Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వెలిగొండ ప్రారంభోత్సవం ఈ నెలే.. క్రెడిట్ బ్యాచ్ రెడీయేనా?

వెలిగొండ ప్రారంభోత్సవం ఈ నెలే.. క్రెడిట్ బ్యాచ్ రెడీయేనా?

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మరో భారీ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సిద్దమవుతోంది. పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ఈ నెలాఖరున సిఎం చంద్రబాబు నాయుడు ప్రారంభోత్సవం చేయనున్నారు.

నల్లమల కొండల గుండా 18.8 కిలోమీటర్ల మేర నిర్మించిన జంట సొరంగ మార్గాల ద్వారా కృష్ణా జలాలను నల్లమల్ల సాగర్ జలాశయానికి తరలిస్తారు.

దీంతో ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలలో 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, 15 లక్షల మందికి ఫ్లోరైడ్ రహిత తాగునీరు అందుబాటులోకి వస్తుంది.

జగన్‌ ప్రభుత్వం సగం సగం పనులు చేసి ఈ ప్రాజెక్టుని జాతికి అంకితం చేసేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.3,000 కోట్లు ఖర్చు చేసి కాలువలు, వాటి లైనింగ్ పనులతో అన్నీ పూర్తి చేయాల్సి రావడమే ఇందుకు నిదర్శనం.

అంతే కాదు.. సుమారు 1900 టన్నుల బరువు, 175 మీటర్లు పొడవు కలిగిన టన్నల్ బోరింగ్ మెషిన్ని కూడా గత ప్రభుత్వం సొరంగంలోనే వదిలేసింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దానిని ముక్కలుముక్కలుగా కట్ చేయించి బయటకు తీయిస్తోంది. ఇప్పటికే 70 శాతం తొలగించారు. మిగిలినది కూడా ఈ నెలాఖరులోగా తొలగించి, సొరంగంలో ఎటువంటి ఆటంకం లేకుండా నీళ్ళు పారేలా చేస్తారు.

సొరంగం, కాలువలు, హెడ్ రెగ్యులేటర్ పనులతో పాటు ప్రభుత్వం నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లింపులు కూడా చేస్తోంది. మొత్తం 4,761 కుటుంబాలకు రూ.600 కోట్లు నష్టపరిహారం చెల్లిస్తోంది. వెలిగొండ ప్రారంభోత్సవానికి ముందే మొదటి విడత నష్ట పరిహారం చెల్లించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్వయంగా ఈ పనుల పురోగతిని పర్యవేక్షిస్తున్నారు. కనుక రేయింబవళ్ళు పనులు జోరుగా సాగుతున్నాయి.

ఆగస్ట్ నెలాఖరులోగా వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవం జరిగితే మూడు పరిణామాలు జరుగుతాయి.

1. నల్లమల్ల సాగర్ జలాశయానికి వెంటనే నీళ్ళు చేరుతాయి. మూడు ఉమ్మడి జిల్లాలకు తాగు, సాగు నీళ్ళు అందుబాటులోకి వస్తాయి.

2. వెలిగొండ ప్రాజెక్టు మా హయంలోనే పూర్తిచేసి జాతికి అంకితం ఇచ్చేశాము. చంద్రబాబు నాయుడు మళ్ళీ అంకితం చేసి క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారని వైసీపీ సన్నాయి నొక్కులు మొదలవుతాయి. అందుకు సాక్ష్యాధారాలుగా వైసీపీ సొంత మీడియాలో పుంఖానుపంకాలుగా కధనాలు, జగన్‌ ఫోటోలు, వీడియోలు కనపడతాయి.

3. తెలంగాణలో బీఆర్ఎస్‌ పార్టీ మళ్ళీ రాష్ట్రానికి అన్యాయం జరిగిపోతోంది. చంద్రబాబు నాయుడు తెలంగాణ రైతులకు దక్కాల్సిన నీటిని ఎత్తుకుపోతుంటే తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి ఆయనకు సహకరిస్తున్నారంటూ పాట మొదలైపోతుంది.

ఎవరు ఎన్ని ఏడ్పులు ఏడ్చినా మీ ఏడ్పులే మాకు దీవెనలు అంటూ అన్ని అవరోధాలు అధిగమిస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు సాగిపోతూనే ఉండటం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం, ప్రజల అదృష్టమే కదా?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mirchi9 Telugu