Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రైతులకు నీళ్ళివ్వకపోతే మళ్ళీ ఓట్లేస్తారా?

రైతులకు నీళ్ళివ్వకపోతే మళ్ళీ ఓట్లేస్తారా?

రైతులకు ఉపయోగపడాల్సిన సాగునీటి ప్రాజెక్టులు తెలంగాణలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల రాజకీయ యుద్ధాలకు వేదికలుగా మారడం చాలా బాధాకరం.

ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మాత్రమే కాదు రాష్ట్రంలో మిగిలిన సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కూడా అధికార కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ దురుదేశ్యంతో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

ఈరోజు తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌ ద్వారా దేవాదుల ప్రాజెక్టు గురించి వివరించారు. దీనికి కాళేశ్వరం ప్రాజెక్టులా ఎటువంటి సమస్యలు, అవరోధాలు లేవు. ఎదురుగా గోదావరి నది ఉంది. దానిలో రోజుకి లక్ష క్యూసెక్కుల నీళ్ళు పారుతున్నాయి.

మరోపక్క దేవాదుల మూడు పంప్ హౌసులలో 10మోటార్లు సిద్దంగా ఉన్నాయి. ఈ ప్రాజెక్టు కింద చెరువులు, రిజర్వాయర్లు దాదాపు ఖాళీగా ఉన్నాయి. కనుక బటన్ నొక్కితే చాలు రోజుకి 2,500 టీఎంసిలు ఎత్తిపోసుకోవచ్చు. కానీ పది మోటార్లు ఉంటే 5 మాత్రమే ఆన్‌ చేస్తూ అరకొరగా నీళ్ళు ఎత్తిపోస్తున్నారు. మిగిలిన నీళ్ళు వృధాగా సముద్రంలోకి వదిలేస్తున్నారు.

ఓ పక్క ఎల్‌నినో ప్రభావంతో భవిష్యత్తులో నీటి కొరత ఏర్పడుతుందని ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతుంటే ప్రతి నీటి చుక్కను నిల్వ చేయాల్సిన ఈ కాంగ్రెస్‌ ప్రభుత్వం వరదనీటిని వృథాగా సముద్రంలోకి వదిలేయడం పరిపాలనా వైఫల్యమే కాక నేరం కూడా.

ఓ పక్క రైతులు నీళ్ళు లేక అల్లాడుతుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వరద నీటిని ఎందుకు వృధాగా విదిచిపెడుతోంది?" అంటూ హరీష్‌ రావు సూటి ప్రశ్నలు సంధించారు.

హరీష్ రావు వాదనలో రాజకీయ కోణం ఉన్నప్పటికీ, ఆయన లేవనెత్తిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.

కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా, అదే దృక్పథాన్ని దేవాదుల వంటి ఇతర సాగునీటి ప్రాజెక్టులపైనా అనుసరిస్తే అది రైతులకు నష్టం కలిగించే ప్రమాదం ఉంది.

నీటి నిర్వహణ విషయంలో కూడా రాజకీయ కోణంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటే, దాని వలన రైతులు నష్టపోతారు. అప్పుడు వారు హరీష్‌ రావు వాదనలు సహేతుకమని భావిస్తే, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఓట్లు వేస్తారు.

ఈ విషయం సిఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తెలియకనే చేస్తున్నారా? అనే సందేహం కలుగుతుంది. ఏదిఏమైనప్పటికీ రాజకీయాలకు అతీతంగా సాగు, త్రాగు నీరు అందించడం చాలా అవసరం.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mirchi9 Telugu