Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఇది సమంత కథ కాదు. సమాజ స్వభావం!

ఇది సమంత కథ కాదు. సమాజ స్వభావం!

క మనిషి జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు లోకం చాలా నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తుంటుంది. ఏ రంగంలోనైనా, మరీ ముఖ్యంగా సినీ రంగంలో జయాపజయాలే వ్యక్తి విలువను నిర్ణయిస్తుంటాయి.

ఇందుకు సమంత జీవితం ఓ చక్కటి ఉదాహరణ.

ఆమె వ్యక్తిగత జీవితంలో విడాకులు, ఆరోగ్యపరంగా మయోసైటిస్‌తో పోరాటం… ఈ పరిణామాల వల్ల కెరీర్‌లో వరుస ఎదురుదెబ్బలు ఎదుర్కొంటూ, ఒకే సమయంలో అనేక సమస్యలు, సవాళ్ళను ఒంటరిగా ఎదుర్కొంటున్నప్పుడు సమంత పని అయిపోయిందని చాలామంది తేల్చేశారు. ఆ సమయంలో ఆమెను చాలా మంది అవహేళన చేశారు. విమర్శించారు.

కానీ ఒక్క విజయం చాలు… అన్ని లెక్కలు మార్చేయడానికి. సమంత ప్రధాన పాత్రలో నటించి, నిర్మించిన 'మా ఇంటి బంగారం' సూపర్ హిట్ అవడం, మూడు వారాల్లోనే రూ.80 కోట్లకు పైగా వసూళ్ళు సాధించడం, ఇదే సమయంలో ఆమె గర్భవతి అని తెలియడం, ఆమెకు అండగా భర్త రాజ్ నిడిమొరు కనిపించడంతో ఆమె గురించి ఇంతకాలం వ్యక్తమైన అభిప్రాయాలన్నీ ఒక్కసారిగా మారిపోయాయి.

ఒకప్పుడు ఆమెను విమర్శించినవారే ఇప్పుడు ఆమె ధైర్యాన్ని, పట్టుదలను కొనియాడుతున్నారు. ఆమె మాజీ మరిది అఖిల్ కూడా ఆమెను అభినందించారు. విజయానికి ముందు, విజయానికి తర్వాత ఒకే వ్యక్తి గురించి సమాజం ఎంత భిన్నంగా స్పందిస్తుందో ఈ పరిణామాలే చెపుతున్నాయి.

సమాజం తీరు ఇలాగే ఉంటుంది. ఓటమి, కష్టాల్లో ఉన్నప్పుడు మనిషిని బలహీనుడిగా చూస్తుంది. ఇంకా బలహీనపరుస్తుంది. కానీ ఒక్కసారి విజయం సాధించిన తర్వాత అదే వ్యక్తిని పొగుడుతుంది. ఆకాశానికి ఎత్తేస్తుంది. సమంత పట్ల మారిన లోకం తీరే ఇందుకు నిదర్శనం.

ఒకవేళ 'మా ఇంటి బంగారం' ఫ్లాప్ అయ్యుంటే? పక్కన భర్త లేకపోయుంటే? అని ఆలోచిస్తే లోకం తీరు మరింత బాగా అర్థమవుతుంది. ఆమెను అర్థం చేసుకొని ప్రతి అడుగులో అండగా నిలబడే జీవిత భాగస్వామి లభించడం కూడా ఆమె అదృష్టమే.

జీవితంలో కష్టకాలం సాగుతున్నప్పుడు ఇతరుల తీర్పులను పట్టించుకోవడం కంటే, గెలిచే వరకు సమస్యలతో పోరాడుతూనే ఉండాలి. ఎందుకంటే ఏ పరిస్థితులు శాశ్వతం కావు. అపజయం కూడా శాశ్వతం కాదు.

నిన్న విమర్శించినవాళ్ళే ఈ రోజు చప్పట్లు కొడతారు. ఒకప్పుడు తక్కువ చేసి మాట్లాడినవాళ్ళే విజయం సాధించిన తర్వాత ప్రశంసలు కురిపిస్తారు. సమంత ప్రయాణం మరోసారి అదే నిరూపించింది. మనిషిని పరిస్థితులు కాదు… వాటిని ఎదుర్కొని తిరిగి నిలబడే ధైర్యమే గొప్పవాడిని చేస్తుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mirchi9 Telugu