Thursday, 16 Sep, 1.54 pm మైక్ TV

హోమ్
హుస్సేన్‌సాగర్‌లో గణేష్‌ నిమజ్జనాలకు సుప్రీంకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం విషయంలో కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. హుస్సేన్‌ సాగర్‌లో గణేష్‌ విగ్రహాల నిమజ్జనానికి అడ్డంకులు తొలిగాయి. హుస్సేన్‌సాగర్‌తో సహా అన్ని చెరువుల్లో వినాయక విగ్రహాలు నిమజ్జనం చేసుకోవడానికి సుప్రీంకోర్టు అనుమతించింది. పీవోపీ విగ్రహాలు నిమజ్జనం చేసుకోవచ్చని,ఈ ఏడాదికి మాత్రమే మినాహాయింపు ఇస్తున్నట్లు , ఇదే చివరి అవకాశం అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. ఈ మేరకు అఫిడవిట్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

హైదరాబాద్‌ నగరంలోని హుస్సేన్‌సాగర్‌లో గణేశ్‌ నిమజ్జనంపై ఆంక్షలు విధిస్తూ తెలంగాణ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను సవాల్‌చేస్తూ జీహెచ్‌ఎంసీ దాఖలు చేసిన పిటిషన్‌పై అత్యున్నత న్యాయస్థానం గురువారం విచారణ చేపట్టింది. జీహెచ్‌ఎంసీ తరఫున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ఉత్సవాలు జరుగుతున్న సమయంలో హైకోర్టు ఆర్డర్ వచ్చిందని , ఇది పర్యావరణంతో పాటు భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్నందున ముందస్తు ప్రచారం, ప్రణాళికలు లేకుండా అకస్మాత్తుగా ఉత్తర్వులను అమలు చేయడంతో అనేక ఇబ్బందులు వస్తాయని పేర్కొన్నారు. వచ్చే ఏడాది ఈ ఆర్డర్‌ను అమలు చేస్తామని తుషార్ మెహతా తెలిపారు. ఇప్పటికే హుస్సేన్ సాగర్ చుట్టూ క్రేన్‌లు ఏర్పాటు చేశామని కాలుష్యం జరగకుండా వెంట వెంటనే విగ్రహాలను తరలిస్తామని సోలిసిటర్ జనరల్ వివరించారు.

హుస్సేన్ సాగర్‌ను పరిశుభ్రపరిచేందుకు, సుందరీకరణకు ప్రతి ఏడాది ప్రభుత్వం ఎన్నో నిధులను వెచ్చిస్తోంది. ప్రతి సంవత్సరం విగ్రహాలను నిమజ్జనం చేయడం ద్వారా నిధులు వృథా అవ్వడం లేదా అని ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు. 22 చిన్న పాండ్స్ ఏర్పాటు చేశామని, కానీ అందులో పెద్ద పెద్ద విగ్రహాలు నిమజ్జనం సాధ్యం కాదని సోలిసిటర్ జనరల్ తెలిపారు.

దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు.. హుస్సేన్‌సాగర్‌లో గణేష్ విగ్రహాలు నిమజ్జనం చేసుకోవచ్చని ఆదేశాలిచ్చింది. అయితే ఈ ఆదేశాలు ఒక్క ఏడాదికి మాత్రమేనని, వచ్చే ఏడాది నుంచి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు నిమజ్జనం చేయడానికి వీల్లేదని పేర్కొంది. పర్యావరణానికి హాని కలిగించే విగ్రహాల నిమజ్జనంతో హుస్సేన్‌సాగర్ కాలుష్యకారకంగా మారిపోయిందని, జల వనరులను కాపాడే బాధ్యత ప్రభుత్వంపై ఉందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ విషయంలో ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని,ప్రభుత్వతీరు సరిగ్గా లేదని ఆక్షేపించారు.సుప్రీం కోర్టు తీర్పపై భాగ్యనగర ఉత్సవ సమితి సైతం హర్షం వ్యక్తం చేసింది.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: MIC TV
Top