Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
100.83 మి. యూనిట్లు!

100.83 మి. యూనిట్లు!

  • గ్రేటర్‌లో సెంచరీ దాటిన విద్యుత్‌ వినియోగం
  • గరిష్ఠ విద్యుత్‌ డిమాండ్‌ 4766 మెగావాట్లు
  • ఈ సీజన్‌లో ఇదే అత్యధిక రికార్డు: ఎస్‌పీడీసీఎల్‌
  • గరిష్ఠ డిమాండ్‌ 5వేలు దాటే అవకాశం

సిటీబ్యూరో, మే 22 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్‌లో విద్యుత్‌ వినియోగం సెంచరీ కొట్టింది. పగటిపూట పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో నగరంలో ఏసీల మోత మోగుతోంది. ఇరవైనాలుగుగంటలూ ఫ్యాన్లు తిరుగుతున్నాయి. గ్రేటర్‌లో ప్రతీరోజూ 41 నుంచి 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిమిషం కూడా కూలర్లు, ఫ్యాన్లు, ఏసీలు లేకుండా ప్రజలు ఉండలేకపోతున్నారు. భూగర్భజలాలు పడిపోతుండడంతో బోర్లలో నీరు పాతాళానికి చేరింది. దీంతో మోటార్లు నిరంతరం పనిచేస్తున్నాయి. వీటన్నింటితో కరెంటు వినియోగం గణనీయంగా పెరిగింది. గడిచిన ఐదేళ్లలో ఈ వినియోగం రెట్టింపయిందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గత మూడురోజులుగా విద్యుత్‌ వినియోగం వంద మిలియన్‌ యూనిట్ల మైలురాయి చేరింది.

ఈనెల 19న 100.53 మిలియన్‌ యూనిట్లు నమోదు కాగా 21న ఆ రికార్డును అధిగమించి 100.83 మిలియన్‌ యూనిట్లు నమోదై సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ క్రమంలో ఈ సీజన్‌లో గరిష్ట విద్యుత్‌ వినియోగం సుమారు 105-110 మిలియన్‌ యూనిట్లకు చేరే అవకాశం ఉందని గత సంవత్సరంతో పోలిస్తే సుమారుగా 20 నుంచి 30 మిలియన్‌ యూనిట్లు అధికంగా ఈ సంవత్సరం విద్యుత్‌ వినియోగం నమోదైనట్లు టీజీఎస్‌పీడీసీఎల్‌ అధికారులు తెలిపారు.

95 మిలియన్‌ యూనిట్లకు పైనే

వారం రోజులుగా ప్రతీరోజూ 95 మిలియన్‌ యూనిట్లకు పైనే విద్యుత్‌ డిమాండ్‌ నమోదవుతున్నది. మరోవైపు గురువారం గరిష్ఠ విద్యుత్‌ డిమాండ్‌ 4766 మెగావాట్లుగా నమోదైంది. ఈ సీజన్‌లో ఇదే అత్యధిక డిమాండ్‌గా అధికారులు తెలిపారు. గత వారం రోజులుగా ప్రతీరోజూ దాదాపు 4500 మెగాయూనిట్లకు మించి విద్యుత్‌ డిమాండ్‌ నమోదైంది. ఇటీవల మార్చిలో విద్యుత్‌ డిమాండ్‌ 4300 మెగావాట్లు దాటినా ఏప్రిల్‌లో 4వేల మెగావాట్ల వద్ద స్థిరపడింది. ఈనెల 19న 4748 మెగావాట్లు నమోదు కాగా..21న ఈ సీజన్‌లో ఇప్పటివరకు అత్యధికంగా 4766 మెగావాట్లు నమోదైంది. కొద్దిరోజుల్లోనే విద్యుత్‌ డిమాండ్‌ 5వేల మెగావాట్లను చేరడం ఖాయమని అధికారులు చెప్పారు.

గత సంవత్సరం ఇదే నెలలో ఇదే రోజులతో పోలిస్తే దాదాపుగా వెయ్యి మెగావాట్ల డిమాండ్‌ తక్కువగా ఉన్నట్లు వారు తెలిపారు. ఇదిలా ఉంటే క్షేత్రస్థాయిలో విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలపై సీఎండీ జితేశ్‌ వీ పాటిల్‌ ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తున్నా అధికారులు మాత్రం కొంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. గ్రేటర్‌ పరిధిలోని పది సర్కిళ్ల పరిధిలో విద్యుత్‌ వినియోగం పెరగడంతో ట్రాన్స్‌ఫార్మర్లు, ఫీడర్లపై భారం పడుతోంది. దీంతో చాలాచోట్ల ఫీడర్లు ట్రిప్‌ అవుతున్నాయని అధికారులు చెప్పారు. లోడ్‌ సర్దుబాటుకు సంబంధించి పలు రకాల చర్యలు తీసుకుంటున్నప్పటికీ అనుకూలమైన పరిస్థితులు, సామాగ్రి లేకపోవడంతో తామేం చేయలేకపోతున్నామని, దీంతో సైబర్‌సిటీ వంటి చోట్ల విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలు తప్పడం లేదంటూ ఓ సీనియర్‌ విద్యుత్‌ ఇంజనీర్‌ తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana