Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
22A Land Data | పట్టా భూములూ బందీ.. ఏండ్ల నాటి పట్టా భూములు 22ఏలో లాక్‌

22A Land Data | పట్టా భూములూ బందీ.. ఏండ్ల నాటి పట్టా భూములు 22ఏలో లాక్‌

  • నిర్మల్‌లో 4.50 లక్షలు, ఆసిఫాబాద్‌ జిల్లాలో దాదాపు 2 లక్షల ఎకరాలకు పైగా 'నిషేధితం'
  • మంచిర్యాల, ఆదిలాబాద్‌ జిల్లాల్లో లెక్కలు తీయలేదని చెప్తున్న రెవెన్యూ అధికారులు
  • అవగాహన లేక ఫిర్యాదు చేయని ప్రజలు
  • ఇండ్లు, స్థలాలు 22ఏలో చేర్చడంపై ఆందోళన
  • సింగరేణి పట్టా ఇండ్లు కూడా జాబితాలోనే

మంచిర్యాల, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్రవ్యాప్తంగా సగం భూమిని నిషేధిత జాబితాలో చేర్చిన కాంగ్రెస్‌ సర్కార్‌ కుతంత్రాలు ఒక్కొక్కటిగా బట్టబయలవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసిన రిజిస్ట్రేషన్‌ అండ్‌ స్టాంప్స్‌ డిపార్ట్‌మెంట్‌ (సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల)కు అప్పగించిన నిషేధిత భూముల జాబితా 22 (ఏ) తప్పుల తడకగా ఉన్నదని ఆ శాఖ వర్గాలు వాపోతున్నాయి. అన్ని జిల్లాల్లో తహసీల్దార్లు, ఆర్డీవోలు, అడిషనల్‌ కలెక్టర్లు (రెవెన్యూ), కలెక్టర్లు ఇలా నలుగురు అధికారులు కలిసి తయారు చేసి, సంతకాలు చేసి, సర్కార్‌కు అప్పగించిన నిషేధిత జాబితాలో తప్పులు దొర్లడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిర్మల్‌ జిల్లాలో దాదాపు 4.50 లక్షల ఎకరాలు, ఆసిఫాబాద్‌ జిల్లాలో రెండు లక్షల ఎకరాలకు పైగా భూములను నిషేధిత జాబితాలో చేర్చగా.. మంచిర్యాల, ఆదిలాబాద్‌ జిల్లాల్లో ఎన్ని ఎకరాలు చేర్చారనే లెక్కలే తీయలేదంటూ అధికారులు దాటవేస్తున్నారు. కావాలంటే వెబ్‌సైట్‌లో వివరాలున్నాయి చూసుకోండని చేతులెత్తేస్తున్నారు.

అసైన్డ్‌.. పట్టా తేడా లేకుండా

రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అసైన్‌ చేసి, ఇండ్ల పట్టాలిచ్చిన భూములను కూడా నిషేధిత జాబితాలో చేర్చారు. 2003-2005 మధ్య మంచిర్యాల జిల్లా గర్మిళ్ల శివారు సర్వే నంబర్‌ 334 తిలక్‌నగర్‌, మంచిర్యాల శివారు సర్వే నంబర్‌ 345 రాజీవ్‌నగర్‌లో అప్పటి ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు పంపిణీ చేసింది. ఇరవై ఏండ్లుగా అక్కడ ఇండ్లు కట్టుకొని నివసిస్తున్నారు. కొందరు తమ ఇండ్ల స్థలాలను వేరే వ్యక్తులకు విక్రయించారు. కాగా అప్పట్లో కాంగ్రెస్‌ సర్కార్‌ పట్టాలిచ్చిన ఈ భూములను తాజాగా నిషేధిత జాబితాలో చేర్చారు. ఒక్క మంచిర్యాలలోనే 2022, గర్మిళ్లలో 1963, నస్పూర్‌లో 3178, తాళ్లపల్లిలో 803, సింగాపూర్‌లో 2256 ఇలా మొత్తం 10 వేలకు పైగా ఇంటి స్థలాలను నిషేధిత జాబితాలో చేర్చినట్లు చెబుతున్నారు. మంచిర్యాల జిల్లా నస్పూర్‌ సర్వే నంబర్‌ 42లో 30 ఎకరాల భూమిని ప్రభుత్వం 2005లో టీఎన్జీవో హౌసింగ్‌ సొసైటీకి ఇచ్చిన పటా భూములన్నింటినీ నిషేధిత జాబితాలో చేర్చారు. ఎంతో మంది రెవెన్యూ అధికారులు ఇండ్లు కట్టుకున్న సొసైటీ భూములనూ 22ఏలో చేర్చడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

