Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
2027 నాటికి బరాజ్‌లకు మరమ్మతులు.. పనులయ్యేదాకా పంపులు నడుపం

2027 నాటికి బరాజ్‌లకు మరమ్మతులు.. పనులయ్యేదాకా పంపులు నడుపం

  • మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడి
  • కాళేశ్వరంపై మళ్లీ అవే ఆరోపణలు
  • కేటీఆర్‌ కన్నెపల్లి పర్యటన నేపథ్యంలో ఇంజినీర్లతో కలిసి మంత్రి ప్రెస్‌మీట్‌

హైదరాబాద్‌, జూలై 5 (నమస్తే తెలంగాణ) : 'పాడిందే పాడరా' అన్నట్టుగా కాళేశ్వరం ప్రాజెక్టుపై సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎప్పటిలానే మరోసారి అర్థరహిత, అసంబద్ధ ఆరోపణలకు దిగారు.

బీఆర్‌ఎస్‌పై నెపం మోపేందుకు మళ్లీ పాతపాటే పాడారు. ఓవైపు ఎల్‌ నినో నేపథ్యంలో కరువు పరిస్థితులు నెలకొనగా మరోవైపు మేడిగడ్డ వద్ద దాదాపు లక్ష క్యూసెక్కుల ప్రవాహం దిగువకు పోతున్నది. ఈ నేపథ్యంలో కాళేశ్వరం పంపులను ఆన్‌చేసి రైతులకు సాగునీరివ్వాలని డిమాండ్‌ చేస్తూ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ కన్నెపల్లి పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. దీంతో ప్రజల దృష్టిని మరల్చేందుకు సాగునీటి పారుదల శాఖ మంత్రి హడావుడిగా శాఖ ఇంజినీర్లతో కలిసి సచివాలయంలో ఆదివారం ప్రత్యేకంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్‌ మొదటి నుంచీ చేస్తున్న ఆరోపణలనే మరోసారి వల్లెవేశారు. రెండున్నరేండ్లుగా బరాజ్‌ల పునరుద్ధరణ చేపట్టకుండా తాత్సారం చేసి ఇప్పుడు బీఆర్‌ఎస్‌పై నెపం మోపేందుకు ప్రయత్నించారు.

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లలో నీటిని ఎత్తిపోయవచ్చని బీఆర్‌ఎస్‌ చెప్పేది అవాస్తవమని, పునరుద్ధరణ పనులు పూర్తయ్యేవరకు పంపులు ఆన్‌ చేయబోమని మంత్రి వెల్లడించారు. బరాజ్‌లలో నీటిని నిల్వ చేయవద్దని ఎన్డీఎస్‌ఏ (జాతీయ డ్యామ్‌ భద్రతా అథారిటీ) నివేదిక చెప్పిందని పేరొన్నారు. లోపాలను సరిచేయకుండా నీటిని నిల్వ చేస్తే బరాజ్‌లు కూలిపోయి, దిగువ ప్రాంతాల్లో తీవ్ర ప్రమాదం సంభవించే అవకాశం ఉందంటూ అసంబద్ధ వాదనలకు దిగారు. ప్రస్తుత వానాకాలంలో డిజైన్లు ఖరా రు చేసి, వరదలు తగ్గాక పునరుద్ధరణ పనులు ప్రారంభించి జూలై-ఆగస్టు 2027 నాటికి పూర్తి చేస్తామని, అప్పటి వరకు 3 బరాజ్‌లను ఫ్రీ-ఫ్లో స్థితిలోనే కొనసాగిస్తామని స్పష్టంచేశారు. ప్రత్యామ్నాయంగా తమ్మిడిహట్టి నుంచి గ్రావిటీ ద్వారా 80 టీఎంసీలు వినియోగించుకొనేందుకు ప్రణాళికలు వేస్తున్నామని వివరించారు. ఎల్‌ నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం సాగు, తాగునీటి రంగాల్లో ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేస్తున్నదని తెలిపారు. సమావేశంలో నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఈ శ్రీధర్‌, టన్నెల్‌ నిపుణుడు కల్నల్‌ పరీక్షిత్‌ మెహ్రా, జాయింట్‌ సెక్రటరీ శ్రీనివాస్‌, ఈఎన్సీ (జనరల్‌) రమేశ్‌బాబు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana