స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)రిటైర్డ్ బ్యాంక్ అధికారుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన 821 కాంకరెంట్ ఆడిటర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ఎస్బీఐ లేదా దాని అనుబంధ బ్యాంకుల్లో.. 60 ఏళ్లు నిండి గౌరవప్రదంగా పదవీ విరమణ (సూపర్‌యాన్యుయేషన్) పొందిన అధికారులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఆసక్తి గల అభ్యర్థులు జూన్ 11 లోపు అధికారిక వెబ్‌సైట్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్ పూర్తి వివరాలు:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI),తన సెంట్రల్ రిక్రూట్‌మెంట్ & ప్రమోషన్ డిపార్ట్‌మెంట్, ముంబై ద్వారా అడ్వర్టైజ్‌మెంట్ నంబర్ CRPD/RS/2026-27/08 కింద ఈ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. హైదరాబాద్‌లోని ఇంటర్నల్ ఆడిట్ డిపార్ట్‌మెంట్ (IAD) పరిధిలో పనిచేయడానికి ఈ నియామకాలు జరుగుతున్నాయి.
ఖాళీల వివరాలు, సర్కిళ్లు:
మొత్తం 821 ఖాళీలను దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ఎస్బీఐ సర్కిళ్లలో భర్తీ చేయనున్నారు. వీటిలో ముఖ్యంగా జైపూర్ (95), ముంబై మెట్రో (80), బెంగళూరు (64), మహారాష్ట్ర (61), తిరువనంతపురం (59), భువనేశ్వర్ (57), అమరావతి (21), హైదరాబాద్ (26) సర్కిళ్లు ఉన్నాయి.
అర్హతలు:
ఉద్యోగ అర్హత: ఎస్బీఐ లేదా దాని పూర్వ అనుబంధ బ్యాంకుల నుంచి MMGS-III, SMGS-IV, SMGS-V, లేదా TEGS-VI గ్రేడ్లలో రిటైర్ అయిన అధికారులు మాత్రమే అర్హులు.
వయోపరిమితి: 14-05-2026 నాటికి అభ్యర్థుల గరిష్ట వయస్సు 63 ఏళ్లు మించకూడదు.
అనుభవం: క్రెడిట్, ఆడిట్ లేదా ఫారెక్స్ విభాగాలలో పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. గత ఐదేళ్ల సర్వీసులో.. ఎలాంటి పెనాల్టీలు లేదా విచారణలు ఉండకూడదు.
కాంట్రాక్ట్ కాలపరిమితి & వేతనం:
ఈ నియామకం పూర్తిగా కాంట్రాక్ట్ ప్రతిపదికన ఉంటుంది. ప్రాథమికంగా ఏడాది నుంచి గరిష్టంగా 3 సంవత్సరాలు లేదా 65 ఏళ్ల వయస్సు వచ్చే వరకు కొనసాగుతుంది. రిటైర్డ్ గ్రేడ్‌ను బట్టి నెలకు నిర్ణీత జీతం అందిస్తారు.
MMGS-III: రూ. 45,000
SMGS-IV: రూ. 50,000
SMGS-V: రూ. 65,000
TEGS-VI: రూ. 80,000
క్లస్టర్ ఆడిట్ లేదా కరెన్సీ చెస్ట్ వెరిఫికేషన్ కోసం ప్రతి విజిట్‌కు అదనంగా రూ. 2,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం:
అభ్యర్థుల అప్లికేషన్లు వారి అర్హతలు, అనుభవం ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. అనంతరం 100 మార్కులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇంటర్వ్యూలో సాధించిన మార్కుల ఆధారంగానే తుది మెరిట్ జాబితాను రూపొందిస్తారు.
అప్లికేషన్ ప్రక్రియ:
అభ్యర్థులు ఎస్బీఐ అధికారిక వెబ్‌సైట్ ద్వారా కేవలం ఆన్‌లైన్ మోడ్‌లోనే అప్లికేషన్ చేసుకోవాలి. అప్లికేషన్ సమయంలో ఐడీ ప్రూఫ్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, PPO (పెన్షన్ పేమెంట్ ఆర్డర్) కాపీ, గత 10 ఏళ్ల సర్వీస్ వివరాల పీడీఎఫ్ ఫైళ్లను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు.