సింగరేణి పట్టాలు సైతం

సింగరేణి భూముల్లో ఇండ్లు కట్టుకున్న వారికి కేసీఆర్‌ సర్కార్‌ జీవో 76 ద్వారా పట్టాలిచ్చింది. కొందరు పట్టాల కోసం దరఖాస్తు చేసుకొని, డబ్బులు కట్టేలోపు వెబ్‌సైట్‌ క్లోజ్‌ అయ్యింది. ఇప్పుడా భూములన్నింటినీ సర్కార్‌ నిషేధిత జాబితాలో చేర్చింది. పోనీ పట్టాలిచ్చిన వారికైనా ఇబ్బందులు లేవనుకుంటే వారిపైనా 22(ఏ) పిడుగు వేసింది. బీఆర్‌ఎస్‌ పట్టాలిచ్చిన చాలా ఇండ్లను ప్రొహిబిటెడ్‌ లిస్టులో పెట్టింది. మంచిర్యాల జిల్లా నస్పూర్‌, శ్రీరాంపూర్‌ ఏరియాల్లోని 11 కాలనీల్లో 141 ఎకరాల్లో దాదాపు 3200 ఇండ్లకు పట్టాలివ్వగా చాలా మంది స్థలాలను నిషేధిత జాబితాలో చేర్చారు. బెల్లంపల్లి, క్యాతన్‌పల్లిలోనూ ఇదే సమస్య ఉన్నది. నస్పూర్‌ విలేజీ సర్వే నంబర్‌ 72లో సింగరేణి ఓపెన్‌ కాస్ట్‌ కింద ఇల్లు కోల్పోయిన వారికి ప్రభుత్వం లే-అవుట్‌లు వేసి పట్టాలు పంపిణీ చేసింది. ఈ సర్వే నంబర్‌ మొత్తాన్ని నిషేధిత జాబితాలో పెట్టినట్టు తెలిసింది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లావ్యాప్తంగా అనేక గ్రామాల్లో ఇండ్లు, ఇండ్ల స్థలాలను నిషేధిత జాబితాలో చేర్చారు.

ప్రజల్లో అవగాహన లేమి

నిషేధిత జాబితాలో తమ ఆస్తులున్నాయా? లేదా? అనేది తెలుసుకోవడం ప్రజలు, రైతులకు ఇబ్బందిగా మారింది. వ్యవసాయ, ఇతర భూములకు సంబంధించి 22(ఏ)ను ఏడు రకాల మాడ్యూల్స్‌లో పొందుపరిచారు. 22ఏ (1)(ఏ) ప్రభుత్వ భూములు, 22 ఏ(1)(బీ) అసైన్‌ భూములు, 22ఏ (1) (సీ) వక్ఫ్‌బోర్డు భూములు, 22ఏ(1)సీ ఎండోమెంట్‌ భూములు, 22ఏ(1)డీ సర్‌ ప్లస్‌ ల్యాండ్స్‌, 22ఏ(1) (ఈ) సీసీఎల్‌ఏ పరిధిలోకి వచ్చే భూములు, కోర్టు కేసులు అండ్‌ అదర్స్‌ అని వేర్వేరుగా చూపించారు. ఇలా రూపొందించిన జాబితా సామాన్యులకు అర్థం కాకపోవడం వల్లే జాబితాపై అభ్యంతరాలు చెప్పలేకపోతున్నారని తెలిసింది. భూమిని అమ్ముకోవడానికి వెళ్లినప్పుడే ఆ విషయం తెలుస్తున్నదని స్వయంగా అధికారులే చెప్తున్నారు.

ఒక్కో సర్వే నంబర్‌ ఒక్కో తీరు..

నస్పూర్‌ 42 సర్వే నంబర్‌లో ప్రభుత్వ భూమి ఉండగా ఇందులో 22 ఎకరాలు కలెక్టరేట్‌కు, ఐదెకరాలు కోర్టుకు, కొంత భూమిని మిషన్‌ భగీరథకు కేటాయించినట్టు నమోదు చేశారు. గర్మిళ్ల శివారులోని 707, 708 సర్వే నంబర్లలో దాదాపు 38 ఎకరాల భూదాన్‌ భూమి ఉన్నట్టు, అది ఇప్పటికీ సర్కార్‌ ఆధీనంలో ఉన్నట్టు చూపించారు. జిల్లా జైలుకు ఐదెకరాలు కేటాయించారు. ఈ భూముల్లో కొంత భాగాన్ని ఆక్రమించి అక్రమార్కులకు మేలు చేసేలా మొత్తం భూమి 22ఏలో ఉన్నట్టు చూపించారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంచిర్యాల శివారు 345 సర్వే నంబర్‌ మొత్తం అసైన్డ్‌ భూములే. జంగ్‌ సిఫాయిలకు ఇచ్చిన ఈ భూముల్లో కొందరు 50 ఏండ్లుగా సాగు చేసుకుంటున్నారు. వారి భూములను కూడా నిషేధిత జాబితాలో చేర్చిన అధికారులు.. ఇదే సర్వే నంబర్‌లో వెంచర్లు వేసిన బడాబాబులకు మేలు చేసేలా కొన్ని ఎకరాలను ఉద్దేశపూర్వకంగా 22(ఏ) నుంచి తప్పించారన్న ఆరోపణలున్నాయి. స్పష్టత కోసం రిజిస్ట్రేషన్‌ శాఖ వెబ్‌సైట్‌ చూడగా, మంచిర్యాల మండలానికి సంబంధించి ప్రొహిబిటెడ్‌ లిస్టును బ్లర్‌ చేసి అప్లోడ్‌ చేశారు.

పట్టా భూమిని 22ఏలో పెట్టిండ్రు

మా తాత టొంబ్రే మల్లూ పటేల్‌ పేరుతో చింతలమానేపల్లి శివారు సర్వే నంబర్‌ 59లో 79 ఎకరాల 23 సెంట్ల భూమికి సంబంధించి 1969 నుంచి పట్టాలున్నయి. మా తాత నుంచి మా తండ్రులకు, వారి నుంచి మనవలమైన మాకు భూమి వచ్చింది. ఇప్పటికీ సాగు చేసుకుంటున్నం. మాది బందోబస్తు పట్టా. కానీ మా సర్వే నంబర్‌లో అసైన్డ్‌ పట్టాలు సైతం ఉన్నయ్‌. దీంతో మా భూములను కూడా నిషేధిత జాబితాలో చేర్చిండ్రు. మా గ్రామంలో ఇట్లా దాదాపు 930 ఎకరాలను 22(ఏ)లో చేర్చిండ్రు. కలెక్టర్‌ను, ఎంఆర్‌వోను కలిసి చెప్పినం. ఇప్పటికీ పట్టించుకుంటలేరు.

-టొంబ్రే మారుతి, రైతు, ఆసిఫాబాద్‌ జిల్లా, చింతలమానేపల్లి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana