Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
2024 లో షర్మిల 2029 లో సాయి రెడ్డా.?

2024 లో షర్మిల 2029 లో సాయి రెడ్డా.?

వైసీపీ పార్టీ ఏర్పాటు నుంచి ఆ పార్టీ కి ఒకరు తన రాజకీయ చాణక్యంతో రాజకీయ బలంగా నిలిస్తే మరొకరు తన పాదయాత్రలతో మానసిక స్తైర్యంగా నిలబడ్డారు. అలా నాడు వైసీపీ కి రెండు బలమైన పునాదులుగా నిలబడిన వైఎస్ షర్మిల, విజయసాయి రెడ్డి ఇప్పుడు వైసీపీ పతనం కోసం పోరాటడుతున్నారు.

ముందుగా షర్మిల విషయానికొస్తే, వైసీపీ ప్రారంభం నుంచి ఆ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి అన్న జగన్ ను ముఖ్యమంత్రి పీఠం ఎక్కించేందుకు షర్మిల తలకు మించి రాజకీయ భారాన్నే మోశారు. జగన్ 16 నెలల పాటు జైల్లో ఉన్నప్పటికీ పార్టీ క్యాడర్ లో మానసిక స్తైర్యం నింపేందుకు పాదయాత్ర తో పార్టీ బాధ్యతలను తన భుజాన మోశారు.

ఇక 2019 ఎన్నికల ప్రచారంలో షర్మిల ఎన్నికల క్యాంపైన్ వైసీపీ కి ప్రాణం పోసింది. జగన్ పాదయాత్ర వైసీపీ కి ఒక రకమైన రాజకీయ బలాన్ని తెచ్చిపెడితే, షర్మిల ఎన్నికల ప్రచారం వైసీపీ గెలుపులో మరోకీలక పాత్ర పోషించదనే చెప్పాలి. ఇలా నాడు వైసీపీ అధికారం కోసం జగన్ సీఎం పదవి కోసం షర్మిల పడ్డ కష్టం మూన్నాళ్ళ ముచ్చటగానే మిగిలిపోయింది.

2019 లో వైసీపీ అధికారంలోకి వచ్చిన మరుక్షణమే షర్మిల వైసీపీ కి దూరంగా జగన్ కు ప్రత్యర్థిగా మారిపోయారు. పార్టీ ని అధికారంలోకి తెచ్చేందుకు సోషల్ మీడియాలో అనేక వ్యక్తిగత ఆరోపణలను, నిందలను సైతం మోసిన షర్మిల చివరికి జగన్ నుంచే వ్యతిరేకత ఎదుర్కొంది, వైసీపీ నుంచే విమర్శలు మోసింది.

వివేకా దారుణ హత్య, అందుకు వైఎస్ అవినాష్ పై ఆరోపణలు, తల్లి విజయలక్ష్మి ని పార్టీ గౌరవ అధ్యక్ష పదవి నుంచి తప్పించడం, షర్మిలను పార్టీ కార్యక్రమాలకు దూరంగా పెట్టడం…ఇలా అనేకరకమైన అవమానాలతో షర్మిల ఏపీని వదిలి నేను ఈడపిల్లను కాదు ఆడ పిల్లను అంటూ తెలంగాణ రాజకీయాలకు వెళ్లాల్సి వచ్చింది.

కానీ కట్ చేస్తే జగన్ చెప్పినట్టుగా దేవుని స్క్రిప్ట్ లో భాగంగా షర్మిల తిరిగి 2029 ఎన్నికల ముందు ఏపీ రాజకీయాలలోకి రీ ఎంట్రీ ఇచ్చారు. షర్మిల రీ ఎంట్రీ తోనే వైసీపీ పతనం ఒక్కో మొట్టు దిగుతూ వచ్చింది. వైసీపీ ఘోర ఓటమిలో జనసేన, టీడీపీ పొత్తు ఒక కీలక పాత్ర పోషిస్తే షర్మిల రీ ఎంట్రీ ఆ పై ఏపీలో జరిగిన రాజకీయ పరిణామాలు మరో కీలక పాత్ర పోషించి చివరికి 151 తో అధికారంలో ఉన్న వైసీపీ 11 తో ప్రతిపక్షం కూడా లేని పార్టీగా మిగిలింది.

సరిగ్గా ఇప్పుడు కూడా జగన్ 2.0 కోసం కలలు కంటున్న వైసీపీ కి నాడు షర్మిల మాదిరి నేడు విజయసాయి రెడ్డి పొలిటికల్ రీ ఎంట్రీ జరుగుతుంది. నాడు షర్మిలను కూడా లైట్ తీసుకున్న వైసీపీ చివరికి భారీ ర్రాజకీయ మూల్యమే చెల్లించాల్సి వచ్చింది. ఇక ఇప్పుడు విజయసాయి ని కూడా వైసీపీ చాల తక్కువ అంచనా వేసిందంటే మరోసారి వైసీపీ రాజకీయ ఎదురుదెబ్బకు సిద్దమవ్వాల్సిందే అంటున్నారు పొలిటికల్ ఎనలిస్టులు.

వైసీపీ కి షర్మిల మానసిక ధైర్యాన్ని అందిస్తే సాయిరెడ్డి రాజకీయ బలాన్ని పెంచారు. ఢిల్లీ కేంద్రంగా వైసీపీ కి అనుకూలంగా సాయిరెడ్డి తన రాజకీయ చాణిక్యంతో నడిపిన రాజకీయం జగన్ కు కొండంత అండగా నిలిచిందనే చెప్పాలి. జగన్ కేసులు బైలు నుంచి జైలు వరకు వెళ్లకుండా ఉండేందుకు సాయిరెడ్డి తెరచాటు రాజకీయం కూడా ఒక కారణం అనేది ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో వినిపించే ఒక ప్రచారం.

2019 వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో వైసీపీ సాగించిన ఏకచక్రాధిపత్యం వెనుక కూడా ఢిల్లీ పెద్దల ఆశీస్సులు ఉండేలా సాయిరెడ్డి చక్రం తిప్పారు అనేది జగమెరిగిన సత్యమే. అటువంటి సాయిరెడ్డి 2024 వైసీపీ ఓటమి తరువాత తనకు వైసీపీ లో జరిగిన అవమానాలను, కోటరీ అవహేళనలను భయటపెడుతూ వైసీపీ కి గుడ్ బై చెప్పారు, జగన్ కు దూరమయ్యారు.

అయితే ఇప్పుడా దూరం వైసీపీ పాలిట శాపంలా మారే ప్రమాదం కనిపిస్తుంది. 2019 నుంచి 2024 వరకు రాష్ట్రంలో వైసీపీ చేసిన రాజకీయ పాలన నుంచి వైసీపీ లో అంతర్గతంగా జరిగిన రాజకీయ చర్యల వరకు సాయిరెడ్డి అన్నింటిని బట్టబయలు చేస్తున్నారు.

గండికోట రహస్యాలు మాదిరి వైసీపీ అంతర్గత గుట్టు మొదలుకుని జగన్ ఆంతరంగిక లోగుట్టు వరకు అన్నింటిని సాయిరెడ్డి తన రాజకీయ అస్త్రాలుగా మార్చుకుంటున్నారు. అందులో భాగంగానే మొన్న తాడేపల్లి ప్యాలస్ గేటు లోపల జరిగే కోటరీ ఆధిపత్యాన్ని బయటపెట్టిన సాయిరెడ్డి, నిన్న జగన్ మత మార్పిడిల ప్రోత్సహకాలను వెలుగులోకి తెచ్చారు.

ఇక తాజగా నేడు సజ్జల గారి అరాచకాలు అంటూ ఏకంగా ఒక బహిరంగ లేఖనే విడుదల చేసారు. ఇలా సాయిరెడ్డి బయటపెడుతున్న ఒక్కో అంశం వైసీపీ పాలిట రాజకీయ శాపంగా మారబోతుంది. నాడు వైసీపీ మరో ఛాన్స్ కి షర్మిల కన్నీటి ఉసురు అడ్డుకట్ట వేస్తె నేడు సాయిరెడ్డి ఆవేదన జగన్ 2.0 ఆశలకు గండి కొట్టనుందా.? అనేది రానున్న రోజులలో తేలనుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mirchi9 Telugu