తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు, యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ ఉద్యోగాలకు అర్హత సాధించడానికి రాసే 'తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష' (TG SET) 2026 నోటిఫికేషన్ వచ్చేసింది.
ఈసారి కూడా ఉస్మానియా యూనివర్సిటీనే ఈ ఎగ్జామ్స్ నిర్వహిస్తోంది. అక్టోబర్‌లో ఆన్‌లైన్ పద్ధతిలో ఈ పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 300 మార్కులకు ఉండే ఈ ఎగ్జామ్ గురించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
టీజీ సెట్ 2026 నోటిఫికేషన్.. పూర్తి వివరాలు:
అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ పోస్టులకు పోటీ పడాలంటే 'తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్' (TG SET) పాస్ కావడం తప్పనిసరి. ఈ నేపథ్యంలోనే.. 2026 సంవత్సరానికి సంబంధించిన టీజీ సెట్ షార్ట్ నోటిఫికేషన్‌ను ఉస్మానియా విశ్వవిద్యాలయం తాజాగా విడుదల చేసింది. ఉన్నత విద్యా రంగంలో.. స్థిరపడాలనుకునే వేలాది మంది నిరుద్యోగులకు ఇదొక సువర్ణావకాశం.
అక్టోబర్‌లో పరీక్షలు:
తాజా సమాచారం ప్రకారం.. ఈ ఏడాది తెలంగాణ సెట్ పరీక్షలను అక్టోబర్ నెలలో నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ ప్రధాన నగరాలు, పట్టణాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. అభ్యర్థులు తమకు అనుకూలమైన కేంద్రాన్ని ఎంచుకునే.. అవకాశం ఉంటుంది.
ఆన్‌లైన్ విధానంలోనే ఎగ్జామ్:
గత కొన్నేళ్లుగా మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా ఈ పరీక్షను పూర్తిగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT - Computer Based Test) విధానంలోనే.. నిర్వహిస్తున్నారు. ఓఎంఆర్ షీట్ కాకుండా ఆన్‌లైన్‌లోనే అభ్యర్థులు సమాధానాలను గుర్తించాల్సి ఉంటుంది.
పరీక్ష విధానం, మార్కుల వివరాలు:
టీజీ సెట్ పరీక్ష మొత్తం 300 మార్కులకు ఉంటుంది. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. అభ్యర్థులు ఈ రెండు పేపర్లను కలిపి మొత్తం 3 గంటల (180 నిమిషాలు) వ్యవధిలో.. పూర్తి చేయాల్సి ఉంటుంది. పరీక్షల మధ్య ఎలాంటి విరామం (బ్రేక్) ఉండదు.
పేపర్ 1: ఇది జనరల్ పేపర్. అందరు అభ్యర్థులకు ఇది ఒకే విధంగా ఉంటుంది. ఇందులో టీచింగ్ , రీసెర్చ్ ఆప్టిట్యూడ్‌కు సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు. మొత్తం 50 ప్రశ్నలు ఉంటాయి, ఒక్కో ప్రశ్నకు రెండు మార్కుల చొప్పున 100 మార్కులు కేటాయించారు. ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమే.
పేపర్ 2: ఇది అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్టుకు (పీజీ సబ్జెక్ట్) సంబంధించింది. ఇందులో మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. దీనికి 200 మార్కులు ఉంటాయి.
త్వరలోనే పూర్తి వివరాలు:
ప్రస్తుతానికి ఉస్మానియా యూనివర్సిటీ కేవలం షార్ట్ నోటిఫికేషన్‌ను మాత్రమే విడుదల చేసింది. ఆన్‌లైన్ అప్లికేషన్లు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి? దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఎప్పుడు? అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుంది?అర్హతలకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన సమగ్ర నోటిఫికేషన్‌ను త్వరలోనే అధికారికంగా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని అధికారులు తెలిపారు.

