇచ్చారు. అభ్యర్థులు మే 23వ తేదీ ఉదయం 10 గంటల లోపు తమ అప్లికేషన్లను ఆన్‌లైన్‌లో సమర్పించాల్సి ఉంటుంది. అప్లికేషన్లతో పాటు పరీక్ష ఫీజును కూడా అదే రోజు రాత్రి 11:50 గంటలలోపు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ లేదా యూపీఐ (UPI) ద్వారా చెల్లించే అవకాశం కల్పించారు.
అప్లికేషన్ కరెక్షన్ విండో ఎప్పుడంటే?
ఒకవేళ అభ్యర్థులు అప్లికేషన్ ఫారమ్ పూర్తి చేసేటప్పుడు ఏవైనా పొరపాట్లు చేస్తే, వాటిని సరిదిద్దుకోవడానికి ఎన్‌టీఏ ఎడిట్ ఆప్షన్‌ను కూడా అందుబాటులోకి తెస్తోంది. ఇందుకోసం మే 25 నుంచి మే 27 రాత్రి 11:50 గంటల వరకు 'అప్లికేషన్ కరెక్షన్ విండో' ఓపెన్ అయి ఉంటుంది. ఈ మూడు రోజుల్లో అభ్యర్థులు తమ అప్లికేషన్ లోని తప్పులను సవరించుకోవచ్చు. అయితే.. కొన్ని ముఖ్యమైన వివరాలను మార్చడానికి వీలుండదు కాబట్టి.. ఎడిట్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి.
కేటగిరీల వారీగా పరీక్ష ఫీజు వివరాలు:
యూజీసీ నెట్ జూన్ పరీక్షకు అప్లై చేసుకునే అభ్యర్థులు తమ కేటగిరీని బట్టి నిర్ణీత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. జనరల్ లేదా అన్‌రిజర్వ్‌డ్ (General/UR) కేటగిరీ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు రూ. 1,150 గా నిర్ణయించారు. అలాగే జనరల్-EWS, OBC-NCL కేటగిరీల వారికి ఫీజు రూ. 600గా ఉంది. ఇక ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, థర్డ్ జెండర్ అభ్యర్థులు రూ. 325 చెల్లించి అప్లికేషన్ ప్రక్రియను పూర్తి చేయవచ్చు.
అప్లై చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
నెట్ పరీక్షకు అప్లై చేసే సమయంలో అభ్యర్థులు ముఖ్యంగా మీరు పీజీలో చేసిన సబ్జెక్టును, నెట్ పరీక్ష రాయబోయే సబ్జెక్టును సరిగ్గా సెలెక్ట్ చేసుకోవాలి. దీంతో పాటు ఫోటో, డిజిటల్ సంతకం, నోటిఫికేషన్‌లో పేర్కొన్న సైజు , ఫార్మాట్‌లోనే అప్‌లోడ్ చేయాలి. పరీక్ష కేంద్రాల ఎంపికలో మీకు దగ్గరగా ఉండే ప్రాంతాలకే మొదటి ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. అభ్యర్థులు వెంటనే అధికారిక వెబ్‌సైట్ ugcnet.nta.nic.in ను సందర్శించి తమ అప్లికేషన్ పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

